ఆ మూడు రోజుల్లోనే ఆయనేంటో తెలుసుకున్నా!
‘‘నాకు అభినందనలంటే అసహ్యం. అందుకే ఎవరైనా నన్ను అభినందించినప్పుడు నా మొహాన్ని అదోలా పెట్టుకుంటా’’ అంటున్నారు దీపికా పదుకొనె. ఆమెకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ డింపుల్ బ్యూటీని అభినందించేవారి శాతం ఎక్కువే ఉంటుంది. ఇటీవల విడుదలైన ‘చెన్నయ్ ఎక్స్‌ప్రెస్’లో దీపికా నటనకు బోల్డన్ని ప్రశంసలు లభించాయి.
కొంతమందైతే.. గ్లామరస్ రోల్స్ మాత్రమే కాకుండా.. ఇలాంటివి కూడా చేయండని సలహా ఇచ్చారట. ఈ విషయం గురించి దీపికా స్పందిస్తూ- ‘‘గ్లామరస్ రోల్సే కదా అని చాలామంది తీసిపారేస్తుంటారు. కానీ, ఒక్క విషయం అందరూ తెలుసుకోవాలి. ఏ పాత్రైనా సరే కెమెరా ముందు సమర్థవంతంగా నటించకపోతే పండదు. అందుకే నేను గ్లామరస్, డీ-గ్లామర్ రోల్స్ రెంటికీ ప్రాధాన్యం ఇస్తాను’’ అని చెప్పారు.
రజనీకాంత్ సరసన ఆమె నటించిన ‘కోచడయాన్’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం గురించి దీపికా చెబుతూ - ‘‘రజనీసార్ కాంబినేషన్‌లో నేను షూటింగ్ చేసింది మూడు రోజులే. కానీ ఆ మూడు రోజుల్లోనే ఆయనేంటో తెలుసుకున్నా. స్టార్ హీరో అనే ఫీలింగ్ ఏమాత్రం లేదాయనకు. చాలా నిరాడంబరంగా ఉంటారు. ఎన్నో సక్సెస్‌లు చవి చూసినా, మొదటి సినిమా చేసినంత ఎగ్జయిట్‌మెంట్‌తో నటిస్తారు.
లొకేషన్లో అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు. తప్పకుండా ఆయన్ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి. ‘కోచడయాన్’ విడుదలకు సిద్ధమవుతోందంటే నాకు ఎగ్జయిట్‌మెంట్ పెరిగిపోతోంది. ఈ చిత్రం అందర్నీ మంచి అనుభూతికి గురి చేస్తుంది’’ అన్నారు.