Hindu groups
-
పన్నూపై కెనడా హిందూ సంఘాల ఆగ్రహం
ఒట్టావా: ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూను కెనడాలో అడుగుపెట్టకుండా నిషేధం విధించాలని హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. హిందువులపై విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్న నేపథ్యంలో కెనడా హిందూ ఫోరం ఈ మేరకు ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్‌కు విజ్ఞప్తి చేసింది. గురుపత్వంత్ సింగ్ పన్నూ అమెరికాకు చెందిన సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ అధినేత. సిక్కులకు ప్రత్యేక దేశం కావాలనేది ఈ సంస్థ ఆశయం. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసుపై కూడా పన్నూ ఇప్పటికే పలు ప్రకటనలు కూడా చేశాడు. ఈ క్రమంలో హిందువుల పట్ల ఆయన విద్వేషాన్ని చిమ్మే ప్రయత్నం చేస్తున్నాడు. దీంతో పన్నూపై కెనడాలో హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రమేయం ఉందని కెనడా ఆరోపించడంతో వివాదం చెలరేగింది. ఇరు దేశాలు ఆంక్షల దిశగా చర్యలు తీసుకున్నాయి. కెనడా, యూకే, అమెరికా సహా విదేశాల్లో ఉన్న 18 మంది ఖలిస్థానీ నాయకులను ఉగ్రవాదులుగా భారత్ ప్రకటించింది. ఇండియాలో వారి ఆస్తులను జప్తు చేసింది. ఈ జాబితాలో గురుపత్వంత్ సింగ్ పన్నూ కూడా ఒకరు. కెనడాలో హిందువులు దేశం విడిచి వెళ్లాలని గురుపత్వంత్ సింగ్ పన్నూ ఇటీవల వివాదాస్పద ప్రకటనలు జారీ చేశాడు. ఖలిస్థానీ మద్దతుదారులకే కెనడాలో స్థానం ఉందంటూ మాట్లాడారు. దీంతో అక్కడి హిందూ సంఘాలు ఆయనపై నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇదీ చదవండి: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య వెనక ఐఎస్ఐ హస్తం -
ఉదయనిధి వ్యాఖ్యల దుమారం.. స్టాలిన్ ఏమన్నారంటే..
సాక్షి, చెన్నై: తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చిన మంత్రి.. దానిని సమూలంగా నిర్మూలించాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ, హిందూ సంఘాల ఆందోళన తమిళనాడులో హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. సోషల్ మీడియా వేదికల్లోనూ ఉదయనిధిపై విమర్శలు గుప్పిస్తున్నాయి. గతంలో ఉదయనిధి చర్చ్, స్వామిజీ వద్దకు వెళ్లిన ఫోటోలు షేర్ చేస్తూ.. దీనికి సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు తమిళనాడు గవర్నర్‌ను బీజేపీ నేతలు కలిశారు. ఉదయనిధిపై క్రిమినల్ కేసులు పెట్టాలని గవర్నర్‌కు వినతి చేశారు. స్టాలిన్ వీడియోతో బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. మంత్రికి మద్దతుగా ప్రకాశ్ రాజ్ ఇక ఉదయనిధికి మద్దతుగా నటుడు ప్రకాశ్ రాజ్ నిలిచారు. సనాతన పార్లమెంట్ భవిష్యత్తు ఇలా ఉంటుందా అంటూ మోదీ స్వామీజీల పోటో షేర్ చేశారు. తాజాగా కొడుకు వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. ఉదయనిధి సనాతన ధర్మం వ్యాఖ్యలను సీఎం సమర్థిస్తూ బీజేపీపై విరుచుకుపడ్డారు. తన కుమారుడు చెప్పిన దాంట్లో అక్షరం ముక్క తప్పులేదని అన్నారు. ఉద్యోగాలు, ద్రవ్యోల్బణంపై మోదీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. చదవండి: Karnataka: బీజేపీ నేతలకు డీకే గాలం! బీజేపీ హయాంలో దేశం నాశనం.. తన పాడ్‌కాస్ట్ ‘స్పీకింగ్ ఫర్ ఇండియా’లో స్టాలిన్ మాట్లాడుతూ.. బీజేపీ తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు మతాన్ని ఆయుధంగా వాడుతోందని మండిపడ్డారు. ప్రజల మతపరమైన భావాలను రెచ్చగొట్టి.. ఆ మంటల వెచ్చదనంలో బీజేపీ చలికాచుకోవాలని చూస్తోందని విమర్శించారు. భారత నిర్మాణాన్ని, దేశ ఐక్యతను నాశనం చేయాలని ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. ఇప్పుడు ఆపకపోతే ఎవరూ రక్షించలేరు 2002లో గుజరాత్ అల్లర్లు బీజేపీ హింస, ద్వేషానికి బీజాలు వేసిందన్నారు. ఇటీవల ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్, హర్యానాలో చెలరేగిన హింసాత్మక ఘర్షణలు వేలాది మంది అమయాక ప్రజల ప్రాణాలను, ఆస్తులను బలితీసుకుందని మండిపడ్డారు. ఇప్పటికైనా దీనిని అరికట్టకపోతే.. దేశాన్ని, భారతీయులను ఎవరూ రక్షించలేరని ఎంకే స్టాలిన్ హెచ్చరించారు. మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైన సీఎం పోడ్కాస్ట్ ఎపిసోడ్లో.. ఎన్నికలకు ముందు బీజేపీ ఇచ్చిన ఏ హామీని గత తొమ్మిదేళ్లలో నెరవేర్చలేదని స్టాలిన్ పేర్కొన్నారు. ప్రజలందరి ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.15 లక్షలు జమ కాలేదని, రైతుల ఆదాయాలు రెండింతలు కాలేదని, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు కానీ జరగలేదని ముఖ్యమంత్రి బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భారతదేశం మొత్తం మణిపూర్, హర్యానాగా మారకుండా నిరోధించడానికి ఇండియా కూటమి తప్పక గెలవాలన్నారు. చదవండి: జీ 20 సదస్సుకు జిన్‌పింగ్ గైర్హాజరు.. స్పందించిన బైడెన్ ఉదయనిధి స్టాలిన్ ఏమన్నారంటే.. ‘తమిళనాడు ప్రొగ్రెసివ్ రైటర్స్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ శనివారం ‘సనాతన నిర్మూలన’ పేరుతో నిర్వహించిన సమావేశంలో ఉదయనిధి స్టాలిన్ హాజరై ప్రసంగించారు. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని, దీనిని కేవలం వ్యతిరేకించడమే కకుండా.. పూర్తిగా తొలగించాలని వ్యాఖ్యానించారు. అది తిరోగమన సంస్కృతి అని.. ప్రజలను కులాలు పేరిట విభజించిందని పేర్కొన్నారు. సమానత్వానికి, మహిళా సాధికారతకు సనాతన ధర్మం వ్యతిరేకతమని అన్నారు. -
ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత మీడియాదే
సాక్షి, బెంగళూరు: ‘కొత్తగా వస్తున్న మాధ్యమాలు అనతికాలంలోనే ప్రజలకు చేరువ అవుతున్నాయి. ఈ క్రమంలో నిజాలను జనాలను తెలియజేయాల్సిన బాధ్యత మాధ్యమాలదే. కొన్ని సంవత్సరాలుగా సంప్రదాయ మాధ్యమాలు వాస్తవాలను వెలుగులోకి తేవడంతో విజయవంతం అయ్యాయి’అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. శనివారం బెంగళూరులోని హిందూ గ్రూప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ది హడిల్’ నాలుగవ ఎడిషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాష్ట్రపతి మాట్లాడుతూ మాధ్యమ రంగంలో వాస్తవాలు తెలియజేయడం, స్వేచ్ఛ, స్వాతంత్య్రం, న్యాయం, మానవీయత అనే ఐదు అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఇటీవల కాలంలో కొత్తగా ఎన్ని పత్రికలు వచ్చినా.. ఎప్పటి నుంచో ఉన్న వార్తా సంస్థలకు ప్రాధాన్యం తగ్గలేదన్నారు. క్రీడలు, వ్యాపారం, రాజకీయం, సామాజిక రంగాల వార్తలకు ప్రముఖ ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోందన్నారు. సోషల్ మీడియా పెరిగిపోతున్నా, పత్రికలకు ప్రాధాన్యం తగ్గలేదన్నారు. జాతిపిత కూడా విలేకరే... జాతిపిత మహాత్మాగాంధీ కూడా పత్రికా విలేకరిగా పని చేశారని రాష్ట్రపతి గుర్తు చేశారు. సత్యం, ప్రామాణికమే మాధ్యమాల ప్రధాన ఆయుధం అన్నారు. మాధ్యమాల్లో నిజాయితీ, పాలనకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం యడియూరప్ప అన్నారు. పాలనలోని పారదర్శకతను గుర్తించి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మీడియా రంగంపై ఉందని చెప్పారు. మంచి పాలన అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. -
వైఎస్ జగన్‌తో హిందూ గ్రూప్ ఛైర్మన్ భేటీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ‘ద హిందూ’ గ్రూపు ఛైర్మన్ ఎన్.రామ్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మంగళవారం ఆయన నివాసానికి వచ్చిన రామ్.. సీఎంగా ఎన్నికయినందుకు వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రం ప్రభుత్వం చేపడుతున్న అమ్మఒడి, రైతు భరోసా వంటి వివిధ సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి ఆయనకు వివరించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల్లో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రణాళికను తెలిపారు. అమ్మఒడి పథకం తనను ఎంతో ఆకట్టుకుందని ఎన్.రామ్ ఈ సందర్భంగా సీఎంతో అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో తనకున్న అనుబంధాన్ని రామ్ గుర్తుచేసుకున్నారు. అనంతరం వైఎస్ జగన్‌కు జ్ఞాపికను అందజేశారు. -
నేడు, రేపు హిందు గ్రూప్ ప్రాపర్టీ షో
సాక్షి, హైదరాబాద్: నగరవాసుల సొంతింటి కలను సాకారం చేసేందుకు ది హిందు గ్రూప్ ఆధ్వర్యంలో ప్రాపర్టీ షో జరగనుంది. లివింగ్ స్పేస్ పేరిట హైటెక్స్ రోడ్‌లోని సైబర్ కన్వెన్షన్‌లో శని, ఆదివారాల్లో ఈ ప్రాపర్టీ షో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రదర్శనకు ప్రవేశం ఉచితం. ఈ షోలో నగరానికి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలకు చెందిన వ్యక్తిగత గృహాలు, అపార్ట్మెంట్లు, విల్లాలు, లగ్జరీ ఫ్లాట్లు ప్రదర్శనలో ఉంటాయి. ఈ ప్రాపర్టీ షోకు టైటిల్ స్పాన్సర్‌గా అపర్ణా కన్స్ట్రక్షన్స్, పవర్డ్ బై రాజపుష్ప ప్రాపర్టీస్, అసోసియేట్ స్పాన్సర్‌గా ఆదిత్య కన్స్ట్రక్షన్స్, సాకేత్ ఇంజనీర్స్ వ్యవహరిస్తున్నాయి. -
తమిళ బిగ్‌బాస్ షోపై భగ్గుమన్న హిందూ సంఘాలు
-
బిగ్‌బాస్ షోను వెంటనే నిషేధించాలి!
సాక్షి, చెన్నై : తమిళ బిగ్‌బాస్ షోపై హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. ప్రాశ్చాత్య సంస్కృతిని ప్రోత్సహిస్తూ.. అశ్లీలకరంగా నడుస్తున్న ఈ షోను వెంటనే నిషేధించాలంటూ హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. బిగ్ బాస్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కమల్ హాసన్‌కు, ఈ షోను ప్రసారం చేస్తున్న విజయ్ టీవీకి వ్యతిరేకంగా గురువారం చెన్నైలో ధర్నా నిర్వహించాయి. ఈ సందర్బంగా హిందూ సంఘాల కార్యకర్తలు విజయ్ టీవీని ముట్టడించేందుకు ప్రయత్నించగా.. వారిని పోలీసుల అడ్డుకున్నారు. విజయ్ టీవీకి, కమల్ హాసన్‌కు వ్యతిరేకంగా హిందూత్వ శ్రేణులు నినాదాలు చేశాయి. తమిళనాడులో బిగ్‌బాస్ షోను నిషేధించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హిందూ సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు. పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి స్టేషనుకు తరలించారు. బిగ్‌బాస్ షో పూర్తిగా అశ్లీలకరంగా నడుస్తోందని, పాశ్చాత్య సంస్కృతిని ప్రోత్సహిస్తోందని రోజురోజుకు తమిళనాడులో ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. -
టీటీడీ వివాదంలో కొత్త మలుపు
సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త ధర్మకర్తల మండలి నియామకంలో కొత్త మలుపు చోటుచేసుకుంది. ధార్మిక సంస్థలు, బ్రాహ్మణ సంఘాలు, ఇతర వర్గాల నుంచి వస్తున్న తీవ్ర విమర్శలు, ఆందోళనల నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత వెనక్కి తగ్గారు. టీటీడీ పాలకమండలిలో తనను సభ్యురాలిగా నియమించడం వివాదానికి దారి తీసిందని భావించిన అనిత.. బోర్డు నుంచి తనను తప్పించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు చంద్రబాబుకు ఎమ్మెల్యే అనిత లేఖ రాశారని సమాచారం. టీటీడీ బోర్డు సభ్యురాలుగా నియమితులైన అనిత విషయంలో హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. తాను అన్య మతస్థురాలినని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకున్న అనితకు ఎలా అవకాశం ఇస్తారని ప్రశ్నిస్తున్నాయి. హిందూ ధార్మిక సంస్థలో రాజకీయ లబ్ధి కోసం అన్య మతస్థులకు చోటు కల్పించడం దారుణమని హిందూ సంఘాలు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావును బోర్డు సభ్యుడిగా నియమించడంపై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. విజయవాడలో బ్రాహ్మణుల సత్రాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన బొండాకు టీటీడీ బోర్డులో ఎలా పదవి ఇస్తారని బ్రాహ్మణ సంఘం నేత ముష్టి శ్రీనివాసరావు నిలదీశారు. వీడియో సోర్స్: వనిత టీవీ సౌజన్యం.. -
భగ్గుమంటున్న హిందూ సంఘాలు
సాక్షి, అమరావతి/సాక్షి, తిరుమల/సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కొత్త ధర్మకర్తల మండలి నియామకం తీవ్ర వివాదాస్పదంగా మారింది. అన్య మతస్థులను, రౌడీయిజం చేసే వారిని, ఆధ్యాత్మిక–సేవా భావం లేనివారిని టీటీడీ బోర్డులో సభ్యులుగా నియమించారని హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఏడాది పాటు అధికారుల పాలనలో సాగిన టీటీడీకి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం కొత్త బోర్డును నియమించిన సంగతి తెలిసిందే. కొత్త చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్‌పై అన్యమత ప్రచార కార్యక్రమాలకు ఆర్థిక సాయం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన నియామకంపై హిందూ పీఠాధిపతులు, మఠాధిపతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం లెక్కచేయలేదు. అలాగే బోర్డులో సభ్యురాలుగా నియమితులైన టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత విషయంలోనూ హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తాను అన్య మతస్థురాలినని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకున్న అనితకు ఎలా అవకాశం ఇస్తారని ప్రశ్నిస్తున్నాయి. హిందూ ధార్మిక సంస్థలో రాజకీయ లబ్ధి కోసం అన్య మతస్థులకు చోటు కల్పించడం దారుణమని హిందూ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. కొత్త బోర్డును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. రాయపాటి సాంబశివరావు అసంతృప్తి టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావును బోర్డు సభ్యుడిగా నియమించడంపై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విజయవాడలో బ్రాహ్మణుల సత్రాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన బొండాకు టీటీడీ బోర్డులో ఎలా పదవి ఇస్తారని బ్రాహ్మణ సంఘం నేత ముష్టి శ్రీనివాసరావు నిలదీశారు. అలాగే తనను టీటీడీ సభ్యుడిగా నియమించడంపై టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కినుక వహించారు. తాను టీటీడీ చైర్మన్ పదవి అడిగితే ఇవ్వకుండా, సభ్యుడిగా నియమించి అవమానించారని ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో బీజేపీతో టీడీపీ తెగతెంపులు చేసుకున్నా మహారాష్ట్ర మంత్రి సుధీర్ ముంగటివర్ సతీమణి సప్నను టీటీడీ బోర్డులో సభ్యురాలిగా నియమించడం గమనార్హం. రాజకీయ లబ్ధి కోసమే ఆమెకు టీటీడీ బోర్డులో చోటు కల్పించినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొత్త బోర్డులో తమకు అవకాశం కల్పిస్తారని టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఆశించారు. అవకాశం రాని వారు పార్టీకి రాజీనామా చేయాలని యోచిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. మరోవైపు టీటీడీ బోర్డులో తమిళనాడుకు ప్రాతినిధ్యం లేకపోవడం దారుణమని ఆ రాష్ట్రానికి చెందిన హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. -
విడుదలైతే విధ్వంసమే..
సాక్షి,ఆగ్రా: సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన వివాదాస్పద పద్మావతి మూవీపై పలు రాష్ట్రాల్లో నిరసనలు మిన్నంటాయి. రాజస్ధాన్, గుజరాత్, హర్యానాల్లో ఈ సినిమాపై రాజ్పుట్ సంఘాలు, హిందూ సంస్థలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తుండగా తాజాగా ఆగ్రాలో హిందూ గ్రూపులు పద్మావతిని విడుదల చేస్తే విధ్వంసం తప్పదని హెచ్చరించాయి. నగరంలో ఈ సినిమాను విడుదల చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని థియేటర్లకు స్పష్టం చేశాయి. తమ అభ్యంతరాలను ఖాతరు చేయకుండా పద్మావతి సినిమాను ప్రదర్శిస్తే జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాలని హిందూ సంస్థలు హెచ్చరించాయి. పద్మావతి పోస్టర్లకు బ్లాక్ ఇంక్ పులిమి తమ ఆందోళనలు ఎలా ఉంటాయో హిందూ సంస్థలు సంకేతాలు పంపాయి. ఈ కేసుకు సంబంధించి థియేటర్ యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందూ సంస్కృతికి వ్యతిరేకంగా రూపొందే సినిమాలను తీవ్రంగా ప్రతిఘటిస్తామని హిందూ జాగరణ్ మంచ్ ఆగ్రా జిల్లా అధ్యక్షుడు అమిత్ ఛౌదరి స్పష్టం చేశారు.రాజ్పుట్ల మనోభావాలను దెబ్బతీసేలా రూపొందిన పద్మావతి చిత్రాన్ని నిలిపివేయాలని ఇప్పటికే యూపీ మాజీ మంత్రి, బీజేపీ నేత రాజా మహేంద్ర అరిదమన్ సింగ్ డిమాండ్ చేశారు.మరోవైపు డిసెంబర్ 1న పద్మావతి విడుదల రోజే యూపీలో స్ధానిక ఎన్నికల ఫలితాలు వెలువడుతుండటంతో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటాయనే ఆందోళన నెలకొంది. -
పాకిస్థాన్ ఎగ్జిబిషన్ ఎదుట నిరసన
సాక్షి, న్యూఢిల్లీ:ప్రగతిమైదాన్‌లో జరుగుతోన్న పాకిస్థాన్ లైఫ్‌స్టైల్ ఎగ్జిబిషన్ వద్ద వీహెచ్‌పీ నిరసన ప్రదర్శన నిర్వహించింది.. ఓమ్ అని ముద్రించి ఉన్న కాషాయ రంగు జెండాలు ధరించిన సుమారు 300 మంది ఆందోళనకారులు ఎగ్జిబిషన్ వేదిక వద్ద పాకిస్థాన్ వ్యతిరేక నినాదాలు చేశారు. నిరసనకారులు ఎవరో తమకు తెలియదని, పాకిస్థాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేసిన వారిని పోలీసులు వ్యాన్‌లో ఎక్కించి తీసుకెళ్లారని ప్రగతిమైదాన్ వద్దనున్న భద్రతా సిబ్బంది తెలిపారు. నిరసనకారులు ఎలాంటి విధ్వంసం జరపలేదని వారు చెప్పారు. ప్రగతిమైదాన్‌లో ఆలీషాన్ పాకిస్థాన్ పేరిట గురువారం లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలో పాకిస్థాన్‌కు చెందిన 250 మంది ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు. ఫిక్కీ, ట్రేడ్డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ పాకిస్థాన్ కలిసి ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నాయి. పాకిస్థానీ ప్యాషన్, టైక్స్టైల్స్, జ్యూవెలరీ. యాక్ససరీస్, ఫర్నిచర్, తివాచీలు, గృహోపకరణాలు. వ్యవసాయోత్పత్తులు, ఆహారోత్పత్తులు, మార్బుల్, గ్రానైట్ ఉత్పత్తులతో నిండిన స్టాల్స్‌తో కూడిన ఈ ప్రదర్శన షాపర్లను ఆకట్టుకుంటోంది. ఎగ్జిబిషన్‌ను పురస్కరించుకుని ఆర్ట్ ఇన్ పాకిస్థాన్ టుడే పేరుతో కళాప్రదర్శనను కూడా ప్రగతిమైదాన్‌లో ఏర్పాటుచేశారు. దాంతో పాటు హోటల్ లలిత్‌లో పాకిస్థానీ ఫుడ్ వీక్‌ను కూడా నిర్వహిస్తున్నారు. 2012లో నిర్వహించిన పాకిస్థానీ లైఫ్‌స్టైల్ ఎగ్జిబిషన్‌కు విశేష స్పందన లభించినడంతో మరింత భారీ ఎత్తున ఆలీషాన్ పాకిస్థాన్ ప్రదర్శనను ఏర్పాటుచేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ‘నేను ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకుంటున్నా.. ఈ ఎగ్జిబిషన్లో కొన్ని అలంకరణ వస్తువులు కొనుక్కునేందుకు వచ్చాను.. ఉదయం 11 గంటలకే వచ్చాను.. అందువల్ల ఆందోళనకారులు నన్ను అడ్డుకోలేదు. అయినా ఇక్కడ ‘ఆలీషాన్ పాకిస్థాన్’ ఎగ్జిబిషన్‌కు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పుడు మధ్యలో వారికి వచ్చిన ఇబ్బంది ఏంటో.. ’ అంటూ మృదుల అనే విద్యార్థిని ప్రశ్నించింది. ఆమె గురువారం ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తున్న ఉపకరణాలను చూసేందుకు స్నేహితులతో పాటు వచ్చింది. వారం కిందట ఆలీషాన్ పాకిస్థాన్ ప్రదర్శనకు అనుమతి ఇవ్వవొద్దంటూ హిందూత్వ సంఘాలు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, ఇండియా, పాకిస్థాన్ దేశాల మధ్య వ్యాపార సంబంధాలను మెరుగుపరిచే దిశలోనే ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్ఐసీసీఐ), ట్రేడ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ పాకిస్థాన్ సంయుక్త నిర్వహణలో ఈ ‘ఆలీషాన్ పాకిస్థాన్’ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటుచేశాయి. ఎగ్జిబిషన్‌ను నిలిపివేయాల్సిందే.. ‘ఆలీషాన్ పాకిస్థాన్’ ఎగ్జిబిషన్‌ను వెంటనే నిలిపివేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. మధ్యాహ్నం 12.30 సమయంలో ప్రగతి మైదాన్ గేట్ నం.7 నుంచి లోపలికి దూసుకొచ్చిన ఆందోళనకారులు ఎగ్జిబిషన్ ఎదుట ఆందోళనకు దిగారు. వెంటనే ఎగ్జిబిషన్‌ను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ప్రగతి మైదాన్‌లో పాకిస్థాన్ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నాలుగు రోజుల పాటు ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు పాకిస్థాన్ హై కమిషన్‌కు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం విదితమే. కాగా, ఈ అనుమతి ఇవ్వడం భారత ప్రభుత్వ తెలివితక్కువ తన మని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘పాకిస్థాన్ ఒక టైస్టు దేశం. మన దేశసమగ్రతకు ముప్పు వాటిల్లే విధంగా ఆ దేశం ముష్కరులను పెంచి పోషిస్తోంది.. భారత భూభాగంలో టైజానికి ఊతమిస్తూ, డబ్బు, ఆయుధాలు అందజేస్తూ పరోక్షంగా దేశంలో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తోంది.. అటువంటి దేశానికి మనదేశంలో ఎగ్జిబిషన్ ఏర్పాటుకు ఎలా అనుమతి ఇచ్చారు.. ఆ దేశ ఉత్పత్తులను మన దేశంలో అమ్మేందుకు మేం ఒప్పుకోం. దాన్ని అడ్డుకుని తీరుతాం.. మొదటిరోజు మా ఆందోళన విజయవంతమైంది.. దాన్ని మేం మిగిలాన నాలుగురోజులూ కొనసాగిస్తాం..’ అని ఒక ఆందోళనకారుడు చెప్పారు. కాగా, ఆందోళనకారులను పోలీసులు తిలక్‌మార్గ్ పోలీస్ స్టేషన్‌కు తరలించి అనంతరం విడుదల చేశారు. మిగతా రోజుల్లో ఆందోళనకారులు ఎగ్జిబిషన్ వద్ద ఎటువంటి ఆందోళన చేపట్టకుండా చూసేందుకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటుచేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా, భారీ వర్షం, ఆందోళనల నేపథ్యంలో ఎగ్జిబిషన్ మొదటి రోజు అంతగా స్పందన లభించలేదని పాకిస్థాన్ నుంచి వచ్చిన ఎగ్జిబిటర్ తారిఖ్ అన్వర్ తెలిపాడు. మిగిలిన రోజుల్లో ప్రజల నుంచి స్పందన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.