
ప్రముఖ నటి దీపికా పదుకొనే
సాక్షి, న్యూఢిల్లీ : పద్మావత్ బాలివుడ్ చిత్రంలో పద్మావతిగా నటించి విశేష ప్రేక్షకాదరణను మూటకట్టుకున్న సినీతార దీపికా పదుకొనే విశాల్ భరధ్వాజ్ దర్శకత్వంలో రానున్న చిత్రంలో ‘లేడీ డాన్’గా నటిస్తున్నారు. ముంబై మాఫియా సామ్రాజ్యంలో రారాణిగా పేరుపొందిన స్వప్నాదీదీ అలియాస్ అశ్రాఫ్ ఖాన్‌గా ఆమె తెర మీదకు రానున్నారు.
తన భర్తను చంపాలని కుట్రపన్నిన మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంను దుబాయ్ నుంచి భారత్‌కు రప్పించి హత్య చేయాలనే ఏకైక లక్ష్యంతో స్వప్న దీదీగా మాఫియా సామ్రాజ్యంలోకి అడుగుపెట్టిన అశ్రాఫ్ ఖాన్ ఎదుర్కొన్న అనుభవాల్లో ఎలాంటివో ఈ సినిమాలో హద్యంగా చూపించనున్నారు.
‘13వ శతాబ్దానికి చెందిన ‘పద్మావతి’ పాత్రలో నటించిన తర్వాత ఓ మహిళా శక్తి ఎలాంటిదో చూపించే స్వప్నా దీదీ పాత్రలో నటించేందుకు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాను. నిజంగా జరిగిన స్వప్నా దీదీ కథ నాకు ఎంతో నచ్చింది. ఇంకా ఈ సినిమాకు ఎలాంటి పేరు పెడతారో నాకు తెలియదు.
కానీ పద్మావతి పాత్రలో నటించిన నేను ఇప్పుడు అందుకు పూర్తి భిన్నమైన పాత్రలో నటించే అవకాశం వచ్చినందుకు ఎంతో ఆనందిస్తున్నాను. పాత్రకు పూర్తి న్యాయం చేస్తానన్న విశ్వాసంతో ఉన్నాను’ అని దీపికా పదుకొనే మీడియాతో వ్యాఖ్యానించారు. జేన్ బోర్జెస్‌తో కలిసి ఎస్ హుస్సేన్ జాయ్‌దీ రచించిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ది ముంబై’ అనే పుస్తకంలోకి అంశాల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం ఈ ఏడాది చివరలో విడుదలవుతుందని నిర్మాణ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment