'కూల్' సినిమా పెద్దలకు హైకోర్టు ఝలక్
ముంబై: ఓ సినిమాలో అసభ్యకర సన్నివేశాలు ఉన్నాయంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం నేపథ్యంలో బాంబే హైకోర్టు తీవ్రంగా స్పందించింది. సదరు సినిమా దర్శకుడు, నిర్మాత, స్టోరీ రైటర్స్ కు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. 'క్యా కూల్ హై హమ్ 3' మూవీలో అసభ్యకర సన్నివేశాలు ఉన్నాయంటూ ఇటీవలే పిల్ దాఖలైంది. ఈ పిల్‌పై జస్టిస్ ఎన్ హెచ్ పాటిల్, జస్టిస్ జీఎస్ కులకర్ణి ధర్మాసనం విచారణ జరిపింది. అయితే, ఈ మూవీ ఇప్పటికే విడుదలైనందున స్టే విధించలేమని ధర్మాసనం పేర్కొంది. కోర్టుకు ఆలస్యంగా వచ్చిన పిటిషనర్ జుబెర్ ఖాన్ ను ధర్మాసనం మందలించింది. నిర్మాతలు ఎక్తా కపూర్, శోభా కపూర్, దర్శకుడు ఉమేష్ ఘడ్గే, స్క్రిప్ట్ రైటర్ మిలప్ జవేరి, ముస్తాక్ షేక్ లకు బాంబే హైకోర్టు నోటీసులు జారీచేసింది.
దేశ సంస్కృతి, సంప్రదాయం, పద్ధతులను దిగజార్చేలా ఈ మూవీ ఉందని పిటిషనర్ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. మూవీ ట్రైలర్లో కూడా ఇండియాస్ ఫస్ట్ పోర్న్.కామ్ అని ప్రచారం చేశారని తెలిపారు. మూవీ పోస్టర్లలో ఎక్కువగా అర్ధ నగ్న చిత్రాలే ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చాడు. దీనిపై విచారించిన ధర్మాసనం 'క్యా కూల్ హై హమ్ 3' సినిమాలో కొన్ని మార్పులు సూచించింది. ఇలాంటి తరహా చిత్రాలకు ఈ పిల్ వర్తిస్తుందని పేర్కొంటూ వచ్చేవారం విడుదలకు సిధ్దంగా ఉన్న సన్నీ లియోన్ చిత్రం 'మస్తి జాడే'కి విచారణ పరిధిలోకి తీసుకొంది. వచ్చేవారం ఈ పిల్‌పై మరోసారి విచారణ చేస్తామని ధర్మాసనం పేర్కొంది.