ఎవరేమనుకున్నా ఇది సత్యం!
ఎవరేమనుకున్నా ఇది సత్యం!
Published Sun, Mar 16 2014 12:01 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
సినిమాల్లో మాత్రమే కాదు.. నిజజీవితంలోనూ ఆమిర్‌ఖాన్ హీరోయే అని బాలీవుడ్‌వారు అంటారు. అందుకే ‘మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్’ అని పిలుస్తుంటారు. ఆ ఇమేజ్ ఉన్నందునే ఆమిర్ చేస్తున్న ‘సత్యమేవ జయతే’ టీవీ షోకి భారీ ఎత్తున స్పందన లభిస్తోంది. ఈ టీవీ షోలో ఆమిర్ పలు సామాజిక అంశాల గురించి చర్చిస్తున్న విషయం తెలిసిందే. నిజాలను నిర్భయంగా మాట్లాడటం వల్ల ఈ షోకి భారీగా ప్రశంసలు లభిస్తున్నాయి. కానీ, విమర్శించడానికి కొంతమంది రెడీగా ఉంటారు కదా. అలాంటివాళ్లు సోషల్ నెట్‌వర్కింగ్ ద్వారా ఆమిర్ పరువు, ప్రతిష్టలకు భంగం వాటిల్లే విధంగా ప్రచారం చేస్తున్నారు. ‘సత్యమేవ జయతే’కి వస్తున్న విరాళాలను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు చేస్తున్నారు. వారి గురించి పోలీసులకు ఆమిర్ ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఆమిర్ మాట్లాడుతూ -‘‘ ‘సత్యమేవ జయతే’ ఓ ప్రయోజనాత్మక కార్యక్రమం. అది ఎవరూ కాదనలేని విషయం. నేనీ ప్రోగ్రామ్ డబ్బులు తీసుకోకుండా చేయడంలేదు. ఎందుకంటే, ఇది నా జాబ్. ఎక్కువ డబ్బులు తీసుకుని చెడ్డ పనులు చేసే బదులు తక్కువ డబ్బుకి మంచి పని చేయొచ్చనుకున్నాను. ఈ షో ద్వారా నాకు లభించే ఆర్థిక సంతృప్తి గురించి పక్కన పెడితే, ఆత్మసంతృప్తి మాత్రం మెండుగా ఉంది. వాణిజ్య ప్రకటనల్లో నటిస్తే వచ్చే డబ్బుతో పోల్చితే, ఈ షోకి నేను తీసుకుంటున్నది చాలా చాలా తక్కువ. మొత్తం ఏడాదంతా ఈ షోకి కేటాయించేశాను. డబ్బే ప్రధానం అనుకుంటే సినిమాలు, వాణిజ్య ప్రకటనలు చేసేవాణ్ణి. కానీ, ‘సత్యమేవ జయతే’ని డబ్బుతో ముడిపెట్టడం ఇష్టం లేదు. నా సంపాదన తగ్గినా ఫర్వాలేదనుకున్నా. ఎవరేమనుకున్నా ఇది సత్యం’’ అన్నారు.
Advertisement
Advertisement