'యువ నటులను నేనెప్పుడూ బెదరగొట్టలేదు'
ముంబై: నాలుగు దశాబ్దాల తిరుగులేని సినీ కెరీర్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ది. ఈ నాలుగు దశాబ్దాల కాలంలో ఎన్నో చిత్రాల్లో నటించిన ఆయన ప్రస్తుతం ఫిలిం ఇండస్ట్రీలో సీనియర్ మోస్ట్ యాక్టర్. అయినా తన సహ యువనటులను తానెప్పుడూ భయపెట్టలేదని ఆయన చెప్పారు. ' ఏ యువనటుడిని నేను బెదరగొట్టలేదు. నిజానికి వారే బాగా నటిస్తున్నారు. నేనే వారి ముందు తప్పులు చేస్తున్నారు. నిజానికిది చెడ్డ విషయం' అని అమితాబ్ సోమవారం ముంబైలో జరిగిన ఓ ముఖాముఖి కార్యక్రమంలో పేర్కొన్నారు.
'పీకూ'లో తనతో కలిసి నటించిన దీపికా పదుకోణ్, 'బాజీరావు మస్తానీ'లో రణ్వీర్ సింగ్ నటనను అమితాబ్ ప్రశంసల్లో ముంచెత్తారు. 'వాళ్లు ఎంతోమంచి నటులు, ప్రతిభావంతులు. నిజానికి వారు తమ తొలి చిత్రాల్లోనే ఎంతోబాగా నటించారు. వాళ్లిద్దరిలో ఎవరు ఎంచుకుంటారంటే నేను చెప్పలేను. 'బాజీరావు మస్తానీ'లో దీపికా, రణ్వీర్ ఏ పొరపాటుకు తావివ్వకుండా గొప్పగా నటించారు' అని ఆయన పేర్కొన్నారు. ప్రియాంక చోప్రా, అలియాభట్,కంగనా రనౌత్ వంటి తదితర నటులంతా ఎంతో అద్భుతంగా నటిస్తున్నారని కొనియాడారు. 73 ఏళ్ల అమితాబ్ బచ్చన్ 'టీఈ3ఎన్' చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, విద్యాబాలన్ తో కలిసి నటిస్తున్నారు. అలాగే ఫర్హాన్ అఖ్తర్ తో కలిసి 'వజీర్'లో కనిపించనున్నారు.