satya2
-
సినీ నిర్మాతలకు దడలక్ష్మి!
సినీ నిర్మాతలకు, సెన్సార్ బోర్డు సభ్యులకు విబేధాల నెలకొన్నాయనే వార్తలు వినిపించడం సహజమే. తమ సృజనాత్మకతపై సెన్సార్ బోర్డు అధికారులు కత్తెర వేస్తున్నారనే ఆరోపించడం మనం గమనిస్తూ ఉంటాం. ఇటీవల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమ నిర్మాతలకు, సెన్సార్ కు మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా సెన్సార్ బోర్డు ప్రాంతీయ అధికారి ధనలక్ష్మిపై టాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు వివాదస్పద ఆరోపణలు చేయడం మీడియాలో సంచలనంగా మారాయి. సినిమాలను నిర్మించడం ఒక ఎత్తు అయితే.. ధనలక్ష్మిని ఎదుర్కోవడం మరో ఎత్తు అనే భావనలో ఉన్నారు. ఇన్నాళ్లు తమ గోడును ఎవరికి చెప్పుకోలేక...ధనలక్ష్మిని ఎదురించలేక ఊరుకున్నారు. ప్రాంతీయ సెన్సార్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ధనలక్ష్మికి, పలువురు సినీ నిర్మాతలకు మధ్య గొడవలు మీడియాకే పరిమితంగా కాగా.. తాజాగా కోర్టు మెట్లెక్కాయి. గతంలో ధనలక్ష్మి నియామకంపై కోర్టులో డీవీ శైలేంద్ర కుమారి పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగంలోని 29(1) ఆర్టికల్ నిబంధనను ఉల్లంఘించి నియామకం చేపట్టారని పిటిషన్ దాఖలైంది. ధనలక్ష్మిపై చాలా మంది నిర్మాతలు ఆరోపణలు చేసినా.. వ్యవహారాన్ని కోర్టు వరకు తీసుకువెళ్లలేదు. అయితే ప్రస్తుతం ధనలక్ష్మికి ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మధ్య సత్య2 చిత్ర విషయంలో వివాదం నెలకొంది. సత్య2 చిత్ర విడుదల సమయంలో ధనలక్ష్మి తనను వేధించిందని వర్మ సోషల్ మీడియా వెబ్ సైట్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడమే కాకుండా.. పలు మీడియా చానెల్లలో వెల్లడించారు. 'సత్య2' చిత్ర విషయంలో తొలగించిన సన్నివేశాలపై ధనలక్ష్మి వివరణ ఇచ్చారు. ఓ టెలివిజన్ సమర్పించిన వినతిపత్రం ఆధారంగానే స్పందించి కొన్ని సన్నివేశాలను తొలగించాం అని ధనలక్ష్మి తెలిపారు. తనను వేధించిన ధనలక్ష్మిపై నాంపల్లి క్రిమినల్ కోర్టులో కేసు నమోదు చేస్తాను అని అన్నారు. తన పట్ల ప్రవర్తించిన తీరుతో మానసికంగా బాధను అనుభవించానని.. అంతేకాకుండా ఆర్ధికంగా కూడా నష్టపోయానని వర్మ తెలిపారు. బాలీవుడ్ చిత్రాలను నిర్మించిన వర్మకు ముంబైలో మాఫియాను మేనేజ్ చేసిన సామర్ధ్యం ఉంది. పరిస్థితులను బాలీవుడ్ లో తనకు అనుకూలంగా మలచుకోవడంలో సఫలీకృతమైన వర్మకు ధనలక్ష్మి చుక్కలు చూపించినట్టు వర్మ మాటలతో అర్ధమైంది. గతంలో ధనలక్ష్మిని బారిన పడిన ఇతర సినీ నిర్మాతలు రాంగోపాల్ వర్మ రియాక్షన్ కు మద్దతుగా నిలిచారు. దేనికైనా రెఢీ చిత్రం విడుదల సందర్భంగా కూడా నిర్మాత మంచు మోహన్ బాబు ఇదే బాధను అనుభవించారు. ఆ సమయంలో ధనలక్ష్మిపై కేంద్ర సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేస్తానని మీడియాలో తెలిపారు. మోహన్ బాబు మాదిరిగానే కాలిచరణ్ దర్శకుడు ప్రవీణ్ శ్రీ, నిర్మాతలు అశ్వినీదత్, దిల్ రాజు ఇతరులు తమ చిత్రాల విడుదల సమయంలో ఇబ్బందిని ఎదుర్కొన్నట్టు సమాచారం. వీరెవ్వరూ కూడా బయటకు చెప్పలేక.. ధనలక్ష్మితో సర్ధుబాటు ధోరణి ప్రదర్శించారు. గత కాలంగా అవకాశం ఎదురు చూస్తున్న బాధితులందరికి వర్మ ఆసరా దొరికింది. ఎందరో నిర్మాతలకు దడ పుట్టిస్తున్న ధనలక్ష్మిని వర్మ సహాయంతో ఎలా చెక్ పెడుతారో వేచి చూడాల్సిందే. a.rajababu@sakshi.com -
ప్రేక్షకుడి సహనానికి పరీక్ష 'సత్య2'
మాఫియా చిత్రాలను నిర్మించడంలో భారత సినీ చరిత్రలో దర్శకుడు రాంగోపాల్ వర్మది ఓ డిఫరెంట్ స్టైల్. ఆయన ఓ ట్రెండ్ సెట్టర్ కూడా. అయితే ఈ మధ్యకాలంలో తనకు ఇష్టమైన మాఫియా నేపథ్యంగా ఉండే చిత్రాలను ప్రేక్షకుల సంతృప్తికి తగినట్టుగా అందించడంలో విఫలమవుతున్నారనే విమర్శలు ఎక్కువగానే వినిపిస్తున్నాయి. మాఫియా చిత్రాలను తీయడంలో తానే డాన్ అని చెప్పుకోవాల్సిన నేపథ్యంలో 'సత్య2' విడుదలైంది. సత్య2 ద్వారా వర్మ మళ్లీ పూర్వ వైభవం అందుకున్నారా అనే విషయాన్ని పరిశీలించాలంటే కథను తెలుసుకోవాల్సిందే. సత్య అనే ఓ సామాన్య యువకుడు మాఫియాకు కొత్త నిర్వచనం చెప్పేందుకు ముంబై మహానగరానికి చేరుకుంటాడు. సినీ దర్శకుడు కావాలనే ప్రయత్నిస్తున్న నారా అనే స్నేహితుడి వద్ద సత్య ఉంటాడు. దావూద్ ఇబ్రహిం 'డి' కంపెనీ, అబూసలేం, చోటా రాజన్ లాంటి వాళ్లు తమ ఐడెంటీ కోసం పాకులాడి మాఫియాను నిర్మించడంలో విఫలమయ్యారని సత్య అభిప్రాయం. ముంబైని ఏలిన మాఫియా డాన్ ల బాటను ఎంచుకోకుండా ఓ విభిన్నమైన మాఫియా కంపెనీని స్థాపించాలని ప్లాన్ వేస్తాడు. అందుకనుగుణంగానే ముంబై మాఫియా పరిస్థితులను అధ్యయనం చేసి, కొంత మంది వ్యాపారవేత్తలతో కలిసి సత్య ఓ 'కంపెనీ' ఏర్పాటు చేస్తాడు. తాను ఏర్పాటు చేసుకున్న కంపెనీ ద్వారా అనుకున్న లక్ష్యాలను సాధించాడా? ఆ ప్రక్రియలో సత్యకు ఎదురైనా పరిస్థితులేంటి? కంపెనీ ఏర్పాటు ఎందుకు చేయాలనుకుంటాడనే సందేహాలకు సమాధానమే 'సత్య2' చిత్రం. సత్య పాత్రలో నటించిన పునీత్ సింగ్ రత్న్ ఓకే అనిపించినా.. గతంలో అదే (సత్య) పాత్రలో నటించిన జేడీ చక్రవర్తిని మరిపించలేకపోయాడు. అక్కడక్కడ కొన్ని సన్నివేశాల్లో పర్వాలేదనిపించినా... కీలక సీన్లలో ఓ మాఫియా డాన్ ప్రదర్శించాల్సిన ఎమోషన్స్ ను పలికించడంలో విఫలమయ్యాడు. సత్య పాత్ర తర్వాత చెప్పుకోవాల్సినంతగా ఏ పాత్ర కూడా లేకపోయింది. చిత్ర పాత్రలో అనైక, స్పెషల్ పాత్రలో ఆరాధన లు అందాల ఆరబోతకే పరిమితమయ్యారు. ఫోటోగ్రఫి సత్య2 చిత్రానికి కొంత బలాన్ని ఇచ్చిందనే చెప్పవచ్చు. కీలక సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదనపు ఆకర్షణ. పాటలు ఓకే అనే స్థాయిలోనే ఉన్నాయి. ఇక ఈ సినిమాలో వర్మ అని తానై వ్యవహరించారు. కథను ఎంచుకోవడంలో పూర్తిగా వర్మ విఫలమయ్యారు. స్క్రీన్ ప్లే కూడా మరీ దారుణంగా ఉండటంతో ప్రేక్షకుడిని ఆకట్టుకోలేకపోయారు. ఫస్టాఫ్ లో ప్రేక్షకుడ్ని ఎంగేజ్ చేయడానికి ప్రయత్నించారు. అయితే సెకండాఫ్ లో పస లేకపోవడం ప్రేక్షకుడిని అసహనానికి గురి చేసింది. ఓ దశలో వర్మ ఏం చెప్పాలనుకుంటున్నాడో కూడా అర్ధం కాని పరిస్థితి. సత్య2 చిత్రం తెలుగులో పూరి జగన్నాథ్ నిర్మించిన 'బిజినెస్ మెన్' చిత్రం దగ్గరగా అనిపించింది. అయితే బిజినెస్ మెన్ కథను వర్మ తనదైన శైలిలో ఖూనీ చేశాడనే చెప్పవచ్చు. ఇక క్లైమాక్స్ లోనైనా వర్మ ఏమైనా చెబుతాడనుకున్న ప్రేక్షకులకు 'సత్య3'లో వివరిస్తామని చెప్పడం ఆయన దర్శకత్వ ప్రతిభకు పరాకాష్టగా నిలిచింది. వినోదం కోసం టికెట్ కొనుక్కుని వచ్చే ప్రేక్షకులు అత్యంత జుగప్సకరంగా మద్యం, దూమపాన ప్రకటనలను చూడాల్సిన ఖర్మ ఎందుకు అని ఇటీవల ట్విటర్ ప్రశ్నించారు. అదే వినోదం కోసం వచ్చే ప్రేక్షకులకు అంతకంటే దారుణంగా ఉండే 'సత్య2' చిత్రాన్ని చూపిస్తే భరించగలరా అని తనను తాను ప్రశ్నించుకునే సమయం వర్మకు వచ్చింది. ఇక సత్య చిత్రానికి సీక్వెల్ అంటే అదికాదు. మరెందుకు ఈ చిత్రానికి సత్య2 అని పేరు పెట్టాల్సిన అవసరమేమి వచ్చిందో!. -
బాలీవుడ్ తెరపై భారీ హంగామా!
దీపావళి పండగ ఇలా వచ్చి.. అలా వెళ్లిపోయింది. ఆ సెలబ్రేషన్ మూడ్‌లోంచి ఇప్పుడిప్పుడే బయటికొస్తున్న బాలీవుడ్ ప్రేక్షకులు, ఇప్పుడు సినిమాల పరంగా పండగ చేసుకోబోతున్నారు. ఎందుకంటే, బాలీవుడ్లో ఈ నెల మొత్తం పండగ వాతావరణమే. ఈ మధ్యకాలంలో కనీవినీ ఎరుగని రీతిలో ఆరు భారీ బడ్జెట్ చిత్రాలు ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుండటం విశేషం. అన్నీ అగ్ర తారల చిత్రాలే. ఆసక్తికరమైన కథాంశాలే. ప్రేక్షకుల చెంతకు ఇప్పటికే ‘క్రిష్ 3’ చేరి, భారీ వసూళ్లు రాబడుతోంది. మిగతా చిత్రాలు విడుదలకు ముస్తాబవుతున్నాయి. ఆ చిత్రాల విశేషాలు తెలుసుకుందాం. సత్య-2: రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన ‘సత్య 2’ చిత్రం వాస్తవానికి అక్టోబర్ 25న విడుదల కావాల్సి ఉండగా, చిత్ర నిర్మాతల్లో ఒకరైన అరుణ్ శర్మతో వివాదం కారణంగా ఈ చిత్రాన్ని ఈ నెల 8కి వాయిదా వేశారు. మాములుగా వర్మ సినిమా అంటేనే అంచనాలు భారీ ఎత్తున ఉంటాయి. ఇక, చాక్లెట్ బోయ్‌లా ఉండే శర్వానంద్‌తో (హిందీలో పునీత్ సింగ్) ఈ చిత్రంలో మాస్ పాత్ర చేయించడం, అతని లుక్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉండటం ఈ చిత్రంపై అంచనాలు పెరగడానికి ఓ కారణంగా చెప్పుకోవచ్చు. అండర్ వరల్డ్ నేపథ్యంలో వర్మ తీసిన ‘సత్య’ ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఆ చిత్రానికి సీక్వెల్ కాకపోయినా కూడా, గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో వర్మ రూపొందించిన ఈ ‘సత్య 2’పై భారీ అంచనాలున్నాయి. రామ్‌లీలా: చరిత్రాత్మక నేపథ్యంతో రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ‘రామ్‌లీలా’ చిత్రానికి షేక్స్పియర్ విరచిత ప్రేమకథ ‘రోమియో జూలియట్’ అధారం. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనె నాయకా నాయికలు. ప్రియాంక చోప్రా ఓ ఐటమ్ సాంగ్‌లో మెరిసింది. ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలకు క్రేజ్ లభించింది. అలాగే, ఈ చిత్రం ఫస్ట్ లుక్, పోస్టర్స్ అంచనాలు పెంచాయి. ఫొటోల్లో రణ్వీర్, దీపికాల రొమాంటిక్ దృశ్యాలు హాట్ టాపిక్ అయ్యాయి.రియల్ లైఫ్‌లో ప్రేమించుకుంటున్న ఈ ఇద్దరూ రీల్‌పై తమ కెమిస్ట్రీని అద్భుతంగా పండించారని ఈ ఫొటోలు చూసినవాళ్లు అంటున్నారు. ఇక, రొమాంటిక్ లవ్‌స్టోరీస్ తెరకెక్కించడంలో భన్సాలీ స్టయిలే వేరు. ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం కావడంవల్ల, దీపికా, రణ్‌వీర్‌ల జంట కారణంగా ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. 15న రామ్లీలాల ప్రేమకహానీ వెండితెరపై ఆవిష్కృతం కాబోతోంది. గోరి తేరే ప్యార్ మే: పునీత్ మల్హోత్రా దర్శ కత్వంలో కరణ్ జోహార్ నిర్మించిన చిత్రం ‘గోరి తేరే ప్యార్ మే’. వాస్తవానికి 2011లో ఈ సినిమా ఎనౌన్స్మెంట్ జరిగింది. ముందుగా షాహిద్‌కపూర్, సోనమ్కపూర్లను హీరో హీరోయిన్లుగా ఎంపిక చేశారు. అయితే, ఈ చిత్రకథ పట్ల సంతృప్తి చెందక, ఈ ఇద్దరూ తప్పుకున్నారనే వార్త అప్పట్లో హల్చల్ చేసింది. ఆ తర్వాత సీన్లోకి ఇమ్రాన్ ఖాన్, కరీనా కపూర్ వచ్చారు. మరి... కథలో మార్పులు, చేర్పులు చేసిన తర్వాత ఈ ఇద్దరూ పచ్చజెండా ఊపారో లేక పునీత్ చెప్పిన కథ నచ్చే ఒప్పుకున్నారో అనే విషయం బయటికి రాలేదు. ఇది రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. ఈ తరహా సినిమాలకు ట్రెండ్‌తో సంబంధం లేదు. కథ బాగుంటే చాలు.. వసూళ్ల వర్షం కురిపించేస్తాయ్. మరి.. ఈ ప్రేమకథ బాక్సాఫీస్ ఖజానాని నింపగలుగుతుందో లేదో? ఈ 22న తెలిసిపోతుంది. రజ్జో: ఇటీవల బాలీవుడ్లో ఎక్కువగా వార్తల్లో నిలిచిన చిత్రాల్లో ‘రజ్జో’ ఒకటి. దానికి కారణం ఈ చిత్రం కథాంశం. రజ్జో అనే ముస్లిం యువతి, చందు అనే బ్రాహ్మణ యువకుడి మధ్య జరిగే ప్రేమాయణమే ఈ చిత్రం ప్రధాన ఇతివృత్తం. ఇలాంటి కథలు చాలానే వచ్చాయి కదా అనుకుంటున్నారా? ఈ కథలో ట్విస్ట్ ఏంటంటే.. కుర్రాడు టీనేజ్‌లో ఉంటాడు. ఆ యువతికి పాతికేళ్లు. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత విశ్వాస్ పాటిల్ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్, మ్యూజికల్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో కంగనా రనౌత్, పరాస్ అరోరా హీరో, హీరోయిన్లు. కీలక పాత్రలను ప్రకాశ్‌రాజ్, మహేశ్ మంజ్రేకర్, జయప్రద లాంటి అగ్రతారలు పోషించారు. 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘రామ్‌లీలా’తో ఈ ‘రజ్జో’ పోటీ పడనుంది. నిందలు మిగులుతాయో, అభినందనలు దక్కుతాయో వేచి చూడాల్సిందే! సింగ్ సాబ్ ది గ్రేట్: కొంత విరామం తర్వాత సన్నీ డియోల్ నటించిన చిత్రం ‘సింగ్ సాబ్ ది గ్రేట్’. టైటిల్‌ని బట్టి ఓ శక్తిమంతమైన సింగ్ సాబ్ చుట్టూ ఈ కథ తిరుగుతుందని ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. సింగ్‌గా సన్నీ లుక్‌కి ఇప్పటికే మంచి మార్కులు పడ్డాయి. ‘గదర్’లోని సన్నీ లుక్‌ని తలపిస్తుందని బాలీవుడ్‌వారు అంటున్నారు. సంచలనాత్మక విజయం సాధించిన ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన అనిల్ శర్మ తాజా చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు. వాస్తవానికి అనిల్ కాంబినేషన్లో సన్నీ చేసిన నాలుగో చిత్రం ఇది. ఈ కాంబినేషన్లో వచ్చిన గదర్, హీరో: లవ్‌స్టోరీ ఆఫ్ ల సై్ప, అప్నే చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ కారణంగా ‘సింగ్ సాబ్ ది గ్రేట్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ 22న సింగ్ సాహెబ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బుల్లెట్ రాజా: సైఫ్ అలీఖాన్, సొనాక్షి సిన్హా జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘బుల్లెట్ రాజా’. తిగ్మాన్షు ధూలియా దర్శకత్వం వహించారు. వెస్ట్ బెంగాల్ బేస్డ్ మాఫియా నేపథ్యంలో సాగే చిత్రం ఇది. ఇందులో బుల్లెట్ రాజాగా సైఫ్ రఫ్ లుక్‌లో కనిపించబోతున్నారు. కాక్టైల్, గో గోవా గాన్... ఇలా ఇటీవల కాలంలో సైఫ్ నటించిన చిత్రాలు విజయాన్ని చవి చూశాయి. దాంతో ‘బుల్లెట్ రాజా’ కూడా సక్సెస్ ట్రాక్ మీదే వెళుతుందనే అంచనాలు ఉన్నాయి. 29న ఈ చిత్రం విడుదల కానుంది. మరి.. ఈ అరడజను చిత్రాల్లో అదరహో అనిపించే వసూళ్లని ఏ చిత్రం రాబడుతుందనేది వెయిట్ అండ్ సీ. - రాజాబాబు అనుముల -
‘సత్య’కు పూర్తి భిన్నమిది - వర్మ
అండర్ వరల్డ్ నేపథ్యంలో పలు చిత్రాలు రూపొందించిన రామ్‌గోపాల్‌వర్మ ఇకనుంచీ ఈ నేపథ్యంలో సినిమాలు తియ్యనంటున్నారు. సో.. అండర్ వరల్డ్ నేపథ్యంలో ఆయన చేసిన చివరి చిత్రం ‘సత్య 2’ అని ఫిక్స్ అవ్వొచ్చు. ఒకవేళ వర్మ మనసు మార్చుకుంటే.. ఈ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు రావచ్చేమో. ఆ విషయాలన్ని అలా ఉంచితే శర్వానంద్ హీరోగా రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో సుమంత్‌కుమార్ నిర్మించిన ‘సత్య 2’ రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో వర్మ మాట్లాడుతూ -‘‘ఇదో విభిన్న తరహా క్రైమ్ కథా చిత్రం. ‘సత్య’కీ ఈ సినిమాకీ చాలా వ్యత్యాసం ఉంటుంది. శర్వానంద్ చాలా బాగా యాక్ట్ చేశాడు’’ అని చెప్పారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ -‘‘జయాపజయాలతో సంబంధం లేకుండా వర్మ సినిమాలు చేస్తారు. ఆయన ఏం చేసినా సంచలనమే. ఈ చిత్రాన్ని ఏపీలో విడుదల చేసే అవకాశం మాకు దక్కడం ఆనందంగా ఉంది. శర్వానంద్ విభిన్న తరహా సినిమాలు చేస్తుంటాడు. మంచి కథ కుదిరితే తనతో ఓ సినిమా తీయాలనుకుంటున్నా’’ అన్నారు. ఒక గొప్ప సినిమా చేశానని గర్వంగా ఉందని శర్వానంద్ చెప్పారు. ‘దిల్’ రాజు డిస్ట్రిబ్యూషన్ ద్వారా సినిమాని విడుదల చేయడం ఆనందంగా ఉందని సుమంత్‌కుమార్ అన్నారు. -
సత్య 2 థీమ్ సాంగ్ విడుదల చేసిన రాంగోపాల్ వర్మ
సూపర్‌హిట్ హాలీవుడ్ సినిమా 'ద గాడ్‌ఫాదర్' థీమ్ సాంగ్ స్ఫూర్తితో తన రాబోయే చిత్రం 'సత్య2'కు రూపొందించిన పాటను దర్శకుడు రాంగోపాల్ వర్మ విడుదల చేశారు. యూట్యూబ్‌లో ఈ పాట వీడియోను రాంగోపాల్ వర్మ ఫిల్మ్ ఫ్యాక్టరీ పబ్లిష్ చేసింది. ''సర్కార్ షూటింగ్ మొదలుపెట్టినప్పటి నుంచి నేను ఒక మాట చెబుతూ వచ్చాను. ప్రపంచంలో ఉన్న చాలామంది దర్శకుల్లాగే నేను కూడా 'ద గాడ్ ఫాదర్' సినిమాతో స్ఫూర్తి పొందాను. నా సత్య2 సినిమా దానికి ఒక నివాళి. 'ద గాడ్ ఫాదర్' థీమ్ మ్యూజిక్ నాకు ఎప్పటికీ చాలా ఇష్టమైన పాట. దాన్ని మరో సందర్భంలో రీడిజైన్ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఇప్పుడు 'సత్య 2' ప్రమోషనల్ వీడియోలో వాడుతున్నాను'' అని రాంగోపాల్ వర్మ చెప్పారు. ఈ పాటను రాజా నల్లా ఎడిట్ చేయగా ఆదిత్య ప్రణవ్ దేవ్ సంగీతం అందించారు. సత్య2 ఆడియో ట్రాక్‌ను రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అందరికీ షేర్ చేశారు కూడా. 1998లో విడుదలైన సత్య సినిమా ముంబై మాఫియా ఆధారంగా తీసిన విషయం తెలిసిందే. The Godfather theme has been my faviourate music.The Godfather music video from Satya 2 at http://t.co/cpVAwnF8Wk — Ram Gopal Varma (@RGVzoomin) October 15, 2013