ఆ విషయంలో దర్శకులు జాగ్రత్తగా ఉండాలి
ముంబై: బాలీవుడ్ చిత్రం ఉడ్తా పంజాబ్ సెన్సార్ విషయంలో వార్తల్లో నిలిచిన సెన్సార్ బోర్డు చైర్మన్ పహ్లాజ్ నిహలాని.. ‘ఢిష్యూం’ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నర్తించిన పాట వివాదాస్పదం కావడంపై స్పందించారు. మత విశ్వాసాలకు సంబంధించిన విషయాల్లో సినీ దర్శకులు జాగ్రత్తగా ఉండాలని నిహలాని సూచించారు. తమ మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఢిష్యూం సినిమాలో పాటను చిత్రీకరించారని సిక్కు మతస్తులు ఫిర్యాదు చేశారు.
దీనిపై నిహలాని స్పందిస్తూ.. దర్శకులు భావప్రకటన స్చేచ్ఛ పేరుతో ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీస్తే సమస్యలు వస్తాయని అన్నారు. ‘దేశంలో మతవిశ్వాసాలు చాలా సున్నితమైన అంశం. తమ మత విశ్వాసాలకు భంగం కలిగితే ప్రజలు బాధపడతారు. సమస్యలు ఏర్పడతాయి’ అని చెప్పారు. సున్నితమైన మతవిషయాలకు సంబంధించిన సినిమా దృశ్యాలను మతగురువుల సమక్షంలో సెన్సార్ చేయాలని నిహలాని ప్రతిపాదించారు .