సినీ నిర్మాతలకు దడలక్ష్మి!
సినీ నిర్మాతలకు దడలక్ష్మి!
Published Tue, Nov 12 2013 4:57 PM | Last Updated on Sat, Sep 2 2017 12:33 AM
సినీ నిర్మాతలకు, సెన్సార్ బోర్డు సభ్యులకు విబేధాల నెలకొన్నాయనే వార్తలు వినిపించడం సహజమే. తమ సృజనాత్మకతపై సెన్సార్ బోర్డు అధికారులు కత్తెర వేస్తున్నారనే ఆరోపించడం మనం గమనిస్తూ ఉంటాం. ఇటీవల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమ నిర్మాతలకు, సెన్సార్ కు మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా సెన్సార్ బోర్డు ప్రాంతీయ అధికారి ధనలక్ష్మిపై టాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు వివాదస్పద ఆరోపణలు చేయడం మీడియాలో సంచలనంగా మారాయి. సినిమాలను నిర్మించడం ఒక ఎత్తు అయితే.. ధనలక్ష్మిని ఎదుర్కోవడం మరో ఎత్తు అనే భావనలో ఉన్నారు. ఇన్నాళ్లు తమ గోడును ఎవరికి చెప్పుకోలేక...ధనలక్ష్మిని ఎదురించలేక ఊరుకున్నారు.
ప్రాంతీయ సెన్సార్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ధనలక్ష్మికి, పలువురు సినీ నిర్మాతలకు మధ్య గొడవలు మీడియాకే పరిమితంగా కాగా.. తాజాగా కోర్టు మెట్లెక్కాయి. గతంలో ధనలక్ష్మి నియామకంపై కోర్టులో డీవీ శైలేంద్ర కుమారి పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగంలోని 29(1) ఆర్టికల్ నిబంధనను ఉల్లంఘించి నియామకం చేపట్టారని పిటిషన్ దాఖలైంది. ధనలక్ష్మిపై చాలా మంది నిర్మాతలు ఆరోపణలు చేసినా.. వ్యవహారాన్ని కోర్టు వరకు తీసుకువెళ్లలేదు. అయితే ప్రస్తుతం ధనలక్ష్మికి ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మధ్య సత్య2 చిత్ర విషయంలో వివాదం నెలకొంది. సత్య2 చిత్ర విడుదల సమయంలో ధనలక్ష్మి తనను వేధించిందని వర్మ సోషల్ మీడియా వెబ్ సైట్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడమే కాకుండా.. పలు మీడియా చానెల్లలో వెల్లడించారు. 'సత్య2' చిత్ర విషయంలో తొలగించిన సన్నివేశాలపై ధనలక్ష్మి వివరణ ఇచ్చారు. ఓ టెలివిజన్ సమర్పించిన వినతిపత్రం ఆధారంగానే స్పందించి కొన్ని సన్నివేశాలను తొలగించాం అని ధనలక్ష్మి తెలిపారు.
తనను వేధించిన ధనలక్ష్మిపై నాంపల్లి క్రిమినల్ కోర్టులో కేసు నమోదు చేస్తాను అని అన్నారు. తన పట్ల ప్రవర్తించిన తీరుతో మానసికంగా బాధను అనుభవించానని.. అంతేకాకుండా ఆర్ధికంగా కూడా నష్టపోయానని వర్మ తెలిపారు. బాలీవుడ్ చిత్రాలను నిర్మించిన వర్మకు ముంబైలో మాఫియాను మేనేజ్ చేసిన సామర్ధ్యం ఉంది. పరిస్థితులను బాలీవుడ్ లో తనకు అనుకూలంగా మలచుకోవడంలో సఫలీకృతమైన వర్మకు ధనలక్ష్మి చుక్కలు చూపించినట్టు వర్మ మాటలతో అర్ధమైంది.
గతంలో ధనలక్ష్మిని బారిన పడిన ఇతర సినీ నిర్మాతలు రాంగోపాల్ వర్మ రియాక్షన్ కు మద్దతుగా నిలిచారు. దేనికైనా రెఢీ చిత్రం విడుదల సందర్భంగా కూడా నిర్మాత మంచు మోహన్ బాబు ఇదే బాధను అనుభవించారు. ఆ సమయంలో ధనలక్ష్మిపై కేంద్ర సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేస్తానని మీడియాలో తెలిపారు. మోహన్ బాబు మాదిరిగానే కాలిచరణ్ దర్శకుడు ప్రవీణ్ శ్రీ, నిర్మాతలు అశ్వినీదత్, దిల్ రాజు ఇతరులు తమ చిత్రాల విడుదల సమయంలో ఇబ్బందిని ఎదుర్కొన్నట్టు సమాచారం. వీరెవ్వరూ కూడా బయటకు చెప్పలేక.. ధనలక్ష్మితో సర్ధుబాటు ధోరణి ప్రదర్శించారు. గత కాలంగా అవకాశం ఎదురు చూస్తున్న బాధితులందరికి వర్మ ఆసరా దొరికింది. ఎందరో నిర్మాతలకు దడ పుట్టిస్తున్న ధనలక్ష్మిని వర్మ సహాయంతో ఎలా చెక్ పెడుతారో వేచి చూడాల్సిందే.
a.rajababu@sakshi.com
Advertisement