
త్రివిక్రమ్ శ్రీనివాస్
జై లవ కుశ సక్సెస్ తరువాత గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ త్వరలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనుంది. అయితే ఈ సినిమా కథకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి కొద్ది రోజులుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ప్రముఖ రచయిత మధుబాబు నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది.
ఈ వార్తలపై రచయిత మధుబాబు క్లారిటీ ఇచ్చారు. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మధు బాబు స్పందించారు. ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న సినిమాకు తాను కథ అందిస్తున్నట్టుగా వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. అసలు త్రివిక్రమ్ తనను కథ విషయంలో సంప్రదించలేదని క్లారిటీ ఇచ్చారు. అయితే అవకాశం వస్తే సినిమాలకు కథ అందించేందుకు సిద్ధమని మధుబాబు తెలిపారు.