
నేను.. మావారు: జయసుధ
హైదరాబాద్ : తన భర్త నితిన్ కపూర్ ఆత్మహత్య విషయాన్ని సంచలనం చేయకుండా, సంయమనం పాటించినందుకు సీనియర్ నటి జయసుధ ఫేస్‌బుక్ ద్వారా మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె తమ దాంపత్య జీవితంపై పలు విషయాలను ఆమె పంచుకున్నారు.
‘ఇవాళ నా పెళ్లి రోజు. 32 ఏళ్ల క్రితం నేను, నితిన్ కపూర్ ఇదేరోజు ఒకటయ్యాం. మేం గడిపిన మధుర క్షణాలు గుర్తుకు వస్తున్నాయి. నితిన్ గురించి నాకు అన్ని విషయాలు తెలుసు. కానీ ఆయన ఇప్పుడు దేవతలతో ఉన్నారు. డిప్రెషన్ అనేది చాలా తీవ్రమైంది. ఇది మా జీవితాల్లో చీకటి రోజులు. నాకు, మా కుటుంబానికి మద్దతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు’ అంటూ నితిన్ కపూర్‌తో కలిసి దిగిన ఫోటోను జయసుధ తన ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.
(జయసుధ భర్త ఆత్మహత్య)
కాగా జయసుధ భర్త నితిన్ కపూర్(58) ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ముంబైలోని అంధేరి ప్రాంతంలోని తన సోదరి నివాసంలో ఆయన మంగళవారం మధ్యాహ్నం బిల్డింగ్ ఆరో అంతస్తుపై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నారు. డిప్రెషన్‌తో బాధపడుతున్న నితిన్ ఏడాదిన్నరగా సైకియాట్రిస్ట్ వద్ద ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.