
భర్త నితిన్ కపూర్‌తో జయసుధ(ఫైల్)
- ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య
- కొద్దిరోజులుగా ముంబైలోని సోదరి నివాసంలో ఉంటున్న నితిన్ కపూర్
- డిప్రెషన్‌తో బాధపడుతున్న నితిన్
- ఆత్మహత్యకు అదే కారణం!
- మృతి పట్ల ప్రముఖుల సంతాపం
సాక్షి, ముంబై/హైదరాబాద్: ప్రముఖ సినీనటి జయసుధ భర్త నితిన్ కపూర్(58) ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొద్దిరోజులుగా ముంబైలోని అంధేరి ప్రాంతంలోని తన సోదరి నివాసంలో ఉంటున్న ఆయన.. మంగళవారం మధ్యాహ్నం బిల్డింగ్ ఆరో అంతస్తుపై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నారు. డిప్రెషన్‌తో బాధపడుతున్న నితిన్ ఏడాదిన్నరగా సైకియాట్రిస్ట్ వద్ద చికిత్స పొందుతున్నారు. డిప్రెషన్ కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకొని ఉంటారని అనుమానిస్తున్నారు. భర్త మృతి వార్త తెలియగానే జయసుధ ఇద్దరు కుమారులతో కలసి హుటాహుటిన ముంబై బయల్దేదారు. మూడేళ్లుగా జయసుధ కుటుంబం గండిపేట మండలం నెక్నాంపూర్ పంచాయతీ పరిధిలోని ఫైర్‌ఫీల్డ్ గేటెడ్ కమ్యూనిటీ కాలనీలో నివసిస్తోంది. జయసుధ–నితిన్ దంపతులకు నిహార్, శ్రేయాన్ ఇద్దరు కుమారులు. రెండేళ్ల క్రితం తెలుగు సినిమా ‘బస్తీ’ద్వారా శ్రేయాన్ హీరోగా తెరంగేట్రం చేశారు.
జయసుధ ప్రతి అడుగులోనూ నితిన్‌కపూర్ అండగా నిలిచారు. ఒకప్పటి ప్రముఖ హిందీ హీరో జితేంద్రకు ఈయన వరుసకు సోదరుడు. నితిన్ కపూర్‌ను దర్శకుణ్ణి చేయాలనేది జితేంద్ర కోరిక. సుమారు 200 సినిమాల్లో హీరోగా నటించిన జితేంద్ర.. పలు తెలుగు సినిమాలను హిందీలో రీమేక్ చేశారు. అప్పుడు దర్శకరత్న దాసరి నారాయణరావు వద్ద తమ్ముడు నితిన్‌ని సహాయ దర్శకుడిగా చేర్చారు. రాజేశ్‌ఖన్నా హీరోగా దాసరి దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘ఆశాజ్యోతి’తో పాటు పలు చిత్రాలకు ఆయన వద్ద నితిన్ సహాయ దర్శకుడిగా పనిచేశారు.
అప్పట్లో దాసరి దర్శకత్వం వహించిన సినిమాల్లో ఎక్కువగా జయసుధ హీరోయిన్‌గా నటించారు. సహాయ దర్శకుడిగా పనిచేస్తున్న నితిన్‌కపూర్‌తో జయసుధకు ఏర్పడిన పరిచయం కొన్నాళ్లకు స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది. కానీ ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి ఈ జంట కొంచెం కష్టపడాల్సి వచ్చింది. జయసుధ తెలుగమ్మాయి, నితిన్ ఉత్తరాది కావడంతో మొదట ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. దర్శకులు దాసరి, రాఘవేంద్రరావు కుటుంబ పెద్దలను ఒప్పించడంలో సహాయం చేశారు. జితేంద్ర కోరుకున్నట్టు నితిన్‌కపూర్ దర్శకుడు కాలేకపోయినా.. నిర్మాతగా మారారు. జయసుధతో కలసి జేఎస్‌కె బ్యానర్ స్థాపించి, ‘కాంచనసీత’, ‘కలికాలం’, ‘హ్యాండ్సప్’, ‘మేరాపతి సిర్ఫ్ మేరా’చిత్రాలను నిర్మించారు. పలువురు తెలుగు, తమిళ, హిందీ సినీ ప్రముఖులతో నితిన్‌కపూర్‌కు సత్సంబంధాలున్నాయి. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.