ఆస్కార్ అవార్డు కమిటీలో భారతీయులు
ఆస్కార్ అవార్డుల ఎంపికలో వర్ణ వివక్ష కనిపిస్తోందనే వాదన ఎప్పట్నుంచో ఉంది. గడచిన ఫిబ్రవరిలో జరిగిన అవార్డు వేడుకలో కొంతమంది నల్ల జాతి నటీనటులు బహిరంగంగానే విమర్శించారు. కొందరు ఈ వేడుకను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ‘ఆస్కార్.. సో వైట్’ అని విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా గౌరవప్రదమైన స్థానం సంపాదించుకున్న ఆస్కార్ అవార్డు ఎంపికల్లో ఇలా జాతి వివక్ష జరగడం సరికాదని పలువురు సినీప్రేమికులు కూడా విమర్శించారు.
ఈ నేపథ్యంలో ఆస్కార్ అవార్డు కమిటీ ఛైర్మన్ చెరిల్ బూనె, ‘‘భవిష్యత్తులో జరగబోయే అవార్డు వేడుకల్లో ఇలాంటి వివాదం రాకుండా చూసుకుంటాం. అకాడమీ నిబంధనలు, కమిటీ సభ్యుల ఎంపిక తదితర విషయాల గురించి క్షుణ్ణంగా చర్చిస్తాం’’ అని వేడుకల సమయంలో పేర్కొన్నారు. ఈ ఏడాది అవార్డు వేడుక ముగిసి నాలుగు నెలలైంది. మరో ఎనిమిది నెలల్లో అవార్డుల వేడుక రానే వస్తుంది. ఈసారి వర్ణ వివక్షకు సంబంధించిన వివాదం రాకూడదనుకున్నారు కాబట్టి, కమిటీ మెంబర్స్ ఎంపిక విషయంలో మరింత జాగ్రత్త వహిస్తున్నారు.
ఈ దిశలో ప్రపంచవ్యాప్తంగా సినిమా రంగంలో విశేష పేరు సంపాదించిన ప్రముఖులను సభ్యులుగా చేర్చుకోవాలని ‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్’ నిర్ణయించుకుంది. ఈ క్రమంలో 683 మంది ప్రముఖులకు ఆస్కార్ అవార్డు కమిటీలో మెంబర్స్‌గా వ్యవహరించాలని కోరుతూ ఆహ్వాన పత్రాలు పంపింది. మన భారతీయ తారల్లో ప్రముఖ నటి షర్మిలా ఠాగూర్, నేటి తరం నాయిక, ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేం ఫ్రీదా పింటో, ప్రముఖ దర్శకురాలు దీపా మెహతాలకు ఆహ్వానం అందింది.
అలాగే, భారతీయ మూలాలున్న బ్రిటిష్ ఫిలిం మేకర్ ఆసిఫ్ కపాడియాని మెంబర్‌గా వ్యవహరించాల్సిందిగా ఆస్కార్ అవార్డ్ కమిటీ కోరింది. ఈ ఏడాది జరిగిన ఆస్కార్ అవార్డు వేడుకల్లో ‘ఎమి’ అనే లఘు చిత్రానికి దర్శకుడిగా ఆసిఫ్ ఆస్కార్ అందుకున్నారు. ‘ది గుడ్ డైనోసార్’ అనే యానిమేషన్ చిత్రానికి యానిమేటర్‌గా చేసిన సంజయ్ బక్షీకి కూడా ఆస్కార్ కమిటీ ఇన్విటేషన్ పంపించింది. ఈయన కూడా భారతీయ మూలాలున్న వ్యక్తే. కమిటీ సభ్యుల ఎంపిక పరంగానే కాకుండా అవార్డు వేడుకను వివాదాలకు తావు లేకుండా నిర్వహించడానికి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ తీసుకుంటోంది ఆస్కార్ అవార్డు కమిటీ.