సంతోషంగాలేని రజనీకాంత్!
దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటుతుంటే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం సంతోషంగా లేడట. ఎందుకంటే... రజనీకాంత్ జీవితంలో హోలీ పండక్కి చాలా ప్రత్యేకత వుంది. ప్రతి సంవత్సరం రజనీకాంత్...తన గురువు, అభిమాన దర్శకుడు కె.బాలచందర్కి తప్పకుండా శుభాకాంక్షలు తెలిపేవారట ఎక్కడ, ఎలా , ఎంత బిజీగా ఉన్నా... కలిసేందుకు వీలు లేకుంటే... కనీసం కాల్ చేసి అయినా బాలచందర్కి శుభాకాంక్షలు చెప్పడం మాత్రం మర్చిపోయేవారు కాదుట. అయితే ఈసారి ..తనను సినీ రంగానికి పరిచయం చేసిన బాలచందర్ ను విష్ చేసే అవకాశాన్ని మిస్ అవడం లింగ స్టార్ని బాధిస్తోందట. అనారోగ్యంతో ఇటీవల బాలచందర్ మృతి చెందిన విషయం తెలిసిందే.
'అపూర్వ రాగంగళ్' సినిమాతో చలన చిత్రపరిశ్రమకు పరిచయమై ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న, ఈ సూపర్ స్టార్ జీవితంలో హోలీ పండుగ కు ఇంకో ప్రాముఖ్యత ఉందట. అవును సరిగ్గా హోలీ రోజే బస్ కండక్టర్ శివాజీ రావు గైక్వాడ్ ...రజనీకాంత్గా అవతరించాడట.
1975వ సంవత్సరంలో శివాజీ రావు అనే రజనీకాంత్ను బిగ్ స్క్రీన్ కు పరిచయం చేద్దామనుకున్నపుడు బాలచందర్... రజనీకాంత్, చంద్రకాంత్, శ్రీకాంత్ అనే మూడు పేర్లను సూచించి, చివరికి రజనీకాంత్ బావుందని ఆ పేరును ఖాయం చేశారట. అలా తమిళ సినీ ఇండస్ట్రీలో రజనీకాంత్గా అడుగుపెట్టారు ఈ బస్ కండక్టర్.ఆ మధ్య జరిగిన ఒక సినిమా కార్యక్రమంలో స్వయంగా బాలచందరే ఈ విషయాన్ని వెల్లడించారు.