మరో నటుణ్ని చంపేసిన సోషల్ మీడియా
ముంబై: హాలీవుడ్ హీరో, కాలిఫోర్నియా మాజీ గవర్నర్ ఆర్నాల్డ్ ఆర్నాల్డ్ స్క్వార్జ్ నెగర్ నుంచి మొదలుపెడితే బాలీవుడ్ యువ సంచలనం ఆయుష్మాన్ ఖురానా, టాలీవుడ్ నటుల్లో ఎమ్మెస్ నారాయణ.. ఇలా ప్రాణాలు పోకముందే సోషల్ మీడియాలో చనిపోయిన నటుల జాబితా పెద్దదే. ఇప్పుడు వంతు బాలీవుడ్ వెటరన్ నటుడు, రచయిత ఖాదర్ ఖాన్ ది.
ఆరోగ్యం సహకరించకపోవడంతో చాలా కాలం కిందటే సినిమాలకు దూరంగా ఉంటోన్న ఖాదర్ ఖాన్ చనిపోయారంటూ వేల సంఖ్యలో సందేశాలు సోషల్ మీడియాలో బట్వాడా అయ్యాయి. పలువురు అభిమానులు ఆయనకు నివాళులు అర్పించారేగానీ అసలావార్త నిజమాకాదా అన్న విషయాన్ని పట్టించుకోలేదు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలు చూసి కంగారుపడి, ఖాదర్ ఖాన్ కుటుంబీకులకు ఫోన్ చేసి విషయం కనుక్కున్న తర్వాత మీడియాకు అసలు విషయం చెప్పారు దర్శకురాలు ఫౌజీ ఆర్షీ.
'ఖాదర్ ఖాన్ అనారోగ్యంగా ఉన్న సంగతి నిజమేకానీ, చనిపోవటం మాత్రం అవాస్తవం. కొద్దిసేపటి కిందటే ఆయనతో ఫోన్లో మాట్లాడాను. ఇలా బతికున్నవాళ్లను చనిపోయారంటూ పుకార్లు సృష్టించడం ద్వారా వాళ్ల కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారో ఆలోచించారా?' అని ఆవేదన వ్యక్తం చేశారు ఫౌజీ. ఆమె దర్శకత్వం వహించిన 'హోగయా దిమాంగ్ కా దహి' సినిమాయే ఖాదర్ ఖాన్ ఇటీవల నటించిన చిత్రం. 78 ఏళ్ల ఖాదర్ నడవటం, మాట్లాడటంలో ఇబ్బందులు పడుతూ ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నారు.