ఇప్పుడు నాకు ప్రతి క్షణం విలువైనదే! | Every moment is now worthwhile :Nagarjuna | Sakshi
Sakshi News home page

ఇప్పుడు నాకు ప్రతి క్షణం విలువైనదే!

Published Wed, Jan 1 2014 12:04 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

ఇప్పుడు నాకు ప్రతి క్షణం విలువైనదే! - Sakshi

ఇప్పుడు నాకు ప్రతి క్షణం విలువైనదే!

నాగార్జున మంచికొడుకు... మంచి తండ్రి. మంచి హీరో... మంచి నిర్మాత. ఓవరాల్‌గా ఆయనో గుడ్ పర్సన్. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడిన తీరులో ఈ లక్షణాలన్నీ కనిపించాయి. తాను నిర్మించిన ‘ఉయ్యాలా జంపాలా’ సినిమా ప్రేక్షకాదరణ చూరగొంటోందని ఆనందం వ్యక్తం చేస్తూ, తన తండ్రి గురించి, తన బిడ్డల గురించి, తన భవిష్యత్ ప్రణాళికల గురించి, చేసిన తప్పులు గురించి, చేయాలనుకుంటున్న ఒప్పుల గురించి మనసు విప్పి మాట్లాడారు.
 
 కొంతవరకూ ఆ బాధను మరపించింది: ‘13’ని చాలామంది బ్యాడ్ నంబర్ అంటారు. అందుకు తగ్గట్టే... 2013 ఇబ్బందిగా సాగింది. గ్రీకువీరుడు, భాయ్ పరాజయాలు.. నాన్నగారి అనారోగ్యం.. ఇలా ఎన్నో ఇబ్బందులు. వీటి మధ్య కూడా ఆనందాన్ని పంచిన విషయం మాత్రం ‘ఉయ్యాలా జంపాలా’. గ్రామీణ నేపథ్యంలో ప్రేమకథలు ఈ మధ్య రావడం లేదు. ఆ లోటుని తీర్చేసిందీ సినిమా. వసూళ్ల లెక్కల్ని తీసి పక్కన పెడితే...నా దృష్టిలో ఈ సినిమా వెరీ బిగ్ హిట్. 
 
 నాపై నాకే గౌరవం పోయింది: ‘భాయ్’ ఇచ్చిన అనుభవంతో నాపై నాకే గౌరవం పోయింది. ఈ సినిమా చూస్తే... నా కుటుంబ సభ్యులకు కూడా నాపై గౌరవం సన్నగిల్లుతుందని వారిని కూడా సినిమా చూడొద్దన్నాను. ఇన్నాళ్లూ ప్రేక్షకులు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశానని చాలా బాధపడ్డాను. ఈ సినిమాకు నిర్మాతను నేనే కాబట్టి, ఎవర్నీ నిందించలేను. ఇక నుంచి అలాంటి పొరపాట్లు చేయను. ‘భాయ్’ నేర్పిన గుణపాఠంతో ఇక నుంచి నవ్యమైన కథలతోనే సినిమాలు చేస్తాను. బెల్లంకొండ సురేష్, ఎస్.గోపాల్‌రెడ్డిల సినిమాలను గతంలో ‘ఓకే’ చేశాను. కానీ వాటిని కూడా రద్దు చేసుకున్నాను. కొత్త కథలతో వస్తేనే చేస్తా. ప్రస్తుతం నాకు దొరికిన ప్రతి క్షణం విలువైనదే. సాధ్యమైనంత వరకూ ఎక్కువ సమయాన్ని నాన్నగారి కోసమే కేటాయిస్తున్నాను. 
 
 నాన్న కాస్త బలహీనంగా ఉన్నారు: నాన్న పరిస్థితి ఎలా ఉందని చాలామంది అడుగున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. అయితే... కాస్త నీరసంగా ఉన్నారు. హార్ట్ ప్రాబ్లమ్ వల్ల కూర్చుని ఒక్క సారి లేస్తే... ఆయనకు కళ్లు తిరుగుతున్నాయి. అందుకే వీల్‌చైర్‌లో ఉంటున్నారు. అవసరం మేరకు నడుస్తున్నారు. మొన్నటివరకూ ఎర్లీ మార్నింగ్ అన్నపూర్ణ స్టూడియోలో మార్నింగ్ వాక్ చేసేవారు. ఇప్పుడు ఇంట్లోనే చేస్తునారు. నాన్న ఉదయం నిద్ర లేవగానే మా ఫ్యామిలీ మొత్తం ఆయన ముందు ఉంటున్నాం. నాన్న కూడా సరదాగా ఉంటున్నారు. ముందెన్నడూ చెప్పని ఆసక్తికరమైన విషయాలెన్నో చెబుతున్నారు.  సర్జరీ తర్వాత కూడా నటించారు: ‘మనం’ సినిమాలో నాన్నగారిపై తీయాల్సిన కొన్ని సీన్స్ ఉండగా... ఆయనకు సర్జరీ జరిగింది. ‘సినిమా పూర్తవ్వడానికి చాలా టైమ్ ఉంది.
 
 మీరు పూర్తిగా కోలుకున్నాక షూటింగ్ పెట్టుకుందాం’ అని చెప్పినా ఆయన వినలేదు. అంత ఇబ్బందిలో కూడా షూటింగ్‌లో పాల్గొన్నారు. ‘ఏమో.. అనారోగ్యం వల్ల ముందు ముందు నా వాయిస్‌లో ఏమైనా తేడా వస్తుందేమో..’ అని డబ్బింగ్ కూడా ఇంట్లోనే చెప్పేశారు. ఈ వయసులో కూడా అంత డెడికేషన్ ఉండటం నిజంగా గ్రేట్.ఇద్దరూ సమానమే: చైతూ, అఖిల్ ఇద్దరూ నాకు సమానమే. అయితే... చైతూ నాకు మంచి ఫ్రెండ్. నాతో తను అన్నీ పంచుకుంటాడు. నాకు భావోద్వేగాలు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. వాడికి అలాంటివి ఉండవ్. స్టేబుల్‌గా ఉంటాడు.
 
 నేనేమైనా ఉద్వేగానికి లోనైతే.. నన్ను సముదాయిస్తాడు. మెచ్యూర్డ్ మెంటాల్టీ వాడిది. పెద్దలపై గౌరవం కూడా ఎక్కువ. ‘మనం’లో నాన్నని ఓ సన్నివేశంలో ‘ముసలోడా’ అనాలి. దానికి ఎంత ఇబ్బంది పడ్డాడో. ‘ఇది సినిమారా.. అనాలి. అవసరమైతే... తర్వాత సారీ చెప్పు’ అని నాన్న ఎంత చెప్పినా వినేవాడు కాదు. కష్టపడి వాడితో ఆ మాట అనిపించాం. ‘మనం’లో అఖిల్ ఉన్నాడని చాలామంది అనుకుంటున్నారు. అందులో నిజంలేదు. అఖిల్ హీరోగా ఈ ఏడాదే సినిమా ఉంటుంది. నేనే నిర్మాతను. దర్శకుణ్ణి ఎంచుకునే బాధ్యత అఖిల్‌దే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement