Metropolitan Magistrate court
-
మత్తు వదలరా.. చెత్త ఎత్తరా.!
బీచ్‌రోడ్డు(విశాఖ తూర్పు): ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా మద్యం మత్తులో వాహనాలు నడిపిన మందుబాబులకు మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టు వినూత్నమైన శిక్ష వేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన 52 మందిని మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టులో మంగళవారం పోలీసులు హాజరు పరిచారు. వారందరితో ఆర్.కె.బీచ్‌లో చెత్తను ఎత్తి బీచ్ శుభ్రం చేయాలని కోర్టు శిక్ష విధించింది. దీంతో మూడో పట్టణ ట్రాఫిక్ సీఐ షణ్ముఖరావు ఆధ్వర్యంలో పోలీసులు ఈ శిక్షను అమలు చేశారు. వారితో బీచ్‌లో చెత్తను ఎత్తించారు. సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే జరిమానా విధిస్తారు. కానీ ఇటువంటి శిక్ష విధించటంతో మందుబాబుల మత్తు దిగిపోయింది. ఇప్పటికైనా అలాంటి వారిలో మార్పు వస్తుందని ఆశిద్దాం. -
‘డ్రంకెన్ డ్రైవ్’కి రూ. పది వేలు
సాక్షి, హైదరాబాద్: మద్యం తాగి వాహనం నడుపుతున్నారా.. ఇక ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిందే.. మొన్నటి వరకు రూ.2,000 జరిమానాతోనే సరిపెట్టిన మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ కోర్టు ఇప్పుడు మోటార్ వెహికల్ యాక్ట్ నూతన నిబంధనల ప్రకారం రూ.10,500 జరిమానా వేస్తోంది. ఇటీవల డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ఫలక్‌నుమా, బహదూర్‌పుర, సుల్తాన్‌బజార్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ పరిధిలో పట్టుబడిన 9 మందికి రూ.10,500 చొప్పున నాంపల్లి మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ ట్రాఫిక్ మొబైల్ కోర్టు గురువారం జరిమానా విధించింది. సైబరాబాద్‌లో రూ.ఐదు వేల ఫైన్ సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో నాలుగు రోజుల నుంచి డ్రంకెన్ డ్రైవర్లకు రూ.ఐదు వేల జరిమానా విధిస్తున్నారు. కూకట్‌పల్లిలోని మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ కోర్టు దాదాపు 50 మందికి రూ. 5 వేల చొప్పున జరిమా నా విధించిందని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. అయితే హైదరాబాద్‌లో రూ.10,500 జరిమానా తొలిసారిగా 9 మందికి విధించడంతో అక్కడా కూడా ఈ విధానాన్ని ఆయా కోర్టులు అమలు చేసే అవకాశముందని భావిస్తున్నారు. ఈ కొత్త జరిమానాల వల్ల డ్రంకన్ డ్రైవ్‌లు, రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ట్రాఫిక్ పోలీసులు అభిప్రాయపడుతున్నారు. -
కొత్త సినిమాలేవీ అంగీకరించకూడదు!
ప్రస్తుతం చేస్తున్న సినిమాలు మినహా శ్రుతీహాసన్ వేరే కొత్త సినిమాలేవీ అంగీకరించకూడదని హైదరాబాద్ మూడో అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఓ ఉత్తర్వు జారీ చేసింది. హైదరాబాద్, చెన్నైలకు చెందిన పిక్చర్ హౌస్ మీడియా చేసిన ఫిర్యాదును పరిశీలించిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశించింది. నాగార్జున, కార్తి హీరోలుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సంస్థ తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం నిర్మిస్తోంది. ఇందులో శ్రుతీహాసన్‌ను నాయికగా తీసుకున్నారు. తొలి షెడ్యూల్ పూర్తవుతున్న నేపథ్యంలో శ్రుతీహాసన్‌కి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించాలనుకున్నారు. అయితే, తేదీలు ఖాళీ లేకపోవడం వల్ల ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నాననీ ‘ఇ-మెయిల్’ ద్వారా తమకు శ్రుతీహాసన్ తెలియజేశారట. ఆ విషయం శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పిక్చర్ హౌస్ మీడియా సంస్థ పేర్కొంది. ముందుగా సంప్రతించే శ్రుతి డేట్లు తీసుకున్నామనీ, ఆమె అప్పుడు ఒప్పుకొని ఇప్పుడు తప్పుకోవడం వల్ల కోట్ల రూపాయల్లో తమకు నష్టం వాటిల్లడంతో పాటు, ఇతర నటీనటుల సమయం కూడా వృథా అవుతోందనీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వారు శ్రుతీహాసన్పై కేసు పెట్టారు. ఈ కేసుని విచారించి ఇది సివిల్ అఫెన్స్ అనీ, తదుపరి ఆర్డర్లు వెలువడే వరకూ శ్రుతీహాసన్ కొత్త సినిమాలు అంగీకరించకూడదనీ న్యాయస్థానం ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. క్రిమినల్కేసు నమోదు చేసి, విచారణ చేయాలని పోలీసుల్ని ఆదేశించింది. -
‘అవును.. అతను ర్యాష్ డ్రైవింగ్‌తో చనిపోయాడు’
ప్రమాద ఘటనలో నిర్ధారించిన కోర్టు న్యూఢిల్లీ: బాధ్యతా రాహిత్యంతో వాహనాన్ని నడిపి ఓ వ్యక్తి మరణానికి కారణమైన నిందితుణ్ని దోషిగా నిర్ధారిస్తూ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పునిచ్చింది. ఇతర ప్రయాణికుల భద్రతను పట్టించుకోకుండా ట్రాఫిక్ నిబంధనలు గాలికొదిలేసి నిందితుడు వాహనాన్ని నడిపిన విషయం రుజువైందని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసును విచారించిన మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ మనీషా ఖురానా నిందితుడు రాజేష్(ఉత్తరప్రదేశ్)ను దోషిగా నిర్ధారిస్తూ తీర్పునిచ్చారు. ట్రాఫిక్ రూల్స్ పాటించడంలో నిందితుడు పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరించాడని న్యాయమూర్తి చెప్పారు. మోటార్ వెహికల్ చట్టం ప్రకారం నిందితుని ప్రవర్తన చూస్తుంటే స్వతహాగా నేరాలోచన ఉన్నట్లు తేలిందన్నారు. నిందితుడు దోషి అని రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ కూడా సఫలమైందని తెలిపారు. కాగా, ఈ సందర్భంగా ప్రత్యక్షసాక్షిని విచారించారు. ప్రమాదస్థలికి సమీప ప్రదేశంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే రాజీవ్‌సింగ్ ఘటన జరిగిన విధానాన్ని కోర్టుకి తెలియజేశారు. రెడ్ సిగ్నల్ పడినా కూడా ఆగకుండా నిర్లక్ష్యంతో వేగంగా నిందితుడు ముందుకు దూసుకెళ్లాడని అతను చెప్పాడు. దీంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని రాజీవ్ తెలిపాడు. సంఘటన వివరాలు.. రాజేష్ అనే వ్యక్తి తన ట్రక్‌లో 2011, మే 9న అన్సాల్ ప్లాజా వైపు వేగంగా దూసుకువచ్చాడు. అక్కడ ఉన్న ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఆగకుండా వెళ్లి లోధి కాలనీ వైపు నుంచి వచ్చిన ఓ కారును ఢీకొట్టాడు. దీంతో ఆ కారు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న గౌరవ్ గుజ్రాల్ తీవ్ర గాయాలపాలయ్యాడు. అత్యవసర చికిత్స నిమిత్తం అతన్ని ఎయిమ్స్ ట్రామా కేర్ సెంటర్‌కి తీసుకెళ్లగా, అప్పటికే గౌరవ్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనలో నిందితుడైన రాజేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు.