సినిమా రివ్యూ: 'గోరి తేరే ప్యార్ మే'
సినిమా రివ్యూ: 'గోరి తేరే ప్యార్ మే'
Published Sat, Nov 23 2013 12:14 AM | Last Updated on Sat, Sep 2 2017 12:52 AM
ధర్మ ప్రోడక్షన్ బ్యానర్ పై ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్ జోహర్, 'ఐ హేట్ లవ్ స్టోరీస్' చిత్రంతో దర్శకుడిగా మారిన పునీత్ మల్హోత్రా కాంబినేషన్ లో ఇమ్రాన్ ఖాన్, కరీనా కపూర్ లు జంటగా నటించిన రొమాంటిక్, కామెడీ చిత్రం 'గోరి తేరి ప్యార్ మే' ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 22 తేదిన విడుదలైంది. కరీనా కపూర్, ఇమ్రాన్ ఖాన్ క్రేజి కాంబినేషన్ ప్రేక్షకుల్ని ఆకర్సించేలా చేసింది. కరీనాతో గోరి తేరే ప్యార్ మే అంటూ ఇమ్రాన్ ఖాన్ చేసిన సందడి ప్రేక్షకులను మెప్పించిందా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే 'గోరి తేరే ప్యార్ మే' గురించి చూడాల్సిందే.
ఫ్రెండ్స్, పార్టీలు, డేటింగ్ విషయాలే తప్ప బాధ్యతలు తెలియని కుర్రాడు శ్రీరామ్ వెంకట్ (ఇమ్రాన్ ఖాన్) ఉరఫ్ శ్రీదేవి. పెళ్లి చేస్తే తప్ప బాధ్యతలు తెలిసి రావని శ్రీరామ్ తల్లి తండ్రులు భావించి..పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. పెళ్లి చూపుల్లో వసుధ (శ్రద్ధ కపూర్) అనే అమ్మాయిని చూసి ఇష్టపడుతాడు శ్రీరామ్. అయితే వసుధకు అప్పటికే మరో అబ్బాయితో అఫైర్ ఉంటుంది. దాంతో పెళ్లి సంబంధాన్ని ఒప్పుకోవద్దని శ్రీరామ్ ని వసుధ వేడుకుంటుంది. అయితే తాను పెళ్లి సంబంధాన్ని నిరాకరిస్తే.. తన తల్లితండ్రులు బాధపడుతారని వసుధ ప్రపోజల్ ను శ్రీరామ్ వ్యతిరేకిస్తాడు.
దాంతో తప్పని పరిస్థితుల్లో ఇష్టం లేకున్నా శ్రీరామ్ తో వసుధ పెళ్లికి అంగీకరించాల్సి వస్తుంది. అయితే అదే సమయంలో తనకు దియా శర్మ (కరీనా కపూర్) తో ప్రేమ వ్యవహారం ఉందని వసుధకు తెలియ చేస్తాడు శ్రీరామ్. వ్యక్తిగత అభిప్రాయ విభేదాల కారణంగా తాము విడిపోయామని వసుధకు శ్రీరామ్ చెబుతాడు. ఇద్దరి ప్రేమ కథను విన్న వసుధ.. అప్పటి వరకు దియాపై ఉన్న అభిప్రాయాన్ని శ్రీరామ్ మార్చుకునేలా చేస్తుంది. దాంతో దియాపై ఉన్న ప్రేమను శ్రీరామ్ మరోసారి ఫీల్ అయ్యేలా చేయడంలో వసుధ సఫలమవుతుంది. ఇందంతా సినిమా తొలి భాగం స్టోరి.
ఇక తన లవర్ దియాను కలిసేందుకు పెళ్లి పీటల మీద నుంచి శ్రీరామ్ పరారవుతాడు. పెళ్లి పీటల మీద నుంచి పారిపోయిన శ్రీరామ్ దియాను కలిశాడా? దియా, శ్రీరామ్ ల మధ్య విభేదాలు ఎందుకు ఏర్పడ్డాయి? ఎలా తొలిగిపోయాయి? దియాను ఎలా కన్విన్స్ చేశాడు అనే ప్రశ్నలకు తెర రూపమే 'గోరి తేరే ప్యార్ మే' చిత్రం.
'గోరి తేరి ప్యార్ మే' చిత్రంలో కరీనా కపూర్ కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్ర ఇమ్రాన్ దక్కించుకున్నాడు. నటనకు పూర్తి స్థాయిలో ప్రాధాన్యత ఉన్న శ్రీరామ్ పాత్రలో ఇమ్రాన్ నటించడానికి అవకాశం చిక్కింది. చాలా సన్నివేశాల్లో అమీర్ ఖాన్ ను అనుకరించినట్టు అనిపిస్తుంది. లవర్ బాయ్ గా, తమిళ కుటుంబ నేపథ్యం ఉన్న యువకుడిగా ఇమ్రాన్ వివిధ రకాల ఎమోషన్స్ పలికించాడు. అయితే శ్రీరామ్ పాత్రతో ఇమ్రాన్ ప్రేక్షకులపై ప్రభావం చూపకపోయాడు.
దియా పాత్రలో కరీనా కపూర్ పర్యావరణ, సామాజిక కార్యకర్త గా కనిపించింది. కరీనా మరింత గ్లామరస్ తో ఆకట్టుకుంది. సామాజిక అంశాలపై పోరాటం చేసే యువతిగా కొంత వరకు ఓకే అనిపించినా.. ఆ పాత్ర ఆర్టిఫియల్ గానే ఉంది. ఇటీవల వచ్చిన 'సత్యగ్రహ' చిత్రంలో కరీనా పోషించిన పాత్రకు చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది.
క్రేజి కాంబినేషన్ గా ముద్ర పడిన ఇమ్రాన్ ఖాన్, కరీనాల కెమిస్ట్రీ అంతగా ఆకట్టుకునేలా లేకపోవడం, పెద్ద హీరోలతో జత కట్టిన కరీనా తో ఇమ్రాన్ కాంబినేషన్ ఎట్రాక్టివ్ లేకపోయింది.
వసుధ పాత్రలో అతిధిగా కనిపించిన శ్రద్దా కపూర్ గత చిత్రాల కంటే మెరుగ్గా కనిపించింది. ఇమ్రాన్ తో ఉన్నసన్నివేశాల్లో పూర్తి మెచ్యురిటీని ప్రదర్శించింది.
చాలా రోజుల తర్వాత అనుపమ్ ఖేర్ విలన్ పాత్రలో కనిపించాడు. అనుపమ్ ఖేర్ కు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే. అయితే తన పాత్ర పరిధి మేరకు పర్వాలేదనిపించారు. ఇమ్రాన్ తండ్రిగా నిజల్ గల్ రవి తన మార్క్ తో ఆకట్టుకున్నాడు.
దర్శకుడిగా పునీత్ మల్హోత్రా చిత్ర తొలి భాగాన్ని చక్కగా నడిపించాడు. ఒక ద్వితీయార్ధంలో లవ్ ట్రాక్ పక్కన పెట్టి.. సామాజిక అంశాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం చిత్రం సిరియస్ గా సాగుతుంది. దాంతో వినోదాన్ని ఆశించే ప్రేక్షకుడికి కొంత అసంతృప్తి మిగిలింది. క్లైమాక్స్ ను రొటీన్ గా, పక్కా సినిమాటిక్ గా ముగించడంలో పునీత్ తనదైన ముద్రను వేసుకోలేకపోయాడు. చిత్ర తొలి భాగంలో ఇమ్రాన్ రొమాన్స్, కామెడిలను కలిపి నడిపించినా.. రెండవ భాగంలో తడబాటుకు గురయ్యాడు. విశాల్ శేఖర్ సంగీతం, గుర్తుంచుకునే విధంగా పాటలు లేకపోవడంతో ఆర్డినరీగానే అనిపించింది. మహేశ్ లిమే ఫోటోగ్రఫి, కరణ్ జోహార్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
'గోరి తేరి ప్యార్ మే' చిత్రాన్ని ఓవరాల్ గా చూస్తే.. ఓకే అనే విధంగా అనిపిస్తుందే తప్ప.. సూపర్ అనే టాక్ ప్రేక్షకుడి నుంచి ఆశించడం కష్టమే. నవంబర్ లో భారీ చిత్రాల మధ్య విడుదలైన ఈ చిత్రం పోటిని ఎలా తట్టుకుంటుందో వేచి చూడాల్సిందే.
Advertisement