
నేను చాలా నేర్చుకోవాలి!
నటిగా తాను నేర్చుకోవలసింది చాలా ఉంది అంటోంది నటి ఇలియానా. ఇంతకుముందు నాయకిగా దక్షిణాదిలో ఒక ఊపు ఊపిన ఈ బ్యూటీ ప్రస్తుతం పూర్తిగా బాలీవుడ్‌పైనే దృష్టి సారించింది. హిందీలో తొలిచిత్రం ఖుషి ఆశించిన విజయం సాధించకపోయినా ఇలియానాకు మాత్రం నటిగా మంచి మార్కులే పడ్డాయి. అక్కడ ఈ అమ్మడి పరిస్థితి ఆశాజనకంగానే ఉంది. అయితే తననీ స్థాయికి చేర్చిన దక్షిణాది చిత్ర పరిశ్రమను ముఖ్యంగా తెలుగు పరిశ్రమను మర్చిపోనంటున్న ఈ గోవా సుందరితో చిన్న భేటీ.
తెలుగు నుంచి హిందీకి వెళ్లిన అనుభవం ఎలాగుంది?
ఆదిలోతనకు అవకాశాలు ఇచ్చింది దక్షిణాది చిత్ర పరిశ్రమనే. నాలోని నటనా ప్రతిభను గుర్తించింది దక్షిణాది చిత్ర ప్రముఖులే. ఆ తరువాతనే హిందీ చిత్ర అవకాశాలు నన్నెతుక్కుంటూ వచ్చాయి. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి హిందీ చిత్ర పరిశ్రమకు రావడం అనేది నాకు కొత్తమలుపే. ఇక అక్కడ విజయాలతో ఒక్కో మెట్టుఎదగాలి.
ప్రస్తుతం వాణిజ్య ప్రకటనల్లోనూ నటిస్తున్నారు. నటించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
ముఖ్యంగా నా ద్వారా ప్రకటించే వస్తువులు నిజంగా నాణ్యమైనవేనా..? అనే అంశం గురించి ఆరా తీస్తాను. నేను ప్రకటన కోసం నటించిన షాంపూను నేనే పలుసార్లు ఉపయోగించి చూస్తాను. ఎందుకంటే ప్రజల మధ్యకు వెళ్లే ప్రొడక్ట్‌లో నాణ్యత లేకపోతే వాటికి సంబంధించిన ప్రకటనల్లో నేను నటించను. ప్రస్తుతం చాలా మంది నకిలీ వస్తువులతో చాలా మోసపోతున్నారు. అందువల్ల నేను ప్రచారంచేసే వస్తువు ఏమిటి? అందులో ఎలాపాలు పంచుకోవాలి? అన్న విషయాలపై సుదీర్ఘంగా చర్చిస్తాను. వాణిజ్య ప్రకటనలో నటించడం అనేది నా ఉద్దేశంలో మంచి వృత్తినే.
కొందరు నటీమణులు జీరో ఫిగర్ పేరుతో మరీ సన్నగా తయారవుతున్నారు? ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి?
సినిమాకు అందమైన ఆకారం అవసరం. అందమైన అవయవ సంపద కలిగి ఉంటే రంగురంగుల దుస్తులు ధరించి అదరగొట్టవచ్చు. అందుకని నోరు కుట్టుకుని జీరో ఫిగర్ అనిపించుకోవడం నాకిష్టం ఉండదు.
మీ దృష్టిలో నాగరీకత అంటే?
నాగరికత అంటే నవ్యంగా ఉండాలి. అదే సమయంలో మనకు సౌకర్యంగా ఉండాలి. నలుగురూ నవ్వుకునేలా ఉండకూడదు. నాకు విదేశీ దుస్తులంటే ఇష్టమే. అయితే వాటిని ఇతరులుచూసి బాగున్నామనిపించేలా చూసుకుంటాను.
మీరు పోటీపడే నటి ఎవరు?
ప్రస్తుతానికి నేనెవరితోనూ పోటీ పడడంలేదు. నటనలో నేనింకా నేర్చుకోవలసింది చాలా ఉంది. ఒక్కొక్కరి నటన నాకొక్కో రకంగా పాఠం.
మీరు నిజ జీవితంలోను, సినిమాలోనూ ఎప్పుడూ చాలా అందంగా కనిపించడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
నేను కొత్తగా అందంగా తయారవ్వాల్సిందేమీ లేదు. నిజ జీవితంలో ఎలా ఉంటానో, సినిమాలోనూ అలానే ఉంటాను. నిజానికి అందం అనేది మనం మాట్లాడే విధానం, చూపుల్లో, నవ్వులో, ఇతరులతో ప్రవర్తించే విధానంలోనూ ఉంటుంది. దాన్ని పోరాడి పొందాల్సిన అవసరం లేదు. నన్నడిగితే చిరునవ్వే నిజమైన అందం.
పలు భాషల్లో నటిస్తున్నప్పుడు భాషా సమస్య తలెత్తదా?
ఇప్పుడు భాష ఒక సమస్య కాదు. ఎవరైనా ఏ భాషలోనైనా నటించవచ్చు. నేను పుట్టింది ముంబయిలో. పెరిగింది గోవాలో. అక్కడే చదివాను. 16 ఏళ్ల ప్రాయంలో వాణిజ్య ప్రకటనల్లో నటించడానికి సిద్ధమయ్యాను. 18 ఏళ్ల వయసులో తెలుగు చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఆ తరువాత తమిళంలో నటించాను. ఇప్పుడు హిందీ చిత్రాలు చేస్తున్నాను. కాబట్టి భాష ఎలాంటి సమస్య కాదు.