
వంద కోట్ల క్లబ్‌లో కాంచన-2
కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. వంద కోట్ల క్లబ్‌లో చేరడం అంటే ఇంతకుముందు బాలీవుడ్ చిత్రాలకే సాధ్యం అనుకునేవారు. అలాంటిదిప్పుడు కోలీవుడ్ దాన్ని అధిగమించే స్థాయికి చేరుకుంది. అయితే ఇక్కడైనా భారీ చిత్రాలు వసూళ్లు సాధించాయంటే అతిశయోక్తి కాదు. ఎలాంటి అంచనాలు లేని కాంచన-2 చిత్రం అనూహ్య విజయాన్ని సాధించడంతో పాటు 100 కోట్లు వసూళ్లు సాధించిన అతి తక్కువ చిత్రాల సరసన నిలవడం విశేషం.
దీనికి కర్త, కర్మ, క్రియ లారెన్స్‌నే. ఆయన నటనా చాతుర్యం, దర్శక నైపుణ్యం, నిర్మాణ దక్షతనే ప్రధాన కారణం. ఆయన నటించి దర్శకత్వం వహించిన ముని చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. అయినా దానికి సీక్వెల్‌గా కాంచన చిత్రం చేసి విజయం సాధించారు.ఆ తరువాత దానికి కొనసాగింపుగా కాంచన-2 తెరకెక్కించి ఘనవిజయాన్ని అందుకున్నారు. నిజానికి ఈ చిత్ర నిర్మాణంలో లారెన్స్ చాలా ఎదురు దెబ్బలు తిన్నారు. షూటింగ్‌లో ఆపదకు గురై చాలా రోజులు విశ్రాంతి తీసుకోవలసి వచ్చింది. దీంతో కాంచన-2 షూటింగ్ రద్దుకాక తప్పలేదు.
ఈ కారణాల వలన చిత్ర షూటింగ్‌లో జాప్యం జరిగింది. అసలు చిత్రం పూర్తి అవుతుందా? తెరపైకి వస్తుందా? అనే సందేహాలతో కూడిన ప్రచారం కూడా కోలీవుడ్‌లో హల్‌చల్ చేసింది. ఇలాంటి పనికి మాలిన ప్రచారాన్ని పెడచెవిన పెట్టి ఆకుంఠిత దీక్షతో లారెన్స్ తన పని తాను చేసుకుంటూ పోయారు. ఫలితం ఈ ఏడాది తొలి బ్లాక్‌బస్టర్ చిత్రంగా కాంచన-2 నమోదైంది. చిత్రం విడుదలై అర్ధశతదినోత్సవం పూర్తి చేసుకుని ఇంకా కొన్ని సెంటర్లలో ప్రదర్శింపబడుతున్న కాంచన-2 ,17 కోట్ల ఖర్చుతో రూపొంది 108 కోట్లు వసూలు చేసిందని బాక్సాఫీస్ గణాంకాల మేధ త్రినాథ్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఇవేవి పట్టించుకోని లారెన్స్ కాంచన-3కి సన్నాహాలు చేస్తున్నారు.