వంద శాతం కాన్ఫిడెన్స్‌తో దూసుకెళ్లగలగాలి!
ప్రస్తుతం ‘వైశాఖం’ చిత్రం డెరైక్ట్ చేస్తున్నా. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు లేడీ డెరైక్టర్స్ బాగానే వస్తున్నా, నిలదొక్కుకుంటున్నవాళ్ల సంఖ్య తక్కువగా ఉంది. దానికి కారణం ‘సర్వైవల్’. వరుసగా సినిమాలొస్తే ఫరవాలేదు. రాకపోవడంతో ఎక్కణ్ణుంచి వచ్చారో మళ్లీ అక్కడికే వెళ్లిపోతున్నారు. మనుగడ కోసం మళ్లీ అసిస్టెంట్ డెరైక్టర్స్‌గా చేయడమో, టీవీకి వెళ్లిపోవడమే చేస్తున్నారు. మహిళా దర్శకుల సంఖ్య పెరగకపోవ డానికి ఇదో కారణం. మరో కారణం - ప్రోత్సాహం లేకపోవడమే! బేసిక్‌గా ఆడవాళ్ల ప్రతిభపై చాలా మందికి అపనమ్మకం ఉంటుంది. అందుకని, కథ వినడానికి కూడా ఇష్టపడరు. ఒకవేళ విని బాగున్నా, ‘బాగుంది’ అని ఒప్పుకునేవాళ్లు పరిశ్రమలో తక్కువ. అదే క్రీడా రంగాన్ని తీసుకుంటే, సానియా మీర్జా, సైనా నైహ్వాల్, కోనేరు హంపిలకు ఎంతో ప్రోత్సాహం లభిస్తోంది.
అంతెందుకు? హిందీ రంగాన్ని తీసుకుంటే దర్శకురాలు ఫరా ఖాన్‌ని అక్కడివాళ్లు ఎంకరేజ్ చేస్తారు. జయాపజయాలనేవి మగ దర్శకు లకూ ఉంటాయి. కానీ, లేడీ డెరైక్టర్ నుంచి ఒక్క ఫ్లాప్ వచ్చినా, పక్కన పెట్టేస్తారు. పోనీ మంచి కథ తయారు చేసుకున్నా ‘హ్యాండిల్ చేయగలుగుతుందా?’ అని అనుమానిస్తారు. కానీ, నిరుత్సాహపడి పోకూడదు. ఎంకరేజ్ సున్నా అయినా వంద శాతం కాన్ఫిడెన్స్‌తో దూసుకెళ్లగలగాలి. డెరైక్టర్లుగా రావాలనుకునే వాళ్లకి నేనిచ్చే సలహా ఇదే! - బి. జయ, సినీ దర్శకురాలు (‘చంటిగాడు’, ‘లవ్‌లీ’ ఫేమ్)