డ్రగ్స్ నియంత్రణకు కఠినచట్టాలు అవసరం: హీరో
దానవాయిపేట: చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతున్న డ్రగ్స్ను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టాలని ప్రముఖ సినీనటుడు సుమన్ అన్నారు. రాజమహేంద్రవరంలోని స్వర్ణాంధ్ర సేవా సంస్థకు గౌరవ సలహాదారుడిగా వ్యవహరిస్తున్న సుమన్ గురువారం ఆ సంస్థ నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'సాక్షి'తో ప్రత్యేకంగా మాట్లాడారు.
డ్రగ్స్ వ్యవహారంలో సినిమా ఇండస్ట్రీకి ఉన్న లింకులపై మీ అభిప్రాయం?
బాలీవుడ్లో ఉండే డ్రగ్స్ సంస్కృతి తెలుగు సినిమా ఇండస్ట్రీకి పాకింది. ముంబై, కేరళ, గోవా వంటి ప్రదేశాల్లో ఉన్న డ్రగ్స్ ముఠాలు హైదరాబాద్ను కూడా కేంద్రంగా చేసుకుని కార్యకాలాపాలు సాగిస్తున్నాయి. డ్రగ్స్ వ్యవహారంలో ఇతర దేశాలు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాయి. మరణశిక్షలు సైతం విధిస్తున్నాయి. అటువంటి చట్టాలను కేంద్ర ప్రభుత్వం అమలులోకి తేవాలి.
ప్రస్తుతం ఆధ్యాత్మిక చిత్రాలపై ప్రజలకు మక్కువ తగ్గిందనుకుంటున్నారా?
ఆధ్యాత్మిక చిత్రాలను ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారు. ఐతే సినీ పరిశ్రమలో ఒక ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. దానికి అనుగుణంగా దర్శకులు కూడా అటువంటి సినిమాలపై దృష్టి సారిస్తూ ఉంటారు. మొన్నటి వరకు కామెడీ, హర్రర్ కామెడి సినిమాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు 'గౌతమీపుత్ర శాతకర్ణి, రుద్రమదేవి, బాహుబలి, బాహుబలి-2' వంటి సినిమాల హవా నడుస్తోంది.
ప్రస్తుతం మీరు ఏ సినిమాల్లో నటిస్తున్నారు?
తెలుగులో 'మామ ఒక్క చందమామ'తో పాటు ఒక ముస్లిం ఇతివృత్తంగా సాగే సినిమాలో నటిస్తున్నాను. ఇవికాక తమిళ, కన్నడ భాషల్లో మరో రెండు చిత్రాల్లో నటిస్తున్నాను.
మీరు రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.. నిజమేనా ?
రాజకీయాలపై ఇప్పటి వరకూ ఎటువంటి స్పష్టతా లేదు. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్లో నా రాజకీయ ప్రవేశంపై ఒక స్పష్టత వస్తుంది.