నాకు మత బేధాల్లేవ్
ఇండోర్: తనకు మతభేదాలు లేవని ప్రముఖ పాకిస్థాన్కు చెందిన సంగీతకారుడు అతిఫ్ అస్లామ్ అన్నారు. ఎవరికోసమైనా తాను సంగీతం అందిస్తానని, హిందువులు, ముస్లింలు అనే బేధం తాను చూపబోనని చెప్పారు. పుణెలో ఓ మ్యూజిక్ ప్రదర్శన కోసం తన బృందంతో దిగిన ఆయనను ఓ హిందూ సంస్థ పాక్ చెందిన ఓ ముస్లిం వ్యక్తి ఇక్కడ సంగీత ప్రదర్శన ఇవ్వాల్సిన అవసరం లేదని అడ్డుకున్నారు. దీంతో ఆయన మ్యూజిక్ ప్రదర్శన ఆగిపోయింది.
ఈ సందర్భంగా ఓ మీడియాతో మాట్లాడుతూ తనకు ఎలాంటి విద్వేషాలు ఉండవని, మనసునిండ ప్రేమ మాత్రమే ఉంటుందని, భారతీయ అభిమానులకు మ్యూజిక్ పంచేందుకు వచ్చానని చెప్పారు. 'భారతీయ అభిమానులంటే నాకు చాలా ఇష్టం. భారతీయుడిగా ఉండటమన్నా ఇష్టం. నేనొక సంగీతకారుడిని. ఎవరికోసమైన మ్యూజిక్ చేస్తాను. నా వద్ద హిందువులు ముస్లింలు అంటూ కేటగిరీలు ఉండవు. సంగీతానికి హద్దులు లేవు. నేనేం తప్పు చేయడం లేదు. నేను ఇక్కడ ఏం సంపాధించినా దానిని కొంత పన్నుగా కూడా చెల్లిస్తాను' అని ఆయన అన్నారు. అతీఫ్ అస్లామ్ 'జహర్' అనే చిత్రంలో వాహ్ లమ్హే అనే పాటతో 2005లో బాలీవుడ్లో ప్రవేశించారు.