
ఎప్పటికీ మీ కాశీనాథుని విశ్వనాథ్‌నే
ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్‌ఎన్‌సీసీ) 24వ వార్షికోత్సవ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న దర్శకుడు కె. విశ్వనాథ్‌ను హీరో చిరంజీవి, గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం (ఎస్పీబీ)ను మరో హీరో వెంకటేశ్ సత్కరించారు. ‘‘దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతగా కాకుండా ఓ సామాన్యుడిగా ఇక్కడికి వచ్చా. ఈ అవార్డు రేపు మరొకరికి వస్తుంది. కానీ, నేనెప్పటికీ మీ కాశీనాథుని విశ్వనాథుడిని మాత్రమే’’ అన్నారు కె. విశ్వనాథ్.
‘‘తెలుగు సినిమాతో నాది 51 ఏళ్ల అనుబంధం. ఇన్నేళ్లు నన్ను భరించిన చిత్రసీమ, ప్రేమించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. విశ్వనాథ్‌గారి పక్కన కూర్చుని సన్మానం అందుకోవడం గర్వంగానూ, ఆనందంగానూ ఉంది’’ అన్నారు ఎస్పీబీ. చిరంజీవి మాట్లాడుతూ – ‘‘అవార్డులు విశ్వనాథ్, ఎస్పీబీ గార్లకు కొత్తేమీ కాదు. కానీ, ఒకే వేదికపై సూర్య చంద్రులు వంటి ఇద్దర్నీ సన్మానించడం... అదీ ఎఫ్‌ఎన్‌సీసీ ఆధ్వర్యంలో నా చేతుల మీదుగా జరగడం సంతృప్తిగా ఉంది’’ అన్నారు. ఈ వేడుకలో నటుడు కైకాల సత్యనారాయణ, నటీమణులు సుహాసిని, భానుప్రియ, తులసి, రోజా రమణి, రచయిత పరుచూరి గోపాలకృష్ణ తదితరులతో పాటు ఎఫ్‌ఎన్‌సీసీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.