
పెళ్లికి ముందు.. ఆ తర్వాత..!
పెళ్లికి ముందు, ఆ తర్వాత... ఇంకా కొన్నాళ్ల తర్వాత భార్యాభర్తలు ఎలా ఉంటారు? వాళ్లల్లో వచ్చే మార్పులేంటి? అనే కథాంశంతో రూపొందుతున్న ‘గుమ్మడికాయల దొంగలు’ హైదరాబాద్‌లో ఆరంభమైంది. డా. రాజేంద్రప్రసాద్ ప్రధానపాత్రలో అంతర్జాతీయ అవార్డ్‌గ్రహీత, ఛాయాగ్రాహకుడు కిషన్ సాగర్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ, జి. మురళీ కృష్ణకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తొలి సన్నివేశానికి శాంతయ్య కెమెరా స్విచాన్ చేయగా, శ్రీరవి క్లాప్ ఇచ్చారు. గత కొంత కాలంగా కాస్టింగ్ మేనేజర్‌గా వ్యవహరించిన తాను నిర్మిస్తున్న తొలి చిత్రం ఇదనీ, షిరిడీ సాయిబాబా ఆలయాన్ని నిర్మించాలనే ఆశయంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాననీ నిర్మాత తెలిపారు. అంతర్జాతీయంగా ఎంత గుర్తింపు తెచ్చుకున్నా, సొంత గడ్డపై సాధించాలనే ఆశయంతో ఈ చిత్రం చేస్తున్నానని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: కె. వీర, సంగీతం: శ్రీ వెంకట్.