
జీవీ అడంగాదేకు ప్రముఖుల మద్దతు
యువ సంగీతదర్శకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్ కథానాయకుడిగానూ సక్సెస్ అయ్యి చే తి నిండా చిత్రాలతో చాలా బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న బ్రూస్‌లీ, కడవుల్ ఇరుక్కాన్ కుమారు చిత్రాల నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. తాజాగా మరో చిత్రానికి సిద్ధం అయ్యారు. దీనికి అడంగాదే అనే టైటిల్‌ను నిర్ణయించారు. కాగా ఈ చిత్రంలో ఆయనతో కలిసి పలువురు ప్రముఖ నటీనటులు నటించనుండడం విశేషం. ప్రముఖ నటుడు శరత్‌కుమార్ ఈ చిత్రంలో జీవీతో కలిసి నటించనున్నారు.
కథానాయకిగా నటి సురభి నటిస్తున్నారు. చిన్న గ్యాప్ తరువాత తను నటిస్తున్న తమిళ చిత్రం ఇది. కాగా ఉత్తరాది తార మందిరాబేడీ సుదీర్ఘ గ్యాప్ తరువాత అండంగాదే చిత్రంలో ఒక కీలక పాత్రను పోషించడం మరో విశేషం. ఈమె చాలా కాలం క్రితం శింబు స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన మన్మథన్ చిత్రంలో అతిథిగా మెరిశారు. ఆ తరువాత ఏ తమిళ చిత్రంలోనూ నటించలేదు. క్రికెట్ క్రీడ యాంకరింగ్‌కే ఎక్కువగా పరిమితమైన మందిరాబేడీ జీవీతో కలిసి రీఎంట్రీ అవుతున్నారు. ఇంకా ఈ చిత్రంలో తంబిరామయ్య, రోబోశంకర్ తదితర సీనియర్ నటీనటులు నటిస్తున్నారు. శ్రీగ్రీన్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి షణ్ముగ ముత్తుసామి దర్శకత్వం వహిస్తున్నారు.