పాకిస్థాన్ ఎగ్జిబిషన్ ఎదుట నిరసన
సాక్షి, న్యూఢిల్లీ:ప్రగతిమైదాన్‌లో జరుగుతోన్న పాకిస్థాన్ లైఫ్‌స్టైల్ ఎగ్జిబిషన్ వద్ద వీహెచ్‌పీ నిరసన ప్రదర్శన నిర్వహించింది.. ఓమ్ అని ముద్రించి ఉన్న కాషాయ రంగు జెండాలు ధరించిన సుమారు 300 మంది ఆందోళనకారులు ఎగ్జిబిషన్ వేదిక వద్ద పాకిస్థాన్ వ్యతిరేక నినాదాలు చేశారు. నిరసనకారులు ఎవరో తమకు తెలియదని, పాకిస్థాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేసిన వారిని పోలీసులు వ్యాన్‌లో ఎక్కించి తీసుకెళ్లారని ప్రగతిమైదాన్ వద్దనున్న భద్రతా సిబ్బంది తెలిపారు. నిరసనకారులు ఎలాంటి విధ్వంసం జరపలేదని వారు చెప్పారు. ప్రగతిమైదాన్‌లో ఆలీషాన్ పాకిస్థాన్ పేరిట గురువారం లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలో పాకిస్థాన్‌కు చెందిన 250 మంది ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు.
ఫిక్కీ, ట్రేడ్‌డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ పాకిస్థాన్ కలిసి ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నాయి. పాకిస్థానీ ప్యాషన్, టైక్స్‌టైల్స్, జ్యూవెలరీ. యాక్ససరీస్, ఫర్నిచర్, తివాచీలు, గృహోపకరణాలు. వ్యవసాయోత్పత్తులు, ఆహారోత్పత్తులు, మార్బుల్, గ్రానైట్ ఉత్పత్తులతో నిండిన స్టాల్స్‌తో కూడిన ఈ ప్రదర్శన షాపర్లను ఆకట్టుకుంటోంది. ఎగ్జిబిషన్‌ను పురస్కరించుకుని ఆర్ట్ ఇన్ పాకిస్థాన్ టుడే పేరుతో కళాప్రదర్శనను కూడా ప్రగతిమైదాన్‌లో ఏర్పాటుచేశారు. దాంతో పాటు హోటల్ లలిత్‌లో పాకిస్థానీ ఫుడ్ వీక్‌ను కూడా నిర్వహిస్తున్నారు. 2012లో నిర్వహించిన పాకిస్థానీ లైఫ్‌స్టైల్ ఎగ్జిబిషన్‌కు విశేష స్పందన లభించినడంతో మరింత భారీ ఎత్తున ఆలీషాన్ పాకిస్థాన్ ప్రదర్శనను ఏర్పాటుచేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
‘నేను ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకుంటున్నా.. ఈ ఎగ్జిబిషన్‌లో కొన్ని అలంకరణ వస్తువులు కొనుక్కునేందుకు వచ్చాను.. ఉదయం 11 గంటలకే వచ్చాను.. అందువల్ల ఆందోళనకారులు నన్ను అడ్డుకోలేదు. అయినా ఇక్కడ ‘ఆలీషాన్ పాకిస్థాన్’ ఎగ్జిబిషన్‌కు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పుడు మధ్యలో వారికి వచ్చిన ఇబ్బంది ఏంటో.. ’ అంటూ మృదుల అనే విద్యార్థిని ప్రశ్నించింది. ఆమె గురువారం ఎగ్జిబిషన్‌లో ప్రదర్శిస్తున్న ఉపకరణాలను చూసేందుకు స్నేహితులతో పాటు వచ్చింది. వారం కిందట ఆలీషాన్ పాకిస్థాన్ ప్రదర్శనకు అనుమతి ఇవ్వవొద్దంటూ హిందూత్వ సంఘాలు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, ఇండియా, పాకిస్థాన్ దేశాల మధ్య వ్యాపార సంబంధాలను మెరుగుపరిచే దిశలోనే ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్‌ఐసీసీఐ), ట్రేడ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ పాకిస్థాన్ సంయుక్త నిర్వహణలో ఈ ‘ఆలీషాన్ పాకిస్థాన్’ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటుచేశాయి.
ఎగ్జిబిషన్‌ను నిలిపివేయాల్సిందే..
‘ఆలీషాన్ పాకిస్థాన్’ ఎగ్జిబిషన్‌ను వెంటనే నిలిపివేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. మధ్యాహ్నం 12.30 సమయంలో ప్రగతి మైదాన్ గేట్ నం.7 నుంచి లోపలికి దూసుకొచ్చిన ఆందోళనకారులు ఎగ్జిబిషన్ ఎదుట ఆందోళనకు దిగారు. వెంటనే ఎగ్జిబిషన్‌ను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ప్రగతి మైదాన్‌లో పాకిస్థాన్ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నాలుగు రోజుల పాటు ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు పాకిస్థాన్ హై కమిషన్‌కు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం విదితమే.
కాగా, ఈ అనుమతి ఇవ్వడం భారత ప్రభుత్వ తెలివితక్కువ తన మని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘పాకిస్థాన్ ఒక టైస్టు దేశం. మన దేశసమగ్రతకు ముప్పు వాటిల్లే విధంగా ఆ దేశం ముష్కరులను పెంచి పోషిస్తోంది.. భారత భూభాగంలో టైజానికి ఊతమిస్తూ, డబ్బు, ఆయుధాలు అందజేస్తూ పరోక్షంగా దేశంలో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తోంది.. అటువంటి దేశానికి మనదేశంలో ఎగ్జిబిషన్ ఏర్పాటుకు ఎలా అనుమతి ఇచ్చారు.. ఆ దేశ ఉత్పత్తులను మన దేశంలో అమ్మేందుకు మేం ఒప్పుకోం. దాన్ని అడ్డుకుని తీరుతాం.. మొదటిరోజు మా ఆందోళన విజయవంతమైంది.. దాన్ని మేం మిగిలాన నాలుగురోజులూ కొనసాగిస్తాం..’ అని ఒక ఆందోళనకారుడు చెప్పారు.
కాగా, ఆందోళనకారులను పోలీసులు తిలక్‌మార్గ్ పోలీస్ స్టేషన్‌కు తరలించి అనంతరం విడుదల చేశారు. మిగతా రోజుల్లో ఆందోళనకారులు ఎగ్జిబిషన్ వద్ద ఎటువంటి ఆందోళన చేపట్టకుండా చూసేందుకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటుచేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా, భారీ వర్షం, ఆందోళనల నేపథ్యంలో ఎగ్జిబిషన్ మొదటి రోజు అంతగా స్పందన లభించలేదని పాకిస్థాన్ నుంచి వచ్చిన ఎగ్జిబిటర్ తారిఖ్ అన్వర్ తెలిపాడు. మిగిలిన రోజుల్లో ప్రజల నుంచి స్పందన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.