స్టార్ డమ్ కోసం భయపడను!
ముంబై: సినిమా ఇండస్ట్రీలో స్టార్ డమ్ ను కోల్పోతానన్న భయం లేదు అంటోంది పొడుగుకాళ్ల సుందరి దీపికా పదుకునే. ఆ హోదా ఎప్పటికైనా చేజారిపోయేదేనని.. అందుకోసం భయపడటం దేనికని ప్రశ్నిస్తోంది. బాలీవుడ్ లో 'ఓం శాంతి ఓం' చిత్రంతో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న దీపికా పదుకునే ఆపై వెనుదిరిగి చూడలేదు. ఆ తరువాత వచ్చిన 'సావారియా' చిత్రం దీపికా క్రేజ్ ను మరింత పెంచింది. అనంతరం గత సంవత్సరం వచ్చిన 'చెన్నై ఎక్స్ ప్రెస్', 'యే జవానీ హై దీవానీ', రేస్-2 చిత్రాలు ఆమె ప్రతిభకు మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం 'ఫైండింగ్ ఫెనీ' చిత్రం విడుదలకు సిద్ధంగా నేపథ్యంలో ఆమె మీడియాతో ముచ్చటించారు. 'తనకు స్టార్ హోదాపై నమ్మకం లేదని ఈ అమ్మడు తేల్చిచెప్పేసింది.
అది ఏదో ఒక రోజు కోల్పోక తప్పదని వేదాంత ధోరణిని ప్రదర్శించింది. 'మీరు స్టార్ డమ్ ను కోల్పోతున్నానని ఆందోళనలో ఉన్నారా'?అన్న ప్రశ్నకు దీపికా పై విధంగా స్పందించింది. తాను చేసే పనిలో నిబద్ధతను మాత్రమే కోరుకుంటానని, ఆ పని మనకు ఎంత సురక్షితంగా ఉందన్నది మాత్రమే ఆలోచిస్తానని దీపిక స్పష్టం చేసింది. ఈ నెలలో ఒక వారం వ్యవధిలో దీపికా-సోనమ్ కపూర్ ల చిత్రాలు విడుదలకు రంగం సిద్ధమైన నేపథ్యంలో ఇరువురి మధ్య పోటీ నెలకొందని బాలీవుడ్ వర్గాలు విశ్లేషించడంతో ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.