
టైటిల్ : జై లవ కుశ
జానర్ : యాక్షన్, రొమాన్స్, డ్రామా
తారాగణం : ఎన్టీఆర్, రాశీఖన్నా, నివేదా థామస్, పోసాని కృష్ణమురళీ, బ్రహ్మాజీ, సాయికుమార్, ప్రదీప్ రావత్, జయప్రకాష్ రెడ్డి తదితరులు
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్
దర్శకత్వం : కే.ఎస్ రవీంద్ర(బాబీ)
నిర్మాత : కళ్యాణ్ రామ్, హరికృష్ణ
విడుదల తేదీ : 21-09-2017
టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్‌వంటి చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలందుకున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తాజా సినిమా జైలవకుశ. భారీ అంచనాలతో గురువారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలిసారి కుటుంబ బ్యానర్‌లో నటించడంతోపాటు, ఏకంగా మూడు పాత్రల్లో అది కూడా తొలిసారి ఓ నెగేటివ్ షేడ్ ఉన్న పాత్రలో ఎన్టీఆర్ నటించడంతో అభిమానులు మాత్రమే కాకుండా సామాన్య ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తితో ఈ సినిమా చూసేందుకు ఎదురుచూశారు. ముఖ్యంగా ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచి పాత్రల పరిచయాలకు సంబంధించిన టీజర్లు, ట్రైలర్ ఈ చిత్రంపై మరింత హైప్‌ను క్రియేట్ చేశాయి. ఆడియో సందర్బంలో కూడా ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ‘ఏం తీశార్రా అన్నదమ్ములు’ అని చెప్పుకునేలా చిత్రం ఉంటుందని ఎన్టీఆర్ చెప్పడం కూడా మరింత ఆసక్తిని రేకెత్తించింది. ప్రేక్షకుల అంచనాలకు తగినట్లుగానే జైలవకుశలు ఆకట్టుకున్నారో లేదో చూద్దాం.
కథ
జై లవకుశలు ఒకే తల్లి కడుపులో పుట్టిన ముగ్గురు కవల పిల్లలు. వారిలో జై పెద్దవాడు.. అతడికి నత్తి వైకల్యం ఉంటుంది. రూపంలో ముగ్గురు ఒకేలా ఉన్నప్ప టికీ వారితో నాటకాలు వేయించే మేనమామ(పోసాని కృష్ణమురళి) నత్తి కారణంగా జైపై వివక్ష చూపిస్తూ అతడికి అంతగా ప్రాధాన్యం లేని పాత్రలు ఇస్తూ, జైని ఎప్పుడూ తెరవెనుకే ఉంచుతూ లవకుశలకు మంచి పాత్రలు ఇస్తూ వారిని బాగా చూసుకుంటుంటాడు. దీంతో జై లోలోపల కుమిలిపోతుంటాడు. లవకుశలు కూడా జై గురించి పెద్దగా పట్టించుకోకపోవడంతో తన మనసులో వారిపై కాస్త ఈర్ష్య, కోప, పగ భావం పెంచుకుంటాడు. అదే సమయంలో నాటక రంగస్థలంపైనే జై ఓ ప్రమాదం సృష్టిస్తాడు. దాని కారణంగా వారు ముగ్గురు విడిపోతారు. ఒకరికొకరు తెలియకుండానే వేర్వేరుగా బతికేస్తున్న క్రమంలో లవ ఓ బ్యాంకు ఉద్యోగి అవుతాడు. అతడి మంచితనాన్ని అలుసుగా తీసుకొని అందరూ మోసం చేస్తుంటారు. అదే సమయంలో ప్రియ(రాశీ ఖన్నా)తో లవ ప్రేమలో కూడా పడతాడు. కుశ మాత్రం బాల నేరస్తుడిగా జైలుకు వెళ్లొచ్చి చిన్నచిన్న దొంగతనాలు చేస్తూ అమెరికా వెళ్లాలని కలలు కంటుంటాడు. పెద్ద మొత్తంలో ఏదో ఒకలా డబ్బు పోగేసుకుని, ఆ డబ్బుకాస్త పెద్ద నోట్ల రద్దు కారణంగా చెల్లనిదై పోయి దీర్ఘ ఆలోచనలో ఉండగా అనూహ్యంగా లవను కలుస్తాడు. ఇక అదే సమయంలో మరోచోట పెరుగుతున్న జై మాత్రం పెద్ద డాన్‌గా మారతాడు. రావణాసూరుడి పాత్రకు ఆకర్షితుడై అతడి పేరును కూడా రావణ్ మహారాజ్‌గా మార్చుకొని ఒడిశాలోని బైరంపూర్ అనే ప్రాంతంలో హవా చూపిస్తుంటాడు. ఆ క్రమంలోనే జైకు ఓ సమస్య వస్తుంది. ఆ సమస్యలో నుంచి బయటపడేందుకు జై లవకుశను తన వద్దకు ఎత్తుకెళుతాడు. వారు తాను చెప్పినట్లు వినేలాగా ప్రియను, కుశ దాచుకున్న సొమ్మును కూడా తీసుకెళతాడు. అయితే, అలా తీసుకెళ్లిన తన సోదరులపై జై కక్ష తీర్చుకుంటాడా? అలా అనూహ్యంగా జై వద్దకు వెళ్లిన లవకుశలు ఎలా స్పందిస్తారు? ఇంతకీ జైకి వచ్చిన సమస్య ఏమిటి? అందులోనుంచి లవకుశలు జైని బయటపడేశారా? లేదా లవకు ప్రియను జై ఇచ్చేస్తాడా? ముగ్గురు అన్నదమ్ములు తిరిగి మునుపటిలాగా కలుసుకుంటారా లేదా అనేది వెండితెర మీద చూడాల్సిందే.
నటీనటులు
ఇది కచ్చితంగా ఎన్టీఆర్ వన్ మేన్ షో అని చెప్పక తప్పదు. ముఖ్యంగా జై క్యారెక్టర్‌ను భద్రంగా మనసులోకి పెట్టుకొని ప్రేక్షకుడు బయటకు వస్తాడు. మూడు పాత్రల్లో ఎన్టీఆర్ ఒదిగిపోయిన తీరు అద్భుతం. జై పాత్ర ద్వారా అసలైన రౌద్రాన్ని, లవ పాత్ర ద్వారా సున్నిత మనస్తత్వాన్ని, కుశుడి పాత్ర ద్వారా చలాకీతనాన్ని ఎన్టీఆర్ పండించాడు. కుశ పాత్ర ద్వారా కామెడీ కూడా ఇరగదీశాడు. పౌరాణిక పాత్రలకు సంబంధించిన డైలాగ్‌లతో కట్టిపడేశాడు. మాస్ ప్రేక్షకులను జై కట్టిపడేస్తే.. ఫ్యామిలీ కథా చిత్రాల ప్రేక్షకులను లవకుశ పాత్రలు మెప్పిస్తాయి. ఇక హీరోయిన్లుగా నటించిన రాశీ ఖన్నా, నివేదా థామస్‌ల యాక్షన్‌కు పెద్ద అవకాశం లేకపోయినా.. చిత్ర కథ ముందుకు వెళ్లడంలో వారి పాత్రలు కూడా కీలకమే. ఐటం సాంగ్‌లో నటించిన తమన్నా తన డ్యాన్స్, గ్లామర్ ఆరబోతతో ఆకట్టుకుంది. ప్రదీప్ రావత్‌లాంటి నటులు విలనిజంతో మెప్పించారు.
సాంకేతిక వర్గం
తెలిసిన కథే అయినప్పటికీ బాబీ అద్భుతంగా తెరకెక్కించారు. ఇదివరకు ఎవరూ తీసుకొని కోణంలో కథను రాసుకొని తను అనుకున్న దాన్ని తెరపై చూపించారు. ముఖ్యంగా జైలవకుశ పాత్రలను బ్యాలెన్స్ చేయడంలో సక్సెస్ అయ్యారు. తక్కువ సమయంలోనైనా మనసుపెట్టి ఈ చిత్రాన్ని ఆయన తెరకెక్కించారు. నిజానికి బాబీ ఈ చిత్రానికి ఎన్టీఆర్‌ను హీరోగా ఎంచుకోవడంతోనే తొలి విజయం సాధించినట్లు అనుకోవచ్చు. చోట కే నాయుడు కెమెరా పనితనం చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ను ఆయన పొదివి పట్టుకున్నారు. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఇక దేవీశ్రీ మ్యూజిక్ కూడా ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అయింది. ముఖ్యంగా సెంటిమెంట్ సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇచ్చారు.
హైలెట్స్
ఎన్టీఆర్ నటన
కథను కొత్తగా నడిపించిన తీరు
పిల్లల పెంపకానికి సంబంధించిన పాయింట్‌ను కథగా ఎంచుకోవడం
మైనస్ పాయింట్లు
సెకండాఫ్‌లో కొంచెం స్లో నెరేషన్..!
మొత్తంగా చెప్పాలంటే.. జైలవకుశలు ప్రేక్షకులను బాగా అలరిస్తారు
- ఎం. నాగేశ్వరరావు, ఇంటర్నెట్ డెస్క్