దీపికా పదుకొనే
బాలీవుడ్ నటులకు అవార్డుల పంట
Published Mon, Dec 30 2013 11:37 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
శృంగార, హాస్య పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉత్తమ నటన కనబరిచిన బాలీవుడ్ నటి దీపికా పదుకొనేకు మూడు బిగ్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డులు దక్కాయి. రిలయన్స్ బ్రాడ్‌కాస్ట్ నెట్‌వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నాలుగో ఎడిషన్ బిగ్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డుల ప్రధాన కార్యక్రమం జరిగింది. భారత సినిమాల్లో అత్యుత్తమ నటన కనబరిచిన నటులకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ ఏడాది నాలుగు సినిమాల్లో హిట్ కొట్టిన పదుకొనే ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ సినిమాకు మహిళా విభాగంలో మోస్ట్ ఎంటర్‌టైనింగ్ యాక్టర్ అవార్డును సొంతం చేసుకుంది. ఇదే కేటగిరీ పురుషుల విభాగంలో భాగ్ మిల్కా భాగ్ సినిమాకు ఫర్హన్ అక్తర్ అవార్డును దక్కించుకున్నాడు.
క్రిష్ 3 సినిమా నిర్మించి ప్రేక్షకుల మదిని దోచుకున్న సినీ నిర్మాత రాకేశ్ రోషన్, మోస్ట్ ఎంటర్‌టైనింగ్ డెరైక్టర్ అవార్డును సొంతం చేసుకున్నాడు. భాగ్ మిల్కా భాగ్ ఈ ఏడాదికి ఎంటర్‌టైనింగ్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్ అవార్డును దక్కించుకుంది. బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్‌కు స్టార్ ప్లస్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ద ఇయర్, మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు ఎంటర్‌టైనర్ ఆఫ్ ద సెంచరీ అవార్డులు వచ్చాయి. లూటేరా, అశిక్వి 2 రొమాంటిక్ సినిమాల్లో మోస్ట్ ఎంటర్‌టైనింగ్ యాక్టర్ అవార్డులను సోనాక్షి సిన్హా, ఆదిత్య రాయ్ కపూర్ సొంతం చేసుకున్నారు.
యే జవానీ హై దివానీ సినిమా బెస్ట్ రొమాంటిక్ ఫిల్మ్‌గా నిలిచింది. ఆశిక్వి 2 సినిమాలో నటించిన ఆదిత్య రాయ్ కపూర్, శ్రద్ధా కపూర్‌లు, చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో నటించిన షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే జోడీలు బెస్ట్ రొమాంటిక్ కపుల్ అవార్డులను దక్కించుకున్నారు. చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన దీపికాకు, జాలీ ఎల్‌ఎల్‌బీలో హాస్యం పండించిన అర్హద్ వర్సీకి మోస్ట్ ఎంటర్‌టైనింగ్ యాక్టర్ ఇన్ ఏ కామెడీ ఫిల్మ్ అవార్డులను సొంతం చేసుకున్నారు. క్రిష్ 3లో యాక్షన్‌తో మెప్పించిన నటుడు హృతిక్ రోషన్‌కు మోస్ట్ ఎంటర్‌టైనింగ్ అవార్డు దక్కింది. బెస్ట్ యాక్షన్ ఫిల్మ్ అవార్డును రాంలీలా సినిమా గెలుచుకుంది.
Advertisement
Advertisement