తారాజువ్వలు | diwali special movies | Sakshi
Sakshi News home page

తారాజువ్వలు

Published Tue, Nov 10 2015 12:35 AM | Last Updated on Sun, Sep 3 2017 12:17 PM

తారాజువ్వలు

దీపాల వెలుగులు, మతాబుల మెరుపులు, తియ్య తియ్యని మిఠాయిలతో దీపావళి పండగ భలే సందడి సందడిగా ఉంటుంది. సినీ ప్రియులకైతే కొత్త సినిమాలు తెర మీదకొస్తేనేసంపూర్ణమైన పండగ సందడి. సినిమా వసూళ్ళకు పండగల సీజన్ బాగుంటుంది కాబట్టి
 నిర్మాతలు కూడా తమ చిత్రాలను పండగల్లో రిలీజ్ చేయాలనుకోవడం సహజం. ఈ దీపావళికి తెలుగులో మన ‘అఖిల్’తో పాటు ఇతర భారతీయ భాషల్లో విడుదలవుతున్న కొన్ని పండగ సినిమాలపై ఓ లుక్కేద్దాం...
 
తమిళంలో... కమల్ వర్సెస్ అజిత్!
తమిళ దీపావళి పండగ సందడి ఈ ఏడాది రెండు భారీ చిత్రాలతో మొదలవుతోంది. ఒకటి కమలహాసన్ నటించిన ‘తూంగావనమ్’, మరొకటి అజిత్ ‘వేదాళమ్’. ఈ రెండు చిత్రాలూ నరక చతుర్దశి రోజైన ఈ మంగళవారమే (నవంబర్ 10) జనం ముందుకు వస్తున్నాయి. తమిళ బాక్సాఫీస్ వద్ద పండగ పోటీ ప్రధానంగా ఈ ఇద్దరు పెద్ద హీరోల మధ్య సాగనుంది. కాగా, ఈ పండగ వారాంతంలోనే మరో నాలుగు (‘న రన్, పాంబు సట్టై, ఉరుమీన్, సిపాయి’) తమిళ చిత్రాలు విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్నాయి.
 రేసీ థ్రిల్లర్
 
‘తూంగావనమ్’ అంటే నిద్ర పోని అడవి అని అర్థం. ఈ టైటిల్‌తో ఆద్యంతం ఆసక్తికరంగా సాగే సినిమా చేశారు కమలహాసన్. ఇందులో ఆయన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు. కిడ్నాప్ అయిన తన కుమారుణ్ణి రక్షించే తండ్రి కథ ఇది. రాజేశ్ ఎం.సెల్వా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. రెండు గంటల నిడివితో సాగే రేసీ థ్రిల్లర్ ఇది. త్రిష, ప్రకాశ్‌రాజ్ తదితరుల కాంబినేషన్‌లో కేవలం 37 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసేశారు. తమిళంతో పాటు తెలుగు వెర్షన్‌ను కూడా ఏకకాలంలో చిత్రీకరించారు. తెలుగు వెర్షన్ ‘చీకటి రాజ్యం’ను ఈ నెల 20న విడుదల చేయనున్నారు.
 
మాస్ మసాలా
తమిళంలో తిరుగులేని మాస్ హీరో అజిత్. ఈ మాస్ హీరోతో గత ఏడాది ‘వీరమ్’ వంటి హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన శివ మళ్లీ అజిత్‌తో చేసిన చిత్రం - ‘వేదాళం’. తెలుగులో గతంలో ‘దరువు’, ‘శౌర్యం’, ‘శంఖం’ చిత్రాలు రూపొందించిన ఈ దర్శకుడు తీసిన పూర్తి స్థాయి యాక్షన్ మాస్ మసాలా మూవీ. శ్రుతీహాసన్ కథానాయిక. ఇందులో అజిత్ సోదరిగా లక్ష్మీ మీనన్ నటించారు. 2002లో అజిత్ ‘రెడ్’ అనే చిత్రంలో నటించారు. ఆ చిత్రంలో కనిపించిన లుక్‌కి దగ్గరగా ‘వేదాళం’ ఉంటుంది. ఇందులో అజిత్ చేసినది టాక్సీ డ్రైవర్ పాత్ర కావడంతో సినిమా పక్కా మాస్‌గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. వాస్తవానికి ఈ చిత్రం చివరి షెడ్యూల్‌లో అజిత్‌కి చిన్నపాటి ప్రమాదం జరిగింది. దానివల్ల షూటింగ్‌కి కొంచెం ఆటంకం ఏర్పడింది. అయితే దీపావళికే విడుదల చేయాలనే పట్టుదలతో అజిత్ తన గాయాన్ని లెక్క చెయకుండా షూటింగ్ చేశారు.
 
 తెలుగు, తమిళ, హిందీలతో పాటు కన్నడంలో ఈ బుధవారం ‘కిల్లింగ్ వీరప్పన్’ , ‘బాక్సర్’, గురువారం ‘రామ్‌లీల’ చిత్రాలు విడుదల కానున్నాయి. మలయాళంలో శుక్రవారం ‘అనార్కలి’ చిత్రం విడుదల కానుంది. మొత్తం మీద ఐదు భాషల్లో కలిపి డజను చిత్రాలు విడుదల కానుండటం గమనార్హం. ప్రతి దీపావళితో పోలిస్తే ఈ సినిమా సందడి తక్కువేనని కొందరు పరిశీలకుల భావన. సంఖ్య మాటెలా ఉన్నా... అంచనాలు భారీగా ఉన్న సినిమాలు బరిలో ఉన్నాయి కాబట్టి, ఈసారి సినిమా హాళ్ళు కూడా వసూళ్ళతో వెలిగిపోతాయనుకోవచ్చు. ఆల్ ది బెస్ట్... టూ సినిమా... అండ్ సినిమా లవర్స్!
 
సింగిల్‌గా అఖిల్

తెలుగు పరిశ్రమలో ఈ దీపావళికి విడుదల కానున్న ఏకైక స్ట్రయిట్ మూవీ - ‘అఖిల్’. పోటీలో వేరే చిత్రాలు లేకపోవడం ఈ చిత్రానికి ఓ ప్లస్ అని చెప్పాలి. హీరోగా అఖిల్ నటించిన తొలి చిత్రం కాబట్టి, అక్కినేని అభిమానులు ఈ చిత్రం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. చిన్నప్పుడు ‘సిసింద్రీ’గా అలరించి, పెద్దయ్యాక ‘మనం’లో తెరపై కొన్ని సెకన్ల పాటు కనిపించి, స్క్రీన్ ప్రెజెన్స్ బాగుందని అందరి అభినందనలూ అందుకున్నాడు అఖిల్. ఈ అక్కినేని నటవారసుడు తాతకు తగ్గ మనవడు అనిపించుకుంటాడా? తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటాడా? అనే చర్చ జరుగుతోంది. చిత్రదర్శకుడు వీవీ వినాయక్ దర్శకత్వంలో అఖిల్ డ్యాన్సులు, ఫైట్లు, కామెడీ బాగా చేశాడని అంటున్నారు. ఈ చిత్రం నిడివి రెండు గంటల పది నిమిషాలు. అఖిల్ ఏ రేంజ్‌లో విజృంభించాడో మరికొన్ని గంటల్లో తెలిసిపోతుంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement