చల్లని నరకం!
ఎముకలు కొరికే చలి. ఆ చలి తెలియకుండా ఉండాలంటే మందపాటి డ్రెస్సులు వేసుకోవాలి. చేతికి గ్లౌజులు, కాళ్లకు సాక్సులూ ఉంటేనే ఎంతో కొంత చలి తెలియకుండా ఉంటుంది. కానీ, చిట్టిపొట్టి దుస్తులు వేసుకుంటే మాత్రం ప్రత్యక్ష నరకం కనిపిస్తుంది. అందాల కథానాయికలు ఇలాంటి పరిస్థితిని చాలాసార్లు ఎదుర్కొంటారు. పాటల చిత్రీకరణను చలి ప్రాంతాల్లో జరిపినప్పుడు వాళ్లు పడే పాట్లు మామూలుగా ఉండవు. ఈ విషయం గురించి కాజల్ అగర్వాల్ దగ్గర ప్రస్తావిస్తే – ‘‘లొకేషన్లో మేం (హీరోయిన్లు) తప్ప మిగతా అందరూ చలి నుంచి కాపాడుకోవడానికి స్వెటర్లు వేసుకుంటారు. హీరోలు కూడా ఫుల్ కవర్డ్‌గా ఉంటారు. వాళ్లను చూసి, నిట్టూర్పు వదలడం మినహా ఏం చేయగలం? ఇలాంటి కష్టాలను తట్టుకోవడానికి ప్రిపేర్ అయిపోవాలి.
‘మన ప్రొఫెషన్ ఇంతే. ఇలానే ఉంటుంది’ అని పదే పదే చెప్పుకుంటేనే ఇక్కడ కొనసాగగలుగుతాం. ఆ సంగతి పక్కన పెడితే, అసలు సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడే మొహమాటం, బిడియం వంటి కొన్ని లక్షణాలను వదిలేయాలి. సిగ్గుపడితే నలుగురిలో నటించలేం. మేం వింత వింత కాస్ట్యూమ్స్ వేసుకుంటాం. ఒంటి మీద ఉన్న ఆ డ్రెస్సు గురించి పట్టించుకుంటే ధ్యాస నటన మీద ఉండదు. చుట్టూ అందరూ ఉన్నారు కదా అని ఆలోచిస్తే, యాక్ట్ చేయడం కష్టమవుతుంది. అందుకే, కళ్లెదుటే జనాలు ఉన్నా లేనట్లే ఊహించుకోవాలి. ఒక్కోసారి నేను రాత్రి ఒంటి గంటకు నిద్రపోయి, ఉదయం ఐదు గంటలకల్లా నిద్ర లేచి, షూటింగ్‌కి వెళ్లిపోతాను. అంత హార్డ్‌వర్క్ చేస్తేనే కెరీర్ ఉంటుంది. లేకపోతే ఇంటికి వెళ్లిపోవాల్సిందే’’ అన్నారు. పాయింటే కదా!