సినిమాల్లోకి రాకపోయివుంటే..
ముంబై: తాను సినిమాల్లోకి రాకపోయివుంటే కలెక్టర్ కావాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేసేవారని బాలీవుడ్ దర్శకుడు ప్రకాశ్ ఝా వెల్లడించారు. గ్రాడ్యుయేట్ కాకూడదన్న ఉద్దేశంతో చదువు మధ్యలో మానేశానని చెప్పారు. 'నిజం చెబుతున్నా. గ్రాడ్యుయేషన్ పూర్తి చేయకూడదన్న ఉద్దేశంతోనే కాలేజీ మానేశా. ఒకవేళ డిగ్రీ పూర్తి చేసివుంటే నాతో సివిల్స్ పరీక్షలు రాయించి కచ్చితంగా నన్ను కలెక్టర్ చేసే వార'ని ప్రకాశ్ ఝా అన్నారు.
సినీగీత రచయిత అనంద్ బక్షి కుమారుడు రాకేశ్ రాసిన 'డైరెక్టర్ డైరీస్: ది రోడ్ టూ ఫస్ట్ ఫిలిమ్' పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బాలీవుడ్ లోకి తాను ఎలా అడుగుపెట్టిందీ వివరించారు. బిహార్ బ్రాహ్మణ్ కుటుంబానికి చెందిన తాను ఐఏఎస్ కావాలన్న ఉద్దేశంతోనే ఢిల్లీలోని రామజాస్ కాలేజీలో చేరానని చెప్పారు. ఏడాది గడిచాక తన లక్ష్యం మారిందని, దాంతో ముంబైకు వచ్చానని వెల్లడించారు.
సినిమాల్లోకి రావడం రిస్క్ తో కూడుకున్నదైనప్పటికీ ఉత్తేజకరంగానూ, ఉత్సాహంగానూ ఉంటుందని చెప్పారు. అపహరణ్, రాజనీతి సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. తాజాగా ప్రియంకా చోప్రాతో 'గంగాజల్ 2' తెరకెక్కిస్తున్నారు.