పెళ్లంటే ఇష్టం లేదు
పెళ్లి అనేది ఒక వరం. జీవితంలో ఒక భాగం. హైందవ సంప్రదాయం. ఇవన్నీ అనాదిగా సమాజంలో నడుస్తున్న సనాతన భావాలు. అలాంటి సంప్రదాయానికిప్పుడు చిల్లులు పడుతుండటం చూస్తున్నాం. నాగరీకత పేరుతో సహజీవనం లాంటి సంస్కృతి చాపకింద నీరులా పాకుతోందని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. అదేవిధంగా పెళ్లంటే ఆసక్తి లేదు, పెళ్లి అవసరమా? అసలు పెళ్లే చేసుకోను వంటి ధోరణి అమ్మాయిలో పెరుగుతోంది. నటి శ్రుతీహాసన్ పెళ్లి చేసుకునే ఆలోచన లేదు అని బహిరంగంగానే చెప్పారన్నది గమనార్హం. ఇప్పుడు తనది అదే బాట అంటోంది నటి లక్ష్మీమీనన్. కుంకీ చిత్రంతో కోలీవుడ్ దృష్టిని తన వైపుకు తిప్పుకున్న ఈ మాలీవుడ్ అమ్మడు ఆ తరువాత వరుస విజయాలతో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంది.
చదువుకునే రోజుల్లోనే సినిమాల్లో హీరోలతో ప్రేమ పాఠాలు వల్లించడంతో కాస్త వివాదాలకు దారితీసినా ఆ విషయంలో అంత దుమారం ఏమీ చెలరేగలేదు. అదేవిధంగా నటిస్తూనే ప్లస్ 2 పరీక్షలు రాసి పాసయ్యి కళాశాల లో చేరింది. ప్రస్తుతం బీఏ లిటరేచర్ మొదటి సంవత్సరం చదువుతున్న లక్ష్మీమీనన్ తాజాగా అజిత్ హీరోగా నటిస్తున్న చిత్రంలో ఆయనకు చెల్లెలిగా నటిస్తోంది. మరో వైపు జయం రవితో హార్రర్ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతోంది. ఇలా చదువు, నటనతో బిజీగా ఉన్న ఈ కేరళా కుట్టి పెళ్లి విషయానికొచ్చేసరికి సంప్రదాయానికి విరుద్ధంగా మాట్లాడుతోంది. దీని గురించి లక్ష్మీమీనన్ ఏమంటుందో చూడండి. నన్ను ప్రేమిస్తున్నానని చాలా మంది చెప్పారు. అందతా నేను పట్టించుకోలేదు. ఎవరన్నా ప్రేమిస్తున్నానంటూ సన్నిహితంగా నాతో తిరుగుతుంటే రెండు వారాల తరువాత వారితో మాట్లాడటం మానేస్తాను. ప్రేమలో పడితే జీవితమే నాశనం అవుతుంది. పెళ్లి చేసుకోవడం కూడా నాకిష్టం లేదు. నటుల్లో జయంరవి, సిద్ధార్థ్ లంటే ఇష్టం.