బాలీవుడ్ తెరపై భారీ హంగామా! | Six high budget movies to hit bollywood box office | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ తెరపై భారీ హంగామా!

Published Thu, Nov 7 2013 12:10 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

Six high budget movies to hit bollywood box office

దీపావళి పండగ ఇలా వచ్చి.. అలా వెళ్లిపోయింది. ఆ సెలబ్రేషన్ మూడ్‌లోంచి ఇప్పుడిప్పుడే బయటికొస్తున్న బాలీవుడ్ ప్రేక్షకులు, ఇప్పుడు సినిమాల పరంగా పండగ చేసుకోబోతున్నారు. ఎందుకంటే, బాలీవుడ్‌లో ఈ నెల మొత్తం పండగ వాతావరణమే. ఈ మధ్యకాలంలో కనీవినీ ఎరుగని రీతిలో ఆరు భారీ బడ్జెట్ చిత్రాలు ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుండటం విశేషం. అన్నీ అగ్ర తారల చిత్రాలే. ఆసక్తికరమైన కథాంశాలే. ప్రేక్షకుల చెంతకు ఇప్పటికే ‘క్రిష్ 3’ చేరి, భారీ వసూళ్లు రాబడుతోంది. మిగతా చిత్రాలు విడుదలకు ముస్తాబవుతున్నాయి. ఆ చిత్రాల విశేషాలు తెలుసుకుందాం.
 
సత్య-2: రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన ‘సత్య 2’ చిత్రం వాస్తవానికి అక్టోబర్ 25న విడుదల కావాల్సి ఉండగా, చిత్ర నిర్మాతల్లో ఒకరైన అరుణ్ శర్మతో వివాదం కారణంగా ఈ చిత్రాన్ని ఈ నెల 8కి వాయిదా వేశారు. మాములుగా వర్మ సినిమా అంటేనే అంచనాలు భారీ ఎత్తున ఉంటాయి. ఇక, చాక్లెట్ బోయ్‌లా ఉండే శర్వానంద్‌తో (హిందీలో పునీత్ సింగ్) ఈ చిత్రంలో మాస్ పాత్ర చేయించడం, అతని లుక్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉండటం ఈ చిత్రంపై అంచనాలు పెరగడానికి ఓ కారణంగా చెప్పుకోవచ్చు. అండర్ వరల్డ్ నేపథ్యంలో వర్మ తీసిన ‘సత్య’ ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఆ చిత్రానికి సీక్వెల్ కాకపోయినా కూడా, గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో వర్మ రూపొందించిన ఈ ‘సత్య 2’పై భారీ అంచనాలున్నాయి.
 
రామ్‌లీలా: చరిత్రాత్మక నేపథ్యంతో రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ‘రామ్‌లీలా’ చిత్రానికి షేక్‌స్పియర్ విరచిత ప్రేమకథ ‘రోమియో జూలియట్’ అధారం. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనె నాయకా నాయికలు. ప్రియాంక చోప్రా ఓ ఐటమ్ సాంగ్‌లో మెరిసింది. ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలకు క్రేజ్ లభించింది. అలాగే, ఈ చిత్రం ఫస్ట్ లుక్, పోస్టర్స్ అంచనాలు పెంచాయి. ఫొటోల్లో రణ్‌వీర్, దీపికాల రొమాంటిక్ దృశ్యాలు హాట్ టాపిక్ అయ్యాయి.రియల్ లైఫ్‌లో ప్రేమించుకుంటున్న ఈ ఇద్దరూ రీల్‌పై తమ కెమిస్ట్రీని అద్భుతంగా పండించారని ఈ ఫొటోలు చూసినవాళ్లు అంటున్నారు. ఇక, రొమాంటిక్ లవ్‌స్టోరీస్ తెరకెక్కించడంలో భన్సాలీ స్టయిలే వేరు. ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం కావడంవల్ల, దీపికా, రణ్‌వీర్‌ల జంట కారణంగా ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. 15న రామ్‌లీలాల ప్రేమకహానీ వెండితెరపై ఆవిష్కృతం కాబోతోంది.
 
గోరి తేరే ప్యార్ మే: పునీత్ మల్హోత్రా దర్శ కత్వంలో కరణ్ జోహార్ నిర్మించిన చిత్రం ‘గోరి తేరే ప్యార్ మే’. వాస్తవానికి 2011లో ఈ సినిమా ఎనౌన్స్‌మెంట్ జరిగింది. ముందుగా షాహిద్‌కపూర్, సోనమ్‌కపూర్‌లను హీరో హీరోయిన్లుగా ఎంపిక చేశారు. అయితే, ఈ చిత్రకథ పట్ల సంతృప్తి చెందక, ఈ ఇద్దరూ తప్పుకున్నారనే వార్త అప్పట్లో హల్‌చల్ చేసింది. ఆ తర్వాత సీన్‌లోకి ఇమ్రాన్ ఖాన్, కరీనా కపూర్ వచ్చారు. మరి... కథలో మార్పులు, చేర్పులు చేసిన తర్వాత ఈ ఇద్దరూ పచ్చజెండా ఊపారో లేక పునీత్ చెప్పిన కథ నచ్చే ఒప్పుకున్నారో అనే విషయం బయటికి రాలేదు. ఇది రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్. ఈ తరహా సినిమాలకు ట్రెండ్‌తో సంబంధం లేదు. కథ బాగుంటే చాలు.. వసూళ్ల వర్షం కురిపించేస్తాయ్. మరి.. ఈ ప్రేమకథ బాక్సాఫీస్ ఖజానాని నింపగలుగుతుందో లేదో? ఈ 22న తెలిసిపోతుంది.
 
రజ్జో: ఇటీవల బాలీవుడ్‌లో ఎక్కువగా వార్తల్లో నిలిచిన చిత్రాల్లో ‘రజ్జో’ ఒకటి. దానికి కారణం ఈ చిత్రం కథాంశం. రజ్జో అనే ముస్లిం యువతి, చందు అనే బ్రాహ్మణ యువకుడి మధ్య జరిగే ప్రేమాయణమే ఈ చిత్రం ప్రధాన ఇతివృత్తం. ఇలాంటి కథలు చాలానే వచ్చాయి కదా అనుకుంటున్నారా? ఈ కథలో ట్విస్ట్ ఏంటంటే.. కుర్రాడు టీనేజ్‌లో ఉంటాడు. ఆ యువతికి పాతికేళ్లు. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత విశ్వాస్ పాటిల్ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్, మ్యూజికల్ ఎంటర్‌టైనర్ ఇది. ఇందులో కంగనా రనౌత్, పరాస్ అరోరా హీరో, హీరోయిన్లు. కీలక పాత్రలను ప్రకాశ్‌రాజ్, మహేశ్ మంజ్రేకర్, జయప్రద లాంటి అగ్రతారలు పోషించారు. 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘రామ్‌లీలా’తో ఈ ‘రజ్జో’ పోటీ పడనుంది. నిందలు మిగులుతాయో, అభినందనలు దక్కుతాయో వేచి చూడాల్సిందే!
 
సింగ్ సాబ్ ది గ్రేట్: కొంత విరామం తర్వాత సన్నీ డియోల్ నటించిన చిత్రం ‘సింగ్ సాబ్ ది గ్రేట్’. టైటిల్‌ని బట్టి ఓ శక్తిమంతమైన సింగ్ సాబ్ చుట్టూ ఈ కథ తిరుగుతుందని ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. సింగ్‌గా సన్నీ లుక్‌కి ఇప్పటికే మంచి మార్కులు పడ్డాయి. ‘గదర్’లోని సన్నీ లుక్‌ని తలపిస్తుందని బాలీవుడ్‌వారు అంటున్నారు. సంచలనాత్మక విజయం సాధించిన ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన అనిల్ శర్మ తాజా చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు. వాస్తవానికి అనిల్ కాంబినేషన్లో సన్నీ చేసిన నాలుగో చిత్రం ఇది.  ఈ కాంబినేషన్‌లో వచ్చిన గదర్, హీరో: లవ్‌స్టోరీ ఆఫ్ ల సై్ప, అప్నే చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ కారణంగా ‘సింగ్ సాబ్ ది గ్రేట్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ 22న సింగ్ సాహెబ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
 
బుల్లెట్ రాజా: సైఫ్ అలీఖాన్, సొనాక్షి సిన్హా జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బుల్లెట్ రాజా’. తిగ్‌మాన్షు ధూలియా దర్శకత్వం వహించారు. వెస్ట్ బెంగాల్ బేస్డ్ మాఫియా నేపథ్యంలో సాగే చిత్రం ఇది. ఇందులో బుల్లెట్ రాజాగా సైఫ్ రఫ్ లుక్‌లో కనిపించబోతున్నారు. కాక్‌టైల్, గో గోవా గాన్... ఇలా ఇటీవల కాలంలో సైఫ్ నటించిన చిత్రాలు విజయాన్ని చవి చూశాయి. దాంతో ‘బుల్లెట్ రాజా’ కూడా సక్సెస్ ట్రాక్ మీదే వెళుతుందనే అంచనాలు ఉన్నాయి. 29న ఈ చిత్రం విడుదల కానుంది. 
మరి.. ఈ అరడజను చిత్రాల్లో అదరహో అనిపించే వసూళ్లని ఏ చిత్రం రాబడుతుందనేది వెయిట్ అండ్ సీ.
 - రాజాబాబు అనుముల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement