‘సత్య’కు పూర్తి భిన్నమిది - వర్మ
‘సత్య’కు పూర్తి భిన్నమిది - వర్మ
Published Thu, Nov 7 2013 12:06 AM | Last Updated on Sat, Sep 2 2017 12:20 AM
అండర్ వరల్డ్ నేపథ్యంలో పలు చిత్రాలు రూపొందించిన రామ్‌గోపాల్‌వర్మ ఇకనుంచీ ఈ నేపథ్యంలో సినిమాలు తియ్యనంటున్నారు. సో.. అండర్ వరల్డ్ నేపథ్యంలో ఆయన చేసిన చివరి చిత్రం ‘సత్య 2’ అని ఫిక్స్ అవ్వొచ్చు. ఒకవేళ వర్మ మనసు మార్చుకుంటే.. ఈ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు రావచ్చేమో. ఆ విషయాలన్ని అలా ఉంచితే శర్వానంద్ హీరోగా రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో సుమంత్‌కుమార్ నిర్మించిన ‘సత్య 2’ రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో వర్మ మాట్లాడుతూ -‘‘ఇదో విభిన్న తరహా క్రైమ్ కథా చిత్రం.
‘సత్య’కీ ఈ సినిమాకీ చాలా వ్యత్యాసం ఉంటుంది. శర్వానంద్ చాలా బాగా యాక్ట్ చేశాడు’’ అని చెప్పారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ -‘‘జయాపజయాలతో సంబంధం లేకుండా వర్మ సినిమాలు చేస్తారు. ఆయన ఏం చేసినా సంచలనమే. ఈ చిత్రాన్ని ఏపీలో విడుదల చేసే అవకాశం మాకు దక్కడం ఆనందంగా ఉంది. శర్వానంద్ విభిన్న తరహా సినిమాలు చేస్తుంటాడు. మంచి కథ కుదిరితే తనతో ఓ సినిమా తీయాలనుకుంటున్నా’’ అన్నారు. ఒక గొప్ప సినిమా చేశానని గర్వంగా ఉందని శర్వానంద్ చెప్పారు. ‘దిల్’ రాజు డిస్ట్రిబ్యూషన్ ద్వారా సినిమాని విడుదల చేయడం ఆనందంగా ఉందని సుమంత్‌కుమార్ అన్నారు.
Advertisement
Advertisement