
అండ్ ది టైటిల్ ఈజ్... సంపూర్ణ రామాయణం
ఇండియన్ సినిమా రేంజ్‌ని పెంచిన ‘బాహుబలి’ తర్వాత... భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించవచ్చనే నమ్మకం చాలామందిలో కలిగింది. 200, 300, 500 కోట్ల బడ్జెట్‌తో సినిమాలు తీయడానికి నిర్మాతలు రెడీ అయిపోతున్నారు. ముఖ్యంగా తెలుగులో 500 కోట్ల సినిమాను మధు మంతెన, నమిత్ మల్హోత్రాలతో కలిసి అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. రామాయణం ఆధారంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో త్రీడీ ఎఫెక్ట్‌తో మూడు భాగాలుగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
ఇంకా దర్శకుడు, నటీనటులు, సాంకేతిక నిఫుణులను సెలక్ట్ చేయలేదు. ప్రస్తుతం ఆ పని మీదే ఉన్నారు. కానీ, టైటిల్‌ని మాత్రం ఫిక్స్ చేశారని తెలుస్తోంది. అండ్ ది టైటిల్ ఈజ్ ‘సంపూర్ణ రామాయణం’ అని అధికారికంగా ప్రకటించలేదు. కానీ, బుధవారం గీతా ఆర్ట్స్ సంస్థ ‘సంపూర్ణ రామాయణం’ అనే టైటిల్‌ని రిజిస్టర్ చేయించడంతో ఇది రామాయణం సినిమాకే అని ఊహించవచ్చు. అక్టోబర్ లేదా నవంబర్‌లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించనున్నారు.