ఔను! నేను నాన్నను కాబోతున్నాను!
తండ్రి కావడం ఎవరికైనా గొప్ప అనుభూతి. వెలకట్టలేని సంతోషం. అదే సంతోషంలో తాను మునిగి తేలుతున్నట్టు బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ తెలిపాడు. 'హా మే బాప్ బాన్నే వాలా హూ' (అవును.. నేను తండ్రిని కాబోతున్నాను) అని అతను వెల్లడించాడు.
షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్ దంపతులు త్వరలోనే తొలి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు కొన్నిరోజులుగా కథనాలు వస్తున్నాయి. మీరా రాజ్‌పుత్ గర్భవతి అయినట్టు సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ ఈ కథనాలు వెలువడ్డాయి. ఈ కథనాలపై ఇంతవరకు షాహిద్ స్పందించలేదు. అతని తాజా చిత్రం 'ఉడ్తా పంజాబ్' ట్రైలర్ విడుదల సందర్భంగా విలేకరులు ఈ విషయాన్ని ప్రస్తావించారు. 'ఎందుకండి.. డొంక తిరుగుడు ప్రశ్నలు అడుగుతారు. డైరెక్టుగా అడగండి. అవును.. నేను నాన్నను కాబోతున్నాను' అంటూ తేల్చాశాడు షాహిద్.
నిజంగా ఈ వార్త షాహిద్, మీరా అభిమానులకు ఆనందం కలిగించేదే. ఈ ఏడాది ఆరంభం నుంచి విడాకులు, బ్రేకప్‌లతో సతమతమవుతున్న బాలీవుడ్ జనాలకు తీపి కబురు అని చెప్పవచ్చు.