స్వర్గంలో ఉన్నట్లు అనిపించింది! | Is Genelia D'Souza pregnant again? | Sakshi
Sakshi News home page

స్వర్గంలో ఉన్నట్లు అనిపించింది!

Published Fri, Dec 11 2015 11:45 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

స్వర్గంలో ఉన్నట్లు అనిపించింది! - Sakshi

స్వర్గంలో ఉన్నట్లు అనిపించింది!

జెనీలియా మళ్లీ తల్లి కానున్నారా? ప్రస్తుతం బాలీవుడ్‌లో అందరూ ఆసక్తికరంగా చర్చిస్తున్న టాపిక్ అది. జోరుగా షికారు చేస్తున్న ఈ వార్తకు జెనీలియా కానీ, ఆమె భర్త రితేశ్ దేశ్‌ముఖ్ కానీ స్పందించలేదు. మౌనం అర్ధాంగీకారం అంటారనీ, ప్రస్తుతం జెనీలియా గర్భవతి అనీ చాలామంది ఫిక్స్ అయ్యారు. దాచినా దాగదు కాబట్టి, కొన్ని నెలలు ఆగితే అసలు విషయం తెలిసిపోతుంది. జెనీలియా ఇప్పటికే ఒక బాబుకు తల్లి. ముద్దుల కొడుకు రియాన్ మొదటి బర్త్‌డేను మొన్న నవంబర్ 25న ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా అమ్మతనంలోని తీయదనం గురించి జెనీలియా ఏం చెబుతున్నారంటే...
 
 బిడ్డ పుట్టినప్పుడు తల్లి మనోభావాలు విచిత్రంగా ఉంటాయి. ఏం చేయాలి? ఏం చేయకూడదు? అని కంగారుపడిపోయేదాన్ని. ఇంట్లో పెద్దవాళ్లు ఉన్నప్పటికీ ఏదో తెలియని భయం ఉండేది. బయటి ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోయాను. రాత్రింబవళ్లూ రియాన్ గురించే. కొంతమంది పిల్లలు రాత్రిపూట అదే పనిగా ఏడవడం నేను స్వయంగా చూశాను. మా అబ్బాయి కూడా అలానే చేస్తాడని కంగారుపడ్డాను. కానీ, రియాన్ చక్కగా నిద్రపోయేవాడు.
 
 మొదటిసారి బిడ్డను కన్న తల్లికి చుట్టూ ఉన్నవాళ్లు ఏవేవో సలహాలిస్తుంటారు. వాటిల్లో ఏది పాటించాలో తెలియక డైలమాలో పడిపోతాం. అందుకే ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్లుంటే వాళ్ల సలహాలను పాటించాలి. ఎక్కువగా కన్‌ఫ్యూజ్ అయితే మాతృత్వాన్ని ఎంజాయ్ చేయలేం. అందుకే కొత్తగా తల్లయినవాళ్లు ఎలాంటి అపోహలూ, భయాలూ పెట్టుకోకుండా మదర్‌హుడ్‌ను ఎంజాయ్ చేయమని చెబుతున్నాను.
 
 నా బిడ్డకు సంబంధించిన ప్రతి పనీ నేనే స్వయంగా చేస్తాను. సాయంత్రం అయ్యేసరికి బాగా అలసి పోతాను. ఆ అలుపు చాలా తియ్యగా ఉంటుంది. మా అబ్బాయిని పెంచడం మొదలుపెట్టాక నన్ను పెంచిన మా అమ్మ మీద గౌరవం పెరిగింది. అమ్మ కూడా నా మీద ఇంత ప్రాణం పెట్టుకుని, పెంచి ఉంటుంది కదా అనిపించింది.
 
 నా ప్రెగెన్న్సీని డాక్టర్ కన్‌ఫర్మ్ చేయగానే, ‘నువ్వు మాత్రమే కాదు.. నేను కూడా ప్రెగ్నెంటే. ఈ తొమ్మిది నెలల కాలంలో శారీరకంగా నీలో వచ్చే మార్పులు నాకు రాకపోవచ్చు. నీ కష్టాలు కూడా తెలియదు. కానీ, అడుగడుగునా నీకు తోడుంటా’ అని నా భర్త రితేశ్ అన్నప్పుడు చాలా అదృష్టవంతు రాల్ని అనిపించింది. ఆయన మంచి భర్త మాత్రమే కాదు... మంచి తండ్రి కూడా. పిల్లవాడికి డైపర్స్ మారుస్తాడు. స్నానం చేయిస్తాడు. రాత్రి పాలు తాగించేటప్పుడు తను కూడా మేల్కొనే ఉంటాడు. బిడ్డను పెంచడం కేవలం నా ఒక్కదాని బాధ్యత మాత్రమే అని తనెప్పుడూ అనుకోలేదు.
 
 పెళ్లయిన తర్వాత నేనేం మారలేదు. అమ్మ అయ్యాక కూడా మారలేదు. నాలో వచ్చిందల్లా శారీరక మార్పు మాత్రమే. ఆ మార్పును నేను ఆనందంగా అంగీకరిస్తున్నా. ఎందుకంటే, మనం పుట్టిన తర్వాత మన అమ్మ ఇలా బబ్లీగా అయ్యిందని నా కొడుకు తెలుసుకోవాలనుకుంటున్నాను.
 
 ప్రస్తుతం సినీనటిగా లైమ్ లైట్‌లో లేననే బాధ ఇసుమంత కూడా లేదు. అంతకు మించిన ఆనందాన్ని అనుభవిస్తున్నా. అప్పుడప్పుడూ మాత్రమే బయటికి వస్తున్నా. ఆ రిలీఫ్ చాలు. నేను, రితేశ్ మా అబ్బాయి లేకుండా బయటికి వెళ్లం. మేం పిల్లవాడితో కనిపిస్తే చాలు ఫొటోలు తీసేస్తుంటారు. అలా చేయడం మాకు ఇబ్బందిగా ఉంటుంది. అది గ్రహించి ఎవరికి వాళ్లు తమ కెమెరాలను క్లిక్‌మనిపించకుండా ఉండాలని కోరుకుంటాం. ఒకవేళ తీసినా మొహం అదోలా పెట్టుకోం.
 
 నిజం చెప్పాలంటే అమ్మను అయ్యాక స్వర్గంలో ఉన్నట్లుగా అనిపించింది. ప్రతి నెలా బిడ్డలో వచ్చే మార్పు, ఎదుగుదల చూస్తుంటే ఏదో తెలియని ఆనందం కలుగుతుంటుంది. అందుకే అంటారేమో... ‘మదర్‌హుడ్ ఈజ్ మేజికల్’ అని!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement