కొత్త సినిమాలేవీ అంగీకరించకూడదు!
ప్రస్తుతం చేస్తున్న సినిమాలు మినహా శ్రుతీహాసన్ వేరే కొత్త సినిమాలేవీ అంగీకరించకూడదని హైదరాబాద్ మూడో అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఓ ఉత్తర్వు జారీ చేసింది. హైదరాబాద్, చెన్నైలకు చెందిన పిక్చర్ హౌస్ మీడియా చేసిన ఫిర్యాదును పరిశీలించిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశించింది. నాగార్జున, కార్తి హీరోలుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సంస్థ తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం నిర్మిస్తోంది. ఇందులో శ్రుతీహాసన్‌ను నాయికగా తీసుకున్నారు.
తొలి షెడ్యూల్ పూర్తవుతున్న నేపథ్యంలో శ్రుతీహాసన్‌కి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించాలనుకున్నారు. అయితే, తేదీలు ఖాళీ లేకపోవడం వల్ల ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నాననీ ‘ఇ-మెయిల్’ ద్వారా తమకు శ్రుతీహాసన్ తెలియజేశారట. ఆ విషయం శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పిక్చర్ హౌస్ మీడియా సంస్థ పేర్కొంది. ముందుగా సంప్రతించే శ్రుతి డేట్లు తీసుకున్నామనీ, ఆమె అప్పుడు ఒప్పుకొని ఇప్పుడు తప్పుకోవడం వల్ల కోట్ల రూపాయల్లో తమకు నష్టం వాటిల్లడంతో పాటు, ఇతర నటీనటుల సమయం కూడా వృథా అవుతోందనీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో వారు శ్రుతీహాసన్‌పై కేసు పెట్టారు. ఈ కేసుని విచారించి ఇది సివిల్ అఫెన్స్ అనీ, తదుపరి ఆర్డర్లు వెలువడే వరకూ శ్రుతీహాసన్ కొత్త సినిమాలు అంగీకరించకూడదనీ న్యాయస్థానం ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. క్రిమినల్‌కేసు నమోదు చేసి, విచారణ చేయాలని పోలీసుల్ని ఆదేశించింది.