Gori Tere Pyaar Mein
-
సినిమా రివ్యూ: 'గోరి తేరే ప్యార్ మే'
ధర్మ ప్రోడక్షన్ బ్యానర్ పై ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్ జోహర్, 'ఐ హేట్ లవ్ స్టోరీస్' చిత్రంతో దర్శకుడిగా మారిన పునీత్ మల్హోత్రా కాంబినేషన్ లో ఇమ్రాన్ ఖాన్, కరీనా కపూర్ లు జంటగా నటించిన రొమాంటిక్, కామెడీ చిత్రం 'గోరి తేరి ప్యార్ మే' ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 22 తేదిన విడుదలైంది. కరీనా కపూర్, ఇమ్రాన్ ఖాన్ క్రేజి కాంబినేషన్ ప్రేక్షకుల్ని ఆకర్సించేలా చేసింది. కరీనాతో గోరి తేరే ప్యార్ మే అంటూ ఇమ్రాన్ ఖాన్ చేసిన సందడి ప్రేక్షకులను మెప్పించిందా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే 'గోరి తేరే ప్యార్ మే' గురించి చూడాల్సిందే. ఫ్రెండ్స్, పార్టీలు, డేటింగ్ విషయాలే తప్ప బాధ్యతలు తెలియని కుర్రాడు శ్రీరామ్ వెంకట్ (ఇమ్రాన్ ఖాన్) ఉరఫ్ శ్రీదేవి. పెళ్లి చేస్తే తప్ప బాధ్యతలు తెలిసి రావని శ్రీరామ్ తల్లి తండ్రులు భావించి..పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. పెళ్లి చూపుల్లో వసుధ (శ్రద్ధ కపూర్) అనే అమ్మాయిని చూసి ఇష్టపడుతాడు శ్రీరామ్. అయితే వసుధకు అప్పటికే మరో అబ్బాయితో అఫైర్ ఉంటుంది. దాంతో పెళ్లి సంబంధాన్ని ఒప్పుకోవద్దని శ్రీరామ్ ని వసుధ వేడుకుంటుంది. అయితే తాను పెళ్లి సంబంధాన్ని నిరాకరిస్తే.. తన తల్లితండ్రులు బాధపడుతారని వసుధ ప్రపోజల్ ను శ్రీరామ్ వ్యతిరేకిస్తాడు. దాంతో తప్పని పరిస్థితుల్లో ఇష్టం లేకున్నా శ్రీరామ్ తో వసుధ పెళ్లికి అంగీకరించాల్సి వస్తుంది. అయితే అదే సమయంలో తనకు దియా శర్మ (కరీనా కపూర్) తో ప్రేమ వ్యవహారం ఉందని వసుధకు తెలియ చేస్తాడు శ్రీరామ్. వ్యక్తిగత అభిప్రాయ విభేదాల కారణంగా తాము విడిపోయామని వసుధకు శ్రీరామ్ చెబుతాడు. ఇద్దరి ప్రేమ కథను విన్న వసుధ.. అప్పటి వరకు దియాపై ఉన్న అభిప్రాయాన్ని శ్రీరామ్ మార్చుకునేలా చేస్తుంది. దాంతో దియాపై ఉన్న ప్రేమను శ్రీరామ్ మరోసారి ఫీల్ అయ్యేలా చేయడంలో వసుధ సఫలమవుతుంది. ఇందంతా సినిమా తొలి భాగం స్టోరి. ఇక తన లవర్ దియాను కలిసేందుకు పెళ్లి పీటల మీద నుంచి శ్రీరామ్ పరారవుతాడు. పెళ్లి పీటల మీద నుంచి పారిపోయిన శ్రీరామ్ దియాను కలిశాడా? దియా, శ్రీరామ్ ల మధ్య విభేదాలు ఎందుకు ఏర్పడ్డాయి? ఎలా తొలిగిపోయాయి? దియాను ఎలా కన్విన్స్ చేశాడు అనే ప్రశ్నలకు తెర రూపమే 'గోరి తేరే ప్యార్ మే' చిత్రం. 'గోరి తేరి ప్యార్ మే' చిత్రంలో కరీనా కపూర్ కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్ర ఇమ్రాన్ దక్కించుకున్నాడు. నటనకు పూర్తి స్థాయిలో ప్రాధాన్యత ఉన్న శ్రీరామ్ పాత్రలో ఇమ్రాన్ నటించడానికి అవకాశం చిక్కింది. చాలా సన్నివేశాల్లో అమీర్ ఖాన్ ను అనుకరించినట్టు అనిపిస్తుంది. లవర్ బాయ్ గా, తమిళ కుటుంబ నేపథ్యం ఉన్న యువకుడిగా ఇమ్రాన్ వివిధ రకాల ఎమోషన్స్ పలికించాడు. అయితే శ్రీరామ్ పాత్రతో ఇమ్రాన్ ప్రేక్షకులపై ప్రభావం చూపకపోయాడు. దియా పాత్రలో కరీనా కపూర్ పర్యావరణ, సామాజిక కార్యకర్త గా కనిపించింది. కరీనా మరింత గ్లామరస్ తో ఆకట్టుకుంది. సామాజిక అంశాలపై పోరాటం చేసే యువతిగా కొంత వరకు ఓకే అనిపించినా.. ఆ పాత్ర ఆర్టిఫియల్ గానే ఉంది. ఇటీవల వచ్చిన 'సత్యగ్రహ' చిత్రంలో కరీనా పోషించిన పాత్రకు చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. క్రేజి కాంబినేషన్ గా ముద్ర పడిన ఇమ్రాన్ ఖాన్, కరీనాల కెమిస్ట్రీ అంతగా ఆకట్టుకునేలా లేకపోవడం, పెద్ద హీరోలతో జత కట్టిన కరీనా తో ఇమ్రాన్ కాంబినేషన్ ఎట్రాక్టివ్ లేకపోయింది. వసుధ పాత్రలో అతిధిగా కనిపించిన శ్రద్దా కపూర్ గత చిత్రాల కంటే మెరుగ్గా కనిపించింది. ఇమ్రాన్ తో ఉన్నసన్నివేశాల్లో పూర్తి మెచ్యురిటీని ప్రదర్శించింది. చాలా రోజుల తర్వాత అనుపమ్ ఖేర్ విలన్ పాత్రలో కనిపించాడు. అనుపమ్ ఖేర్ కు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే. అయితే తన పాత్ర పరిధి మేరకు పర్వాలేదనిపించారు. ఇమ్రాన్ తండ్రిగా నిజల్ గల్ రవి తన మార్క్ తో ఆకట్టుకున్నాడు. దర్శకుడిగా పునీత్ మల్హోత్రా చిత్ర తొలి భాగాన్ని చక్కగా నడిపించాడు. ఒక ద్వితీయార్ధంలో లవ్ ట్రాక్ పక్కన పెట్టి.. సామాజిక అంశాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం చిత్రం సిరియస్ గా సాగుతుంది. దాంతో వినోదాన్ని ఆశించే ప్రేక్షకుడికి కొంత అసంతృప్తి మిగిలింది. క్లైమాక్స్ ను రొటీన్ గా, పక్కా సినిమాటిక్ గా ముగించడంలో పునీత్ తనదైన ముద్రను వేసుకోలేకపోయాడు. చిత్ర తొలి భాగంలో ఇమ్రాన్ రొమాన్స్, కామెడిలను కలిపి నడిపించినా.. రెండవ భాగంలో తడబాటుకు గురయ్యాడు. విశాల్ శేఖర్ సంగీతం, గుర్తుంచుకునే విధంగా పాటలు లేకపోవడంతో ఆర్డినరీగానే అనిపించింది. మహేశ్ లిమే ఫోటోగ్రఫి, కరణ్ జోహార్ నిర్మాణ విలువలు బాగున్నాయి. 'గోరి తేరి ప్యార్ మే' చిత్రాన్ని ఓవరాల్ గా చూస్తే.. ఓకే అనే విధంగా అనిపిస్తుందే తప్ప.. సూపర్ అనే టాక్ ప్రేక్షకుడి నుంచి ఆశించడం కష్టమే. నవంబర్ లో భారీ చిత్రాల మధ్య విడుదలైన ఈ చిత్రం పోటిని ఎలా తట్టుకుంటుందో వేచి చూడాల్సిందే. -
కళాకారులను గౌరవించే తీరు ఇదేనా!
సినీ తారలపై కొండంత అభిమానాన్ని చూపించే ప్రేక్షకులే... ఒక్కోసారి అదే తారలతో చాలా ఇబ్బందిగా కూడా ప్రవర్తిస్తుంటారు. ఇది కొత్త విషయమేం కాదు. పాత కాలంలో భానుమతి లాంటి గొప్ప నటికే అభిమానుల నుంచి ఇబ్బందులు తప్పలేదు. ఈ తరంలో ఐశ్వర్యారాయ్, జ్యోతికలాంటి స్టార్లు కూడా ఫ్యాన్స్ నుంచి ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేశారు. ఇప్పుడు రీసెంట్గా కరీనాకపూర్ వంతు వచ్చింది. తన తాజా చిత్రం ‘గోరీ తేరే ప్యార్ మే’ ప్రమోషన్ నిమిత్తం ఆ చిత్ర కథానాయకుడు ఇమ్రాన్‌ఖాన్‌తో కలిసి జైపూర్‌లోని ఓ కాలేజ్‌కి వెళ్లారట కరీనా. అక్కడ స్టూడెంట్స్‌తో కలిసి ఆడిపాడి హడావిడి కూడా చేశారట. ఉన్నట్టుండి ఏమైందో ఏమో... అక్కడి స్టూడెంట్లు అత్యుత్సాహంతో రెచ్చిపోవడం మొదలుపెట్టారు. కేరింతలతో, ఈలలతో గోల గోల చేస్తూ... కరీనాను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడ్డం మొదలుపెట్టారు. దాంతో ఖంగు తినడం కరీనా వంతైంది. పోలీసులు, కరీనా బాడీగార్డులు, చివరకు బౌన్సర్లు కూడా చేతులెత్తేయడంతో కరీనాకు అక్కడ్నుంచీ పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకానొక దశలో కట్టలు తెగిన ఆవేశంతో విద్యార్థులపై చిందులు తొక్కేశారు కరీనా. ఈ క్రమంలో ఆమె కన్నీటి పర్యంతం అయ్యారని సమాచారం. ‘‘నేను సినిమా హీరోయిన్ని మాత్రమే కాదు. ఓ స్త్రీని. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని ప్రవర్తిస్తే మంచిది. కళాకారులను గౌరవించే తీరు ఇదేనా. మీ గురువులు, తల్లిదండ్రులు మీకు నేర్పింది ఇదేనా’’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారట. అభిమానం హద్దుమీరితే ఇలాగే ఉంటుంది మరి. -
బాలీవుడ్ తెరపై భారీ హంగామా!
దీపావళి పండగ ఇలా వచ్చి.. అలా వెళ్లిపోయింది. ఆ సెలబ్రేషన్ మూడ్‌లోంచి ఇప్పుడిప్పుడే బయటికొస్తున్న బాలీవుడ్ ప్రేక్షకులు, ఇప్పుడు సినిమాల పరంగా పండగ చేసుకోబోతున్నారు. ఎందుకంటే, బాలీవుడ్లో ఈ నెల మొత్తం పండగ వాతావరణమే. ఈ మధ్యకాలంలో కనీవినీ ఎరుగని రీతిలో ఆరు భారీ బడ్జెట్ చిత్రాలు ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుండటం విశేషం. అన్నీ అగ్ర తారల చిత్రాలే. ఆసక్తికరమైన కథాంశాలే. ప్రేక్షకుల చెంతకు ఇప్పటికే ‘క్రిష్ 3’ చేరి, భారీ వసూళ్లు రాబడుతోంది. మిగతా చిత్రాలు విడుదలకు ముస్తాబవుతున్నాయి. ఆ చిత్రాల విశేషాలు తెలుసుకుందాం. సత్య-2: రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన ‘సత్య 2’ చిత్రం వాస్తవానికి అక్టోబర్ 25న విడుదల కావాల్సి ఉండగా, చిత్ర నిర్మాతల్లో ఒకరైన అరుణ్ శర్మతో వివాదం కారణంగా ఈ చిత్రాన్ని ఈ నెల 8కి వాయిదా వేశారు. మాములుగా వర్మ సినిమా అంటేనే అంచనాలు భారీ ఎత్తున ఉంటాయి. ఇక, చాక్లెట్ బోయ్‌లా ఉండే శర్వానంద్‌తో (హిందీలో పునీత్ సింగ్) ఈ చిత్రంలో మాస్ పాత్ర చేయించడం, అతని లుక్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉండటం ఈ చిత్రంపై అంచనాలు పెరగడానికి ఓ కారణంగా చెప్పుకోవచ్చు. అండర్ వరల్డ్ నేపథ్యంలో వర్మ తీసిన ‘సత్య’ ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఆ చిత్రానికి సీక్వెల్ కాకపోయినా కూడా, గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో వర్మ రూపొందించిన ఈ ‘సత్య 2’పై భారీ అంచనాలున్నాయి. రామ్‌లీలా: చరిత్రాత్మక నేపథ్యంతో రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ‘రామ్‌లీలా’ చిత్రానికి షేక్స్పియర్ విరచిత ప్రేమకథ ‘రోమియో జూలియట్’ అధారం. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనె నాయకా నాయికలు. ప్రియాంక చోప్రా ఓ ఐటమ్ సాంగ్‌లో మెరిసింది. ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలకు క్రేజ్ లభించింది. అలాగే, ఈ చిత్రం ఫస్ట్ లుక్, పోస్టర్స్ అంచనాలు పెంచాయి. ఫొటోల్లో రణ్వీర్, దీపికాల రొమాంటిక్ దృశ్యాలు హాట్ టాపిక్ అయ్యాయి.రియల్ లైఫ్‌లో ప్రేమించుకుంటున్న ఈ ఇద్దరూ రీల్‌పై తమ కెమిస్ట్రీని అద్భుతంగా పండించారని ఈ ఫొటోలు చూసినవాళ్లు అంటున్నారు. ఇక, రొమాంటిక్ లవ్‌స్టోరీస్ తెరకెక్కించడంలో భన్సాలీ స్టయిలే వేరు. ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం కావడంవల్ల, దీపికా, రణ్‌వీర్‌ల జంట కారణంగా ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. 15న రామ్లీలాల ప్రేమకహానీ వెండితెరపై ఆవిష్కృతం కాబోతోంది. గోరి తేరే ప్యార్ మే: పునీత్ మల్హోత్రా దర్శ కత్వంలో కరణ్ జోహార్ నిర్మించిన చిత్రం ‘గోరి తేరే ప్యార్ మే’. వాస్తవానికి 2011లో ఈ సినిమా ఎనౌన్స్మెంట్ జరిగింది. ముందుగా షాహిద్‌కపూర్, సోనమ్కపూర్లను హీరో హీరోయిన్లుగా ఎంపిక చేశారు. అయితే, ఈ చిత్రకథ పట్ల సంతృప్తి చెందక, ఈ ఇద్దరూ తప్పుకున్నారనే వార్త అప్పట్లో హల్చల్ చేసింది. ఆ తర్వాత సీన్లోకి ఇమ్రాన్ ఖాన్, కరీనా కపూర్ వచ్చారు. మరి... కథలో మార్పులు, చేర్పులు చేసిన తర్వాత ఈ ఇద్దరూ పచ్చజెండా ఊపారో లేక పునీత్ చెప్పిన కథ నచ్చే ఒప్పుకున్నారో అనే విషయం బయటికి రాలేదు. ఇది రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. ఈ తరహా సినిమాలకు ట్రెండ్‌తో సంబంధం లేదు. కథ బాగుంటే చాలు.. వసూళ్ల వర్షం కురిపించేస్తాయ్. మరి.. ఈ ప్రేమకథ బాక్సాఫీస్ ఖజానాని నింపగలుగుతుందో లేదో? ఈ 22న తెలిసిపోతుంది. రజ్జో: ఇటీవల బాలీవుడ్లో ఎక్కువగా వార్తల్లో నిలిచిన చిత్రాల్లో ‘రజ్జో’ ఒకటి. దానికి కారణం ఈ చిత్రం కథాంశం. రజ్జో అనే ముస్లిం యువతి, చందు అనే బ్రాహ్మణ యువకుడి మధ్య జరిగే ప్రేమాయణమే ఈ చిత్రం ప్రధాన ఇతివృత్తం. ఇలాంటి కథలు చాలానే వచ్చాయి కదా అనుకుంటున్నారా? ఈ కథలో ట్విస్ట్ ఏంటంటే.. కుర్రాడు టీనేజ్‌లో ఉంటాడు. ఆ యువతికి పాతికేళ్లు. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత విశ్వాస్ పాటిల్ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్, మ్యూజికల్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో కంగనా రనౌత్, పరాస్ అరోరా హీరో, హీరోయిన్లు. కీలక పాత్రలను ప్రకాశ్‌రాజ్, మహేశ్ మంజ్రేకర్, జయప్రద లాంటి అగ్రతారలు పోషించారు. 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘రామ్‌లీలా’తో ఈ ‘రజ్జో’ పోటీ పడనుంది. నిందలు మిగులుతాయో, అభినందనలు దక్కుతాయో వేచి చూడాల్సిందే! సింగ్ సాబ్ ది గ్రేట్: కొంత విరామం తర్వాత సన్నీ డియోల్ నటించిన చిత్రం ‘సింగ్ సాబ్ ది గ్రేట్’. టైటిల్‌ని బట్టి ఓ శక్తిమంతమైన సింగ్ సాబ్ చుట్టూ ఈ కథ తిరుగుతుందని ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. సింగ్‌గా సన్నీ లుక్‌కి ఇప్పటికే మంచి మార్కులు పడ్డాయి. ‘గదర్’లోని సన్నీ లుక్‌ని తలపిస్తుందని బాలీవుడ్‌వారు అంటున్నారు. సంచలనాత్మక విజయం సాధించిన ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన అనిల్ శర్మ తాజా చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు. వాస్తవానికి అనిల్ కాంబినేషన్లో సన్నీ చేసిన నాలుగో చిత్రం ఇది. ఈ కాంబినేషన్లో వచ్చిన గదర్, హీరో: లవ్‌స్టోరీ ఆఫ్ ల సై్ప, అప్నే చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ కారణంగా ‘సింగ్ సాబ్ ది గ్రేట్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ 22న సింగ్ సాహెబ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బుల్లెట్ రాజా: సైఫ్ అలీఖాన్, సొనాక్షి సిన్హా జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘బుల్లెట్ రాజా’. తిగ్మాన్షు ధూలియా దర్శకత్వం వహించారు. వెస్ట్ బెంగాల్ బేస్డ్ మాఫియా నేపథ్యంలో సాగే చిత్రం ఇది. ఇందులో బుల్లెట్ రాజాగా సైఫ్ రఫ్ లుక్‌లో కనిపించబోతున్నారు. కాక్టైల్, గో గోవా గాన్... ఇలా ఇటీవల కాలంలో సైఫ్ నటించిన చిత్రాలు విజయాన్ని చవి చూశాయి. దాంతో ‘బుల్లెట్ రాజా’ కూడా సక్సెస్ ట్రాక్ మీదే వెళుతుందనే అంచనాలు ఉన్నాయి. 29న ఈ చిత్రం విడుదల కానుంది. మరి.. ఈ అరడజను చిత్రాల్లో అదరహో అనిపించే వసూళ్లని ఏ చిత్రం రాబడుతుందనేది వెయిట్ అండ్ సీ. - రాజాబాబు అనుముల -
పునీత్ మల్హోత్రా ప్రేమకథతో.. 'గోరీ తేరే ప్యార్ మే'?
ఇమ్రాన్ ఖాన్, కరీనా కపూర్ జంటగా నటిస్తున్న గోరీ తేరే ప్యార్ మే సినిమా నవంబర్ 22న విడుదల కానుంది. అయితే.. ఇందులో అసలు విశేషం ఏమిటంటే, ఇది దర్శకుడు పునీత్ మల్హోత్రా సొంత ప్రేమకథ ఆధారంగా తీస్తున్నదట!! ఈ విషయాన్ని నిర్మాత కరణ్ జోహార్ స్వయంగా వెల్లడించాడు!! -
'కరీనా కపూర్, ఇమ్రాన్ ఖాన్ లు పెళ్లి చేసుకోవాలి'
బాలీవుడ్ తారలు కరీనా కపూర్, ఇమ్రాన్ ఖాన్ లు పెళ్లి చేసుకుంటే బాగుంటుందని దర్శకుడు కరణ్ జోహార్ చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యల అందర్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే కరీనా, ఇమ్రాన్ లిద్దరూ వివాహితులు కావడమే. సైఫ్ ఆలీ ఖాన్ ను కరీనా కపూర్ పెళ్లాడగా, ఇమ్రాన్ తన ప్రేయసి అవంతికను వివాహం చేసుకున్నారు. కరీనా, ఇమ్రాన్ లు జంటగా 'గోరి తేరి ప్యార్ మే' అనే చిత్రంలో జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో కరీనా, ఇమ్రాన్ ల జంట గురించి మాట్లాడుతూ.. 'తెరపై ఇద్దరూ అద్బుతంగా ఉన్నారు. మీరిందరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ఏ ఒక్కరు ఎందుకు అడుగరూ. నేను మాత్రం కరీనా, ఇమ్రాన్ లిద్దరూ పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాను' అని కరణ్ జోహార్ వ్యాఖ్యలు చేశారు. ఇక్కడే సాధ్యం కావోచ్చు. మనం ఏమి చెప్పలేం. ఏదైనా సాధ్యమే అని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఇమ్రాన్ తో కరీనా కలిసి నటించడం ఇది రెండవ చిత్రం. ఏక్ మై ఔర్ ఏక్ తూ అనే చిత్రం తర్వాత గోరి తెరే ప్యార్ మే చిత్రంలో కలిసి నటించారు.