ప్రేక్షకుడి సహనానికి పరీక్ష 'సత్య2'
ప్రేక్షకుడి సహనానికి పరీక్ష 'సత్య2'
Published Fri, Nov 8 2013 3:08 PM | Last Updated on Sat, Sep 2 2017 12:25 AM
మాఫియా చిత్రాలను నిర్మించడంలో భారత సినీ చరిత్రలో దర్శకుడు రాంగోపాల్ వర్మది ఓ డిఫరెంట్ స్టైల్. ఆయన ఓ ట్రెండ్ సెట్టర్ కూడా. అయితే ఈ మధ్యకాలంలో తనకు ఇష్టమైన మాఫియా నేపథ్యంగా ఉండే చిత్రాలను ప్రేక్షకుల సంతృప్తికి తగినట్టుగా అందించడంలో విఫలమవుతున్నారనే విమర్శలు ఎక్కువగానే వినిపిస్తున్నాయి. మాఫియా చిత్రాలను తీయడంలో తానే డాన్ అని చెప్పుకోవాల్సిన నేపథ్యంలో 'సత్య2' విడుదలైంది. సత్య2 ద్వారా వర్మ మళ్లీ పూర్వ వైభవం అందుకున్నారా అనే విషయాన్ని పరిశీలించాలంటే కథను తెలుసుకోవాల్సిందే.
సత్య అనే ఓ సామాన్య యువకుడు మాఫియాకు కొత్త నిర్వచనం చెప్పేందుకు ముంబై మహానగరానికి చేరుకుంటాడు. సినీ దర్శకుడు కావాలనే ప్రయత్నిస్తున్న నారా అనే స్నేహితుడి వద్ద సత్య ఉంటాడు. దావూద్ ఇబ్రహిం 'డి' కంపెనీ, అబూసలేం, చోటా రాజన్ లాంటి వాళ్లు తమ ఐడెంటీ కోసం పాకులాడి మాఫియాను నిర్మించడంలో విఫలమయ్యారని సత్య అభిప్రాయం. ముంబైని ఏలిన మాఫియా డాన్ ల బాటను ఎంచుకోకుండా ఓ విభిన్నమైన మాఫియా కంపెనీని స్థాపించాలని ప్లాన్ వేస్తాడు.
అందుకనుగుణంగానే ముంబై మాఫియా పరిస్థితులను అధ్యయనం చేసి, కొంత మంది వ్యాపారవేత్తలతో కలిసి సత్య ఓ 'కంపెనీ' ఏర్పాటు చేస్తాడు. తాను ఏర్పాటు చేసుకున్న కంపెనీ ద్వారా అనుకున్న లక్ష్యాలను సాధించాడా? ఆ ప్రక్రియలో సత్యకు ఎదురైనా పరిస్థితులేంటి? కంపెనీ ఏర్పాటు ఎందుకు చేయాలనుకుంటాడనే సందేహాలకు సమాధానమే 'సత్య2' చిత్రం.
సత్య పాత్రలో నటించిన పునీత్ సింగ్ రత్న్ ఓకే అనిపించినా.. గతంలో అదే (సత్య) పాత్రలో నటించిన జేడీ చక్రవర్తిని మరిపించలేకపోయాడు. అక్కడక్కడ కొన్ని సన్నివేశాల్లో పర్వాలేదనిపించినా... కీలక సీన్లలో ఓ మాఫియా డాన్ ప్రదర్శించాల్సిన ఎమోషన్స్ ను పలికించడంలో విఫలమయ్యాడు. సత్య పాత్ర తర్వాత చెప్పుకోవాల్సినంతగా ఏ పాత్ర కూడా లేకపోయింది. చిత్ర పాత్రలో అనైక, స్పెషల్ పాత్రలో ఆరాధన లు అందాల ఆరబోతకే పరిమితమయ్యారు.
ఫోటోగ్రఫి సత్య2 చిత్రానికి కొంత బలాన్ని ఇచ్చిందనే చెప్పవచ్చు. కీలక సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదనపు ఆకర్షణ. పాటలు ఓకే అనే స్థాయిలోనే ఉన్నాయి.
ఇక ఈ సినిమాలో వర్మ అని తానై వ్యవహరించారు. కథను ఎంచుకోవడంలో పూర్తిగా వర్మ విఫలమయ్యారు. స్క్రీన్ ప్లే కూడా మరీ దారుణంగా ఉండటంతో ప్రేక్షకుడిని ఆకట్టుకోలేకపోయారు. ఫస్టాఫ్ లో ప్రేక్షకుడ్ని ఎంగేజ్ చేయడానికి ప్రయత్నించారు. అయితే సెకండాఫ్ లో పస లేకపోవడం ప్రేక్షకుడిని అసహనానికి గురి చేసింది. ఓ దశలో వర్మ ఏం చెప్పాలనుకుంటున్నాడో కూడా అర్ధం కాని పరిస్థితి. సత్య2 చిత్రం తెలుగులో పూరి జగన్నాథ్ నిర్మించిన 'బిజినెస్ మెన్' చిత్రం దగ్గరగా అనిపించింది. అయితే బిజినెస్ మెన్ కథను వర్మ తనదైన శైలిలో ఖూనీ చేశాడనే చెప్పవచ్చు. ఇక క్లైమాక్స్ లోనైనా వర్మ ఏమైనా చెబుతాడనుకున్న ప్రేక్షకులకు 'సత్య3'లో వివరిస్తామని చెప్పడం ఆయన దర్శకత్వ ప్రతిభకు పరాకాష్టగా నిలిచింది.
వినోదం కోసం టికెట్ కొనుక్కుని వచ్చే ప్రేక్షకులు అత్యంత జుగప్సకరంగా మద్యం, దూమపాన ప్రకటనలను చూడాల్సిన ఖర్మ ఎందుకు అని ఇటీవల ట్విటర్ ప్రశ్నించారు. అదే వినోదం కోసం వచ్చే ప్రేక్షకులకు అంతకంటే దారుణంగా ఉండే 'సత్య2' చిత్రాన్ని చూపిస్తే భరించగలరా అని తనను తాను ప్రశ్నించుకునే సమయం వర్మకు వచ్చింది. ఇక సత్య చిత్రానికి సీక్వెల్ అంటే అదికాదు. మరెందుకు ఈ చిత్రానికి సత్య2 అని పేరు పెట్టాల్సిన అవసరమేమి వచ్చిందో!.
Advertisement