
'ఈ దుస్థితి రావడం మా ఖర్మ'
తాను జీవితంలో ఎప్పుడూ అబద్ధాలు ఆడబోనని, ముక్కుసూటిగానే వెళ్తానని, ఎవరి బెదిరింపులకూ లొంగేది లేదని రాజేంద్రప్రసాద్ ప్యానల్లో ఉన్న నటుడు శివాజీ రాజా చెప్పారు. హైదరాబాద్లోని ఫిల్మ్ ఛాంబర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆయనతో పాటు ఉత్తేజ్ కూడా రాజేంద్ర ప్రసాద్ ప్యానల్ నుంచి తప్పుకొన్నారని, అందువల్ల ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థులు లేక రాజేంద్రప్రసాద్ తల పట్టుకున్నారని కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో శివాజీరాజా మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
''నేను మురళీమోహన్ దగ్గర 14 సంవత్సరాలు, మోహన్ బాబు దగ్గర 2 ఏళ్లు సెక్రటరీగా చేశాను. మోహన్ బాబు దగ్గర చేసినప్పుడు కోటికి పైగా వసూళ్లు రావాల్సినప్పుడు పగలు, రాత్రి ఎంతో కష్టపడ్డాను. ఆయన నాకు ఎంతో సపోర్ట్ చేశారు. అయినా నాకు తృప్తి లేదు. ఈసారి తామంతా తప్పుకొని, కొత్తవాళ్లకు ఇద్దామని మురళీమోహన్ గారే చెప్పారు. అలాంటిది ఇప్పుడు మాకు ఈ స్థితి రావడం మా ఖర్మ. రాజేంద్రప్రసాద్ విషయానికొస్తే.. ఆయన అందరూ బాగుండాలని కోరుకుంటారు. ప్రెసిడెంటుగా పోటీకి ఎవరూ రాకపోవడంతో మేమే వెళ్లి ఆయనను పోటీ చేయాలని అడిగాం. దేవుడిదగ్గర ఓ గుడిలో లైన్లో ఉన్నప్పుడు.. ఆయన దగ్గర ఈ ప్రస్తావన వస్తే అప్పుడు ఆయనకు సూచించాను. ఏదో చేద్దామన్న తపన తప్ప.. మాకెవరికీ ఏమీ లేదు. రాజేంద్ర ఏదో చేద్దామని మంచితనంగా ముందుకొచ్చాడు.. అందుకే ఆయనకు మేమంతా మద్దతుగానే ఉన్నాం.''