కాజల్‌అగర్వాల్
సినిమా: కాజల్‌అగర్వాల్ ఈ పేరు చుట్టూ చాలా విషయాలు ఉంటాయి. ముఖ్యంగా బహుభాషా నటి. పంజాబీ కుటుంబం నుంచి వచ్చిన ఈ బ్యూటీ ఆదిలో హింది చిత్రం ద్వారా నటిగా రంగప్రవేశం చేసినా, స్టార్ హీరోయిన్‌ను చేసింది తెలుగు, తమిళ సినిమాలే. కథానాయకిగా పుష్కర కాలాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న కాజల్ సినిమాల పరంగా అర్ధసెంచరీ కొట్టేసి నాటౌట్‌గా నిలిచింది. అయితే ఇటీవల విజయాలు మాత్రం ముఖం చాటేస్తున్నాయి. మెర్షల్ చిత్రం తరువాత ఈ అమ్మడు కోలీవుడ్‌లో సక్సెస్‌ను చూడలేదు. టాలీవుడ్‌లోనూ అదే పరిస్థితి. ఇకపోతే ఈ బ్యూటీ నటించిన హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రం ప్యారీస్ ప్యారీస్ నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని చాలా కాలం అయినా ఇంకా తెరపైకి రాలేదు. ఇది కాజల్‌ను చాలా ఆశగా ఎదురు చూసేలా చేస్తున్న చిత్రం. కారణం హిందిలో సంచలన విజయాన్ని సాధించిన క్వీన్ చిత్రానికి రీమేక్ కావడమే. ఇక ఈ జాణను నిరాశ పరుస్తున్న విషయం ఇండియన్–2 చిత్రం.
ఇందులో కమలహాసన్‌కు జంటగా శంకర్ దర్శకత్వంలో తొలిసారిగా నటించే అవకాశం వచ్చిందనుకునేలోపే ఈ చిత్రం ప్రారంభం అయినట్లే అయ్యి ఆగిపోయింది. అందుకు పలు కారణాలు. అది ఎప్పుడు ప్రారంభం అవుతుందో, అసలు ఉంటుందో, లేదో తెలియని అయోమయ పరిస్థితి. ప్రస్తుతం తమిళంలో జయంరవి సరసన నటిస్తున్న కోమాలి, తెలుగులో రణరంగం అనే చిత్రం. ఈ రెండూ చిత్రాల నిర్మాణం చివరి దశకు వచ్చింది. చేతిలో మరో చిత్రం లేదు. అయినా ఈ అమ్మడు పారితోషికం విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. అందుకు కారణం తెలుగులో రాజుగారి గది–3 చిత్రంలో నటించే అవకాశం రాగా, కాజల్ అగర్వాల్ అడిగిన పారితోషికం ఆ చిత్ర నిర్మాతలకు స్పృహ తప్పేలా చేసిందట. దీంతో అంతకన్నా తక్కువ పారితోషికానికి నటించే వేరే నటిని చేసుకుంటామని ఆ చిత్ర నిర్మాతలు వెళ్లిపోయినట్లు సమాచారం. పారితోషికం తగ్గిస్తే మార్కెట్ తగ్గిపోయిందని ప్రచారం చేస్తారనే భయమో, లేక తన క్రేజ్ ఇంకా తగ్గలేదనే ధీమానో కానీ ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట. కాగా మరో పక్క అవకాశాల గాలం కోసం కాజల్ అగర్వాల్ కొత్త కొత్తగా ఫొటో సెషన్లు తీయించుకుంటూ వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూనే ఉంది. అన్నట్టు ఇటీవల ఈ సక్కనమ్మ చాలా చిక్కి మరింత నాజూగ్గా తయారైంది. ఆ ఫొటోలే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment