
సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త ధర్మకర్తల మండలి నియామకంలో కొత్త మలుపు చోటుచేసుకుంది. ధార్మిక సంస్థలు, బ్రాహ్మణ సంఘాలు, ఇతర వర్గాల నుంచి వస్తున్న తీవ్ర విమర్శలు, ఆందోళనల నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత వెనక్కి తగ్గారు. టీటీడీ పాలకమండలిలో తనను సభ్యురాలిగా నియమించడం వివాదానికి దారి తీసిందని భావించిన అనిత.. బోర్డు నుంచి తనను తప్పించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు చంద్రబాబుకు ఎమ్మెల్యే అనిత లేఖ రాశారని సమాచారం.
టీటీడీ బోర్డు సభ్యురాలుగా నియమితులైన అనిత విషయంలో హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. తాను అన్య మతస్థురాలినని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకున్న అనితకు ఎలా అవకాశం ఇస్తారని ప్రశ్నిస్తున్నాయి. హిందూ ధార్మిక సంస్థలో రాజకీయ లబ్ధి కోసం అన్య మతస్థులకు చోటు కల్పించడం దారుణమని హిందూ సంఘాలు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే.
టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావును బోర్డు సభ్యుడిగా నియమించడంపై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. విజయవాడలో బ్రాహ్మణుల సత్రాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన బొండాకు టీటీడీ బోర్డులో ఎలా పదవి ఇస్తారని బ్రాహ్మణ సంఘం నేత ముష్టి శ్రీనివాసరావు నిలదీశారు.
వీడియో సోర్స్: వనిత టీవీ సౌజన్యం..
Comments
Please login to add a commentAdd a comment