సాక్షి,ఆగ్రా: సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన వివాదాస్పద పద్మావతి మూవీపై పలు రాష్ట్రాల్లో నిరసనలు మిన్నంటాయి. రాజస్ధాన్, గుజరాత్, హర్యానాల్లో ఈ సినిమాపై రాజ్‌పుట్ సంఘాలు, హిందూ సంస్థలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తుండగా తాజాగా ఆగ్రాలో హిందూ గ్రూపులు పద్మావతిని విడుదల చేస్తే విధ్వంసం తప్పదని హెచ్చరించాయి. నగరంలో ఈ సినిమాను విడుదల చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని థియేటర్లకు స్పష్టం చేశాయి.
తమ అభ్యంతరాలను ఖాతరు చేయకుండా పద్మావతి సినిమాను ప్రదర్శిస్తే జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాలని హిందూ సంస్థలు హెచ్చరించాయి. పద్మావతి పోస్టర్లకు బ్లాక్ ఇంక్ పులిమి తమ ఆందోళనలు ఎలా ఉంటాయో హిందూ సంస్థలు సంకేతాలు పంపాయి. ఈ కేసుకు సంబంధించి థియేటర్ యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హిందూ సంస్కృతికి వ్యతిరేకంగా రూపొందే సినిమాలను తీవ్రంగా ప్రతిఘటిస్తామని హిందూ జాగరణ్ మంచ్ ఆగ్రా జిల్లా అధ్యక్షుడు అమిత్ ఛౌదరి స్పష్టం చేశారు.రాజ్‌పుట్‌ల మనోభావాలను దెబ్బతీసేలా రూపొందిన పద్మావతి చిత్రాన్ని నిలిపివేయాలని ఇప్పటికే యూపీ మాజీ మంత్రి, బీజేపీ నేత రాజా మహేంద్ర అరిదమన్ సింగ్ డిమాండ్ చేశారు.మరోవైపు డిసెంబర్ 1న పద్మావతి విడుదల రోజే యూపీలో స్ధానిక ఎన్నికల ఫలితాలు వెలువడుతుండటంతో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటాయనే ఆందోళన నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment