కరీనా బిడ్డ క్యాన్సర్‌తో చావాలా? | Contravercy on kareena child name | Sakshi
Sakshi News home page

కరీనా బిడ్డ క్యాన్సర్‌తో చావాలా?

Published Thu, Dec 22 2016 5:53 PM | Last Updated on Mon, Sep 4 2017 11:22 PM

కరీనా బిడ్డ క్యాన్సర్‌తో చావాలా?

కరీనా బిడ్డ క్యాన్సర్‌తో చావాలా?

న్యూఢిల్లీ: ‘కరీనా కపూర్‌ బిడ్డ క్యాన్సర్‌ వచ్చి చనిపోవాలని కోరుకుంటున్నా, లేదంటే గర్భవతిగా ఉన్నప్పుడే కరీనాకు జికా వైరస్‌ సోకి ఉండాలని ఆశిస్తున్నా’ అంటూ ఇంతటి తీవ్రమైన, అభ్యంతకరమైన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో చోటు చేసుకోవడం శోచనీయం. కరీనా కపూర్‌ దంపతులు తమ పుత్రోత్సవానికి పొంగిపోయి ముద్దుగా ‘తైమూర్‌’ అంటూ పేరు పెట్టుకున్నందుకే ఈ రాద్ధాంతమంతా.

పిల్లలకు ఇష్టమైన పేర్లు పెట్టుకునే ప్రాథమిక హక్కు తల్లిదండ్రులదేనని, అందులో జోక్యం చేసుకొని వ్యాఖ్యలు చేసే హక్కు ఇతరులకు లేదనే విషయం సోషల్‌ మీడియా రోజుల్లో కూడా అర్థంకాక పోవడం ఆందోళనకరమే. చరిత్రలో రక్తపుటేరులు పారించిన ముస్లిం చక్రవర్తిగా తైమూర్‌ను పరిగణించడమే రాద్ధాంతానికి కారణమైతే. చరిత్రలో రక్తపుటేరులు పారించని హిందూ చక్రవర్తి లెవరో పేర్లు చెప్పండి. చరిత్రలో నిలిచిపోయిన హీరోలైనా, విలన్లయినా వారి వారి స్థల కాలాదులనుబట్టి మారుతూ ఉంటుంది. ఒకచోట ఒకరిని హీరోగా పరిగణిస్తే మరో చోట అదే హీరోను విలన్‌గా పరిగణిస్తారు. అశోకుడు, అలెగ్జాండర్, శివాజీ, చంఘీజ్‌ఖాన్, తామర్లేనిలను ప్రజలు అలాగే పరిగణిస్తూ వస్తున్నారు. ఇక్కడ తామర్లేని అంటే తైమూర్‌ (ఉక్కు) అని పిలిచే మంగోలియా చక్రవర్తియే.


రక్తపాతం....
1398లో తామర్లేని ఢిల్లీ సుల్తాన్‌ తుగ్లక్‌ రాజ్యంపై దండయాత్ర జరిపి రక్తపాతం సృష్టించారన్నది చరిత్రలో వాస్తవమే. ఈ దండయాత్రలో వేలాది మంది మరణించారు. ఆయన హిందూ రాజ్యాలపైనేకాకుండా ఢిల్లీతోపాటు ఇరాక్, సిరియా దేశాల్లోని అనేక ముస్లిం రాజ్యాలపై కూడా దండయాత్రలు జరిపారు. ఆ తర్వాత ఆయన పాలించిన రాజ్యాలన్నింటిలోనూ ప్రజారంజకుడిగా, వీరుడిగా కీర్తింపబడ్డారు.

మరాఠా రాజుల రక్తపాతం...
18వ శతాబ్దంలో మొగల్‌ రాజుల పతనానికి కారణమైన మరాఠా హిందూ రాజులు కూడా తామర్లేనికన్నా ఎక్కువ రక్తపాతమే సృష్టించారు. వారు బెంగాల్, గుజరాత్‌పై జరిపిన దాడుల్లో నాలుగులక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు ప్రజారంజకుడిగా కీర్తింపబడి ఛత్రపతి శివాజీ చరిత్రలో కూడా రక్తసిక్త పుటలు ఎన్నో ఉన్నాయి. బ్రాహ్మణ పీష్వాల దాడుల్లో కూడా ఎంతో మంది మరణించారు.

చారిత్రక దృష్టి అవసరం....
హిందువులు, ముస్లింలు అన్న కోణం నుంచి చూసినప్పుడే ‘తైమూర్‌’ అనే పదానికి మనకు అర్థం మారుతుంది. ఒక వర్గానికి తైమూర్‌ విలన్‌గా కనిపిస్తే, మరో వర్గానికి శివాజీ విలన్‌గా కనిపిస్తారు. చరిత్రను ఎప్పుడైనా అప్పటి కాలమాన పరిస్థితులనుబట్టి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ‘నర జాతి చరిత్ర సమస్తం పర పీడన పరాయనత్వం. రణరంగ రక్తసిక్తం. చంఘీజ్‌ ఖాన్, తామర్లేని....ఎవడైతేనేం ఒక్కొక్కడు మహా హంతకుడు’ అంటూ మహాకవి శ్రీశ్రీ తన దృష్టితోని చరిత్రను చూడడం గమనార్హం.

షారుక్‌ ఖాన్‌ అనే పేరు పెట్టి ఉంటే....
ఓ ముస్లింను చేసుకున్న కరీనా కపూర్‌ తన కుమారుడికి ఓ ముస్లిం రాజు పేరు పెట్టుకుంటే మనకెందుకు అభ్యంతరం. తైమూర్‌ కుమారుడు షారూక్‌ ఖాన్‌ పేరు పెట్టుకొని ఉంటే ఏమైనా అనేవాళ్లమా ? ఆ మాటకొస్తే ఏ పేరు పెట్టుకుంటే మనకెందుకు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement