నటిపై మంత్రి సెక్యురిటీ సిబ్బంది దాడి
మణిపూర్లో ప్రముఖ ట్రాన్స్జెండర్ నటి, మోడల్ బిశేష్ హురెమ్పై మంత్రి సెక్యురిటీ సిబ్బంది దాడిచేశారు. థాయ్లాండ్లో జరిగే మిస్ ఇంటర్నేషనల్ క్వీన్ 2016 పోటీలకు ఎంపికైన బిశేష్ హురెమ్ను మణిపూర్ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మోయిరంగ్దెమ్ ఒకెండ్రో సిబ్బంది చేయిచేసుకున్నారు. ఇటీవల మణిపూర్ రాజధాని ఇంఫాల్లో బిశేష్తో పాటు ఫ్రెండ్పై దాడి జరిగింది. ఇరుకైన రహదారిలో వెళ్లే విషయంలో మంత్రి సిబ్బందికి, బిశేష్కు వాగ్వాదం జరిగింది. మంత్రి సమక్షంలోనే తమపై దాడి చేశారని, ఆయన సిబ్బందిని ఆపేయత్నం చేయలేదని, కారులోంచి కూడా దిగలేదన్నది బిశేష్ ఆరోపణ.
మిస్ ఇంటర్నేషనల్ క్వీన్ అందాల పోటీల్లో 27 ఏళ్ల బిశేష్ పాల్గొంటున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. కాగా ఈలోగా బిశేష్పై దాడిజరగడంతో చాలామంది షాకయ్యారు. ఫ్యాషన్ డిజైన్లో డిగ్రీ చేసిన మణిపూర్కు చెందిన బిశేష్ ఈశాన్య భారత్లో బాగా పాపులర్.