మ్యాస్ట్రో మరో రికార్డ్
దక్షిణాది లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా మరో అరుదైన రికార్డ్ను సొంతం చేసుకున్నారు. భారతీయ సినీ చరిత్రలో మరే సంగీత దర్శకుడికి సాధ్యం కాని 1000 సినిమాల మార్క్ను అందుకున్న మ్యాస్ట్రో, తాజాగా ఆ సినిమాకు జాతీయ అవార్డ్ను సైతం సొంతం చేసుకున్నారు. తన 1000వ చిత్రంగా తారై తప్పట్టై సినిమాకు సంగీతం అందించిన ఇళయరాజాకు, ఉత్తమ నేపథ్య సంగీతం విభాగంలో జాతీయ అవార్డు లభించింది. ఇది, సంగీత విభాగంలో ఇళయరాజా సాధించిన ఐదవ జాతీయ అవార్డ్.
గతంలో 1984లో సాగరసంగమం, 1989లో రుద్రవీణ లాంటి తెలుగు చిత్రాలకు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డును అందుకున్న ఇళయరాజా, తరువాత 1986లో విడుదలైన తమిళ చిత్రం సింధుభైరవి, 2009లో రిలీజ్ అయిన మలయాళ సినిమా పళాసి రాజాలకు కూడా జాతీయ అవార్డులను అందుకున్నారు. తాజాగా దర్శకుడు బాల రూపొందించిన తారై తప్పట్టై చిత్రానికి గాను తన ఐదవ జాతీయ అవార్డును అందుకుంటున్నారు మ్యాస్ట్రో.