ఈ చిన్ని లైఫ్... చేజారిపోతే రాదు!
‘‘ఇందులో నా పాత్ర ఫ్రీడమ్‌ను కోరుకుంటుంది. ఆ నేచర్‌కి తగ్గట్టుగా క్రియేట్ చేసిన ఈ ఫ్రీడమ్ సాంగ్‌ని స్వాతంత్ర దినోత్సవం రోజున విడుదల చేయడం సబబు అనిపించింది. ఈ సినిమాలోని అంశాలన్నీ జనరంజకంగా ఉంటాయి’’ అని నాగచైతన్య చెప్పారు. ఆయన కథానాయకునిగా విజయ్‌కుమార్ కొండా దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మించిన చిత్రం ‘ఒక లైలా కోసం’. సెప్టెంబర్ 5న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో హీరో మనస్తత్వాన్ని ఆవిష్కరించే ఫ్రీడమ్ సాంగ్ ‘ఈ చిన్ని లైఫ్ నీదే... సరదాగా సాగాలి.
చేజారిపోతే రాదే... చెలరేగిపోవాలి’ని శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో విడుదల చేశారు.
ఈ సందర్భంగా పూజా హెగ్డే మాట్లాడుతూ -‘‘స్వాతంత్ర దినోత్సవం రోజున తొలి పాటను విడుదల చేయడం ఆనందంగా ఉంది. అందరూ పాడుకునేలా ఇందులో పాటలుంటాయి. నాగచైతన్యకు జోడీగా నటిస్తున్నందుకు హ్యాపీగా ఉంది’’ అన్నారు. దర్శక, నిర్మాతల సహకారం వల్ల అద్భుతమైన ఆల్బమ్ రూపొందిందని సంగీత దర్శకుడు అనూప్‌రూబెన్స్ చెప్పారు దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఫ్రీడమ్‌ని ఇష్టపడే కార్తీక్, నందన అనే అమ్మాయిని చూడగానే ఇష్టపడతాడు. మరి నందనను దక్కించుకోడానికి కార్తీక్ ఏం చేశాడు అనేది ఈ సినిమా కథ. అన్ని రకాల భావోద్వేగాలూ ఉన్న కథ ఇది’’ అన్నారు.